-
గ్రీన్ ఎనర్జీలో పెద్ద సంఖ్యలో పవర్ కన్వర్టర్లు సెమీ కండక్టర్ల ఆవశ్యకత
-
రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు జపాన్ కంపెనీకి ఆహ్వానం
-
జపాన్ లో రోహ్మ్ కంపెనీ సెమీ కండక్టర్ల విభాగాన్ని పరిశీలించిన
-
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు
తెలంగాణ రాష్ట్రంలో 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని, ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు ఇంధనశాఖ మంత్రి
భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.
జపాన్ పర్యటనలో భాగంగా ఆయన గురువారం క్విటో నగరానికి సమీపంలో ఉన్న ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్ ను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. ఆయనకు రోహ్మ్ కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ ఇనో, కంపెనీ ఉన్నతాధికారులు శ్రీ తకహసి, శ్రీ అండో, శ్రీ కాత్సునో, శ్రీ తనాక తకాషీ తదితరులు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భిన్న రంగాల్లో సెమీకండక్టర్ల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విడిగా కానీ ఉమ్మడి భాగస్వామ్యంతో కానీ తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని రోహ్మ్ యాజమాన్యానికి పిలుపునిచ్చారు.
అంతకుముందు రోహ్మ్ సంస్థ ఉన్నతాధికారులు వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రపంచంలో వివిధ దేశాల్లో తమకు గల సెమీకండక్టర్ల పరిశ్రమలను, అక్కడి ఉత్పత్తి ప్రక్రియలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి, రాష్ట్ర ఉన్నతాధికారులకు వివరించారు. భారతదేశంలో ఇప్పటికే మూడు చోట్ల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న సౌకర్యాలు వ్యాపార అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
సాయంత్రం క్విటో నగరానికి సమీపంలో ఉన్న పానాసోనిక్ కంపెనీ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఆ కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ నబి నకానీషితో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల గురించి వివరిస్తూ తాము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు సరఫరా చేస్తున్నామని భారతదేశంలో కూడా ఒక ప్లాంట్ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈవి వాహనాల సంఖ్య పెరుగుతుందని ఆర్టీసీ బస్సులు కూడా పూర్తి ఈవి వాహనాలుగా చేయాలని సంకల్పించాము కనుక పానాసోనిక్ వారు తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చని ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టివిక్రమార్క మల్లు తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు
క్విటో నగరానికి సమీపంలో ఉన్న టోజీ బౌద్ధ ఆలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఉన్నతాధికారులు గురువారం ఉదయం సందర్శించారు వారికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు పలికారు. ఈ పర్యటనలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు.