– సీఎంకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య సూటి ప్రశ్న
పేరుకు ముందు ఎస్సీ , పేరుకు వెనక ఎస్టీ అంటూ సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రూ. 90 లక్షలు కట్టి వైద్య విద్యలో ఎం.బి.బి.ఎస్ సీటు కొనుగోలు చేయగలిగిన దళితుడిని ఏపీలో చూపగలరా? అంటూ అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య సిఎంను సూటిగా ప్రశ్నించారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేస్తున్న అయిదు వైద్య విద్య కళాశాలలో సగం సీట్లను అమ్మేసుకుంటున్నారని, ఎస్సీ, ఎస్టీ బీసీ కులాలకు రిజర్వేషన్లు 25 శాతానికే పరిమితం చేస్తున్నారని, దీని వలన 204 సీట్లు కోల్పోతున్నారన్న వార్తలు నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పనితీరుపై మండిపడ్డారు.
ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు, నిర్ణయాలు కొనసాగితే, భవిష్యత్తులో దళిత, గిరిజన పిల్లలు ఎవ్వరూ డాక్టర్లు కాలేరన్నారు. ఇప్పటికే విదేశీ విద్య, ఉన్నత విద్యను క్రింది కులాలకు దూరం చేశారని, టెన్త్ ,ఇంటర్ విద్యకే 80% పిల్లలు పరిమితం అయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల్లో, చదువుల్లో సంక్షేమంలో క్రింది కులాలకు ప్రాధాన్యత ఉండాలి అనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని పక్కనపెట్టి, వాటిని తీసే హక్కు, తగ్గించే హక్కు సీఎంకు ఎక్కడిది ? అని నిగ్గదీశారు.
నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో తొలి బాధితులు దళితులే అని,ఇప్పటికే దశాబ్దాల నాటి 27 రకాల సంక్షేమ పథకాలను నిలిపేశారని, దాడులు, దాష్టీకాలతో దళితుల ఆత్మగౌరవం పై దెబ్బ కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విద్య ను కూడా దళితులకు దూరం చేయాలని చూస్తే, దళిత లోకం క్షమించదని, ఉద్యమించి తీరుతామని బాలకోటయ్య ముఖ్యమంత్రిని హెచ్చరించారు.