– తెలంగాణను అప్పులపాలు చేసిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్
– ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
– పటాన్ చెరు లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పఠాన్ చెరు : 2014 ముందు దేశం ఏ విధంగా ఉండేదో, నేడు ఏ విధంగా ఉందో ఉపాధ్యాయులు, పట్టభద్రులు రాష్ట్రప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
2014కు ముందు ఉగ్రదాడులు, కర్ఫ్యూలు, దాడులు బాంబ్లస్ట్ లే చూసేవారమన్నారు. లుంబినీ, గోకుల్ చాట్, దిల్ సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ వద్ద పేలుళ్లు జరిగాయన్నారు. మెహిదీపట్నంలో అడిషనల్ ఎస్పీ కృష్ణ ప్రసాద్, ఎసీపీ సత్తయ్యను ఉగ్రవాదులు చంపారన్నారు. ముంబాయిలో మధ్యాహ్నం 2 గంటలకు ఏడు రైళ్లను పేల్చిన చరిత్ర ఉగ్రవాదులదన్నారు. మోదీ పాలన పదేళ్లలో పరిస్థితులను దేశ ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. పాక్ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశామన్నారు.
ఈ నెల 27న జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్ చెరులో జరిగిన సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.
1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 360 మందిని చంపించారన్నారు. ఊరేగింపులు, ఉద్యమాలేంటని కర్కశంగా చంపారన్నారు. ఏడో తరగతి విద్యార్థిని రేణుక కూడా అప్పుడు చనిపోయిందని గుర్తు చేశారు. 2014లో ఆంధ్ర నుంచి విడిపోతున్నప్పుడు తెలంగాణ బడ్జెట్ అన్ని ఖర్చులు పోనూ ఆదాయంలో మిగులు ఉండేదన్నారు. ధనిక రాష్ట్రంగా ఉండేదన్నారు. కేసీఆర్ పుణ్యమా అని 8 లక్షల కోట్లు అప్పు అయ్యిందన్నారు.
అప్పుచేసి దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రియల్ఎస్టేట్, కాంట్రాక్టర్లు ఏ ఒక్కరూ సంతోషించడం లేదన్నారు. ప్రభుత్వం టెండర్లు వేస్తే పాల్గొనే పరిస్థితి లేదన్నారు. జీహెచ్ ఎంసీలో వీధి లైట్లను వేసే వారికి కూడా ఏడు నెలలుగా జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఐదువేల కోట్ల రూపాయలు జీహెచ్ ఎంసీ బాండ్లు ఉంటే అవి కూడా కరిగిపోయాయన్నారు. జీహెచ్ ఎంసీ మౌలిక వసతులు కల్పించే పరిస్థితుల్లో లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్రం ఏమైపోయినా పరవాలేదన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాలు పూర్తి దివాలా తీశాయని, ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ ప్రభుత్వం కూడా దివాలా దిశగా కొనసాగుతుందన్నారు. ఆదాయానికి మించి ఖర్చు చేస్తే అభివృద్ధి, ప్రజలపై పరిణామాలు పడతాయన్నారు. హిమాచల్ లో జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ పార్టీల విధానాలతో నష్టపోయేది తెలంగాణ ప్రజలే అన్నారు. పేదవారు, మధ్య తరగతి వారే నష్టపోతారన్నారు. కాబట్టి మేధావులు ఈ రాష్ట్రం ఎటుపోతుందో అని ఆలోచించాలని, ముందుచూపుతో తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన గోదావరి, పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, రాజేశ్వర్ రావు, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ గుప్త, వెంకటేశ్, శ్రీనివాస్, శిల్పా తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.