మీ చిల్లర బుద్దిని చూడలేకే…

-మీ కమీషన్ల కోసం పంచాయతీ నిధుల దారి మళ్లింపును ఆపేందుకే…
-73, 74 రాజ్యాంగ సవరణ స్పూర్తి మేరకే గ్రామాలకు నేరుగా నిధులు
-మీ పాలనలో సర్పంచులు అడుక్కుతినే దుస్థితికి చేరింది వాస్తవం కాదా?
-మీ తప్పులను ప్రశ్నించిన సర్పంచులను సస్పెండ్ చేస్తున్నది నిజం కాదా?
-ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్

• గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర వ్యవహారంగా పేర్కొంటూ తప్పుపట్టడం అత్యంత దురద్రుష్టకరం. నిధులు, విధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశం. రాజ్యాంగ స్పూర్తి మేరకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులిస్తూ లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తోంది.

• విద్య, వైద్యంసహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా… రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడుస్తూ గ్రామ పంచాయతీల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నది నిజం కాదా? రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్లు సహా వివిధ పథకాలకు సంబంధించి లబ్ది దారుల ఎంపిక గ్రామ సభల ద్వారానే జరగాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా వాటిపై ఎమ్మెల్యేలకు పెత్తనమిచ్చి గ్రామ పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన కేసీఆర్ ది చిల్లర బుద్ది కాక ఏమనాలి?

• గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కమీషన్ల కోసం కక్కుర్తిపడి పక్కదారి పట్టిస్తూ గ్రామాలను పూర్తిగా నీరుగారుస్తున్నది కేసీఆర్ కాదా? కమీషన్ల కోసం ట్రాక్టర్లు కొంటున్నది వాస్తవం కాదా? కేంద్ర నిధులను జీతాలకు మళ్లిస్తోంది నిజం కాదా? గ్రామాల్లో చేసిన అభివ్రుద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది నిజం కాదా? కేసీఆర్ చేతగానితనంవల్ల సర్పంచులు ఉన్న ఆస్తులను అమ్ముకుని అప్పులపాలై ఉపాధి కూలీలుగా, వాచ్ మెన్లుగా, సెక్యూరిటీ ఉద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్నది వాస్తవం కాదా?

• ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులివ్వకుండా ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నది కేసీఆర్ కాదా? తండాలను పంచాయతీలుగా మార్చి నిధులివ్వకుండా తండాలను నిర్వీర్యం చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? కేసీఆర్ అవినీతిని, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులపై నిలదీస్తున్న సర్పంచులపై అక్రమంగా కేసులు పెట్టి సస్పెండ్ చేస్తున్న మాట నిజం కాదా? కేసీఆర్ కుటుంబ అవినీతికి మడుగులొత్తే ప్రజా ప్రతినిధులను అందలమెక్కిస్తూ.. ఇతర పార్టీల సర్పంచులు-ఉప సర్పంచుల మధ్య కొట్లాటి పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు యత్నిస్తున్న విషయం వాస్తవం కాదా?

• కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో వేల కోట్ల కమీషన్లు దండుకుని తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించి అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేయడం సిగ్గు చేటు.

• కేంద్రం నుండి రాష్ట్రాలకు వికేంద్రీకరణ జరగాలని నీతులు చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాల నుండి గ్రామాలకు నిధులు, విధులను ఎందుకు వికేంద్రీకరించడం లేదో రాష్ట్ర ప్రజలకు ముందు సమాధానం చెప్పాలి.

• జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేస్తున్నా… వాటిని నెలల తరబడి చెల్లించకుండా కూలీలను అరిగోస పెడుతున్నది వాస్తవం కాదా? నా ప్రజా సంగ్రామ యాత్రలో అనేక చోట్ల ఉపాధి కూలీలు వచ్చి తమకు ఉపాధి కూలీ సొమ్ము అందడం లేదంటూ గోడు వెళ్లబోసుకున్నది నిజం కాదా?

• కష్టాల్లో పేదలకు కడుపు నిండా తిండి పెట్టేందుకు కేంద్రం ప్రతినెలా 5 కేజీల బియ్యం ఉచితంగా పంపిస్తే… వాటిని అందకుండా చేసి పేదల నోటికాడ ముద్దను లాక్కుంటున్నది కేసీఆర్ కాదా?

• గ్రామాల్లో ఎల్ఈడీ బల్పుల కోసం నిధులిస్తే… కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఒకే సంస్థకు కట్టబెట్టేలా గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపాలంటూ హుకూం జారీ చేసింది నిజం కాదా?

• గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు, స్మశాన వాటికలు, పల్లె ప్రక్రుతి వనాలు, మరుగు దొడ్లు, డంపింగ్ యార్డులకు కేంద్రం నిధులిస్తున్న మాట వాస్తవం కాదా? ఆయా నిధుల్లోనూ అవినీతికి ఆస్కారం ఇచ్చేలా నచ్చిన కాంట్రాక్టర్ కు పనులు అప్పగించిన మాట వాస్తవం కాదా?

• కేసీఆర్ అవినీతిపై సర్పంచులు పెద్ద ఎత్తున గళమెత్తడంతోపాటు నేరుగా పంచాయతీలకు నిధులివ్వాలంటూ కేంద్రానికి లేఖలు రాసిన మాట నిజం కాదా? కేంద్రం ఇచ్చే నిధులతోనే గ్రామాల్లో నేడు అభివ్రుద్ధి జరుగుతున్నది వాస్తవం కాదా? మధ్య దళారుల ప్రమేయం లేకుండా కేసీఆర్ అవినీతికి అడ్డుకట్ట వేయాలనే సదుద్దేశంతో వికేంద్రీకరణే లక్ష్యంగా కేంద్రం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిస్తుంటే… ఓర్వలేక కేసీఆర్ పిచ్చిప్రేలాపనలు చేయడం సిగ్గు చేటు.

• గ్రామ పంచాయతీలంటే ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి కేసీఆర్. జాతీయ పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా అన్ని రాష్ట్రాలు ఏటా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఫాంహౌజ్ కే పరిమితమైన సీఎం కేసీఆర్ మాత్రమే… కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా కాశ్మీర్ వ్యాలీలోని ఓ కుగ్రామానికి వెళ్లి సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని పంచాయతీల ప్రాముఖ్యతను చాటిచెప్పిన గొప్ప నాయకుడు. ఆ మహనీయుడి ఆధ్వర్యంలో పాలన కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఇకనైనా మానుకోవాలి. లేనిపక్షంలో విజ్ఝులైన రాష్ట్ర ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.

Leave a Reply