Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునాదిలా బడ్జెట్

– బీసీ వర్గాల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
– మే నుంచి మొదలయ్యే సూపర్ సిక్స్‌ పథకాలకు భారీ కేటాయింపులు
– స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనకు రోడ్‌మ్యాప్‌గా నేటి బడ్జెట్
– 2025-26 రాష్ట్ర బడ్జెట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన

అమరావతి : సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యంగా తమ ప్రభుత్వం నిత్యం పనిచేస్తోందని… దానిలో భాగంగా 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి పునాదిలా నిలుస్తుందని దృఢంగా నమ్ముతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు.

గత పాలకుల విధ్వంస పాలనలో నిర్వీర్యమైన వ్యవస్ధలను నిలబెట్టేందుకు ప్రతి క్షణం పనిచేస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి ఆర్థిక సవాళ్లు ఉన్నా… 8 నెలల కాలంలోనే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, దీపం వంటి పథకాలతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన 93 కేంద్ర ప్రాయోజిక పథకాల్లో 74 పథకాలను ఇప్పటికే ప్రారంభించాం అన్నారు.

రాష్ట్ర గతిని మార్చే బడ్జెట్

బడ్జెట్ అంటే కేవలం ఆయా శాఖలకు చేసే కేటాయింపులుగానే చూడకుండా, రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి అవసరమయ్యే విధంగా కేటాయింపులు జరిపాం. రాష్ట్ర గతిని, స్థితిని మార్చే సానుకూల, ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రజల ముందు ఉంచాం. కీలక రంగాలకు, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించాం. రూ.3,22,359 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌… స్వర్ణాంధ్ర – 2047 విజన్‌లోని 10 సూత్రాల లక్ష్య సాధనకు వారధిగా నిలుస్తుంది. పేదరిక నిర్మూలనలో భాగంగా పెద్ద ప్రాజెక్టుల మూలధన వ్యయం కోసం వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద రూ.2,000 కోట్లు కేటాయించాం. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్తగా అభివృద్ధి పనులు చేపడతాం.

సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్‌లో సహేతుక కేటాయింపులు జరిపాం. అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, తల్లికి వందనం పథకం కోసం రూ.9,407 కోట్లు కేటాయించాం.

బీసీలకు బాసటగా బడ్జెట్ కేటాయింపులు

బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడంలో మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న వెనుకబడిన తరగతులైన బీసీ సోదరుల సంక్షేమానికి రూ. 47,456 కోట్లు ఈసారి బడ్జెట్‌లో కేటాయించాం. ఆదరణ-3 పథకం అమలుకు రూ. 1,000 కోట్లు ఇవ్వడం ద్వారా మళ్లీ బీసీలకు అండగా నిలిచాం. ఎవరూ ఎప్పుడూ ఇవ్వని విధంగా బీసీ వర్గాల గృహ నిర్మాణానికి అదనంగా రూ.50 వేలు అందించి తోడుగా నిలిచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నాం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రూ.20 వేలు ఈ ఏడాది నుంచి ఇవ్వబోతున్నాం. మత్య్సకారులకు ఆర్ధిక సాయం కింద రూ. 230 కోట్లు కేటాయించాం.

రైతన్నకు అండగా నిలిచేలా బడ్జెట్

దేశానికి అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగాన్ని నిలబెట్టేందుకు రూ. 48,341 కోట్లు కేటాయించాం. అత్యంత కీలకమైన జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు కేటాయించాం. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే కీలకమైన విద్యాశాఖకు రూ. 34,311 కోట్లు, ఎస్సీల సంక్షేమానికి రూ. 20,218 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు, మైనారిటీ సోదరుల కోసం రూ. 5,434 కోట్లు కేటాయించాం.

అభివృద్ధి ఆగదు

అభివృద్ధి ఉంటేనే ఆదాయం వస్తుంది… ఆదాయం ఉంటేనే సంపూర్ణ సంక్షేమం అందించగలుగుతాం. అందుకే అభివృద్ది పనులకు కూడా ఎక్కడా తగ్గకుండా కేటాయింపులు జరిపాం. రహదారులకు రూ.8,785 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ. 3156 కోట్లు కేటాయించాం. పోలవరం, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛాంధ్ర వంటి కార్యక్రమాలకు సమృద్దిగా నిధులు కేటాయించాం.

ప్రతిక్షణం, ప్రతిగంటా ప్రజల కోసం

ప్రతిక్షణం, ప్రతిగంటా, ప్రతిరోజూ ప్రజల కోసం ఆలోచించే మీ ప్రభుత్వం మీ అవసరాలు, ఆకాంక్షలు తీర్చేందుకు ఈ బడ్జెట్‌ను తీసుకువచ్చింది. మీ అందరి సహకారంతో స్వర్ణాంధ్ర – 2047 విజన్ కలను నిజం చేసుకునే క్రమంలో 2025-2026 బడ్జెట్… ఆ లక్ష్యాల దిశగా మార్గాన్ని చూపిస్తుందని నమ్ముతున్నాను. మొత్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ సంతృప్తిని ఇచ్చింది.

LEAVE A RESPONSE