Suryaa.co.in

Telangana

తెలంగాణ ప్రజల కలల సాకారానికే బడ్జెట్

– గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి.. సభ ప్రారంభం కాగానే గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. సమావేశాలకు ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నామన్నారు. ప్రజల పాలన సాగుతోందని, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ అని పేర్కొన్నారు.

ప్రజల కోసం గద్దర్‌, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారని, జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామన్నారు. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ తెలిపారు.
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించు కున్నామని, అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోందని జిష్ణుదేవ్‌ వర్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రానికే రైతులే ఆత్మ అని.. వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వారే అన్నదాతలని.. రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉందని, రైతులకు మద్దతు ఇవ్వడం, వారిని శక్తివంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు.

దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని.. రైతులకు రుణ మాఫీ చేశామని, రైతుల రైతుల పట్ల మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 25.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని.. ఎకరానికి రూ. 12 వేల చొప్పున రైతులకు అందిస్తున్నామని.. రైతు నేస్తం అమలు చేస్తున్నట్లు చెప్పారు. వరి రైతులకు రూ. 500 చొప్పున బోనస్‌ ఇస్తున్నామని, రైతుల కోసం వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహాలక్ష్మి గేమ్‌ ఛేంజర్‌ పథకమని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ పురోగమించడమే కాదు.. రూపాంతరం చెందుతోందన్నారు. సమ్మిళిత, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ విజన్‌తో పని చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సమృద్ధికి దిక్సూచిగా ఉండేలా తెలంగాణ నమూనా ఉండాలని, తెలంగాణ భౌగోళిక పాత్రమే కాదు.. ఒక భావోద్వేగమన్నారు. తెలంగాణ స్థిరత్వం, దృఢ సంకల్పానికి గుర్తు అన్నారు.రైతుల స్వేదం, కష్టం మన ప్రజలను పోషిస్తోందన్నారు. 260 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తితో దేశం లోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఇది మన రైతుల స్థిరత్వం, అంకిత భావానికి ఓ సాక్ష్యమన్నారు.

రూ. 2 లక్షల పంట రుణ మాఫీని అమలు చేస్తున్నట్లు గవర్నర్‌ పేర్కొన్నారు. రుణ మాఫీతో రూ. 20,616.89 కోట్లతో 25.35 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగిందన్నారు. ఇది ప్రభుత్వం చేసిన వాగ్ధానాల నిర్దిష్ట కాల అమలుకు సాక్ష్యమన్నారు. రైతు భరోసా కింద నేరుగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఏడాదికి ఎకరాకు రూ. 12 వేలకు పెంచినట్లు వివరించారు.

LEAVE A RESPONSE