– కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
గురజాడ అప్పారావు మాటలతో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించడం తెలుగువారందరికీ గర్వకారణమని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర బడ్జెట్ చాలా గొప్పగా ఉందని, రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపును ఇవ్వడం చరిత్రాత్మకమని ప్రశంసించారు. దీనివల్ల మధ్యతరగతికి మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వం రూ. 15 వేల కోట్ల జల్ జీవన్ మిషన్ నిధులను వినియోగించుకోలేదని విమర్శించారు. ఈ మిషన్ కింద చేపట్టే పనుల గడువు ముగుస్తుండటంతో, గడువు పొడిగించాలని చంద్రబాబు కోరారని, దీంతో మిషన్ పనులను 2028 వరకు పొడిగించారని తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగు నీరు అందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు బడ్జెట్ లో ప్రాధాన్యతను కల్పించడం, ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లు పొడిగించడం గొప్ప విషయాలని అన్నారు.పార్టీలకు అతీతంగా బడ్జెట్ ను స్వాగతించాల్సిన అవసరం ఉందని తెలిపారు.