– సీసీఐని పునః ప్రారంభిస్తామని ఓట్లు, సీట్లు దండుకుని చివరికి స్క్రాప్ కింద అమ్మేస్తారా ?
-ఎక్స్ వేదికగా బీజేపీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత దుర్మార్గం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీసీఐని పునఃప్రారంభిస్తామని మాటిచ్చి, ఓట్లు, సీట్లు దండుకుని చివరికి స్క్రాప్ కింద అమ్మేస్తారా ?
సీసీఐపైనే కోటి ఆశలు పెట్టుకుని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? వారి ఆర్థనాదాలు వినిపించడం లేదా ? ఎంతో విలువైన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్కకట్టి ఆన్ లైన్ లో టెండర్లు పిలవడం, సీసీఐ సంస్థ గొంతు కోయడమే.
నిర్మాణ రంగంలో సిమెంట్ కున్న డిమాండ్ దృష్ట్యా సీసీఐని ప్రారంభించి కార్మికులను కాపాడాలని బీఆర్ఎస్ పదుల సార్లు కేంద్రమంత్రులకు మొరపెట్టుకున్నా కనికరించకపోవడం ఆదిలాబాద్ కు వెన్నుపోటు పొడవడమే. 772 ఎకరాల భూమి, 170 ఎకరాల్లో టౌన్ షిప్, 48 మిలియన్ లైమ్ స్టోన్ నిల్వలతో సకల వనరులున్న సంస్థను అంగడి సరుకుగా మార్చేసిన కేంద్రానికి ఉద్యోగులు, కార్మికుల గోస తగలక మానదు. ఈ అనాలోచిత నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే దాకా కార్మికులతో కలిసి ఉద్యమిస్తాం.. సంస్థ పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోరాడతాం.