Suryaa.co.in

Andhra Pradesh

ముద్రగడకు క్యాన్సర్!?.. స్పందన లేని కాపు ‘జాతి

కాకినాడ జిల్లా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం లోని కిర్లంపూడి అనే గ్రామానికి చెందిన మాజీ ఎంఎల్ఏ ( మాజీ ఎంపీ, రాష్ట్ర మాజీ మంత్రి కూడా ) ముద్రగడ పద్మనాభ రెడ్డి కి క్యాన్సర్ అని ఆయన కుమార్తె క్రాంతి ఇటీవల ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్… ప్రధాన మీడియాతో పాటు , కొన్ని ముఖ్య సోషల్ మీడియా వీడియోల్లోనూ విస్తృతం గా ప్రచారం అయింది.

క్రాంతి ఈ విషయం బయట పెట్టక ముందే, ఆయనకు సంబంధించిన ఒక ఘటన, రాష్ట్రం లో చోటు చేసుకున్నది. ‘కాపు ఉద్యమం ‘ ముద్రగడ హైజాక్ చేసిన కొత్తల్లో ఎపుడో 2016 జనవరి లో జరిగిన తుని ‘ఘర్జన’ సందర్బగా…. విశాఖపట్నం నుంచి వచ్చే రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కొన్నిబోగీలు తుని స్టేషన్ లో అగ్నికి ఆహుతి అయిపోయాయి.

” నువ్వు తగల బెట్టావు ” అంటే “నువ్వే తగల బెట్టావు ” అని ఓ రెండు మూడేళ్ల పాటు జోకులు పేలాక ; చివరికి ” కాపు ఉద్యమ నేత ” గా తెరమీదకు వచ్చిన ముద్రగడ పద్మనాభం తో పాటు ; నిజమైన కాపు కులాభిమానులు ఓ 40 మంది మీద రైల్వే పోలీసులు కేసు పెట్టామనిపించారు.
2019 మే లో రాష్ట్రాధికారం చేతులు మారింది. దాంతో, రాష్ట్ర పరిపాలన చేతులు మారింది.

అప్పటిదాకా ఎంకి గా ఉన్నావిడ కాస్తా శ్రీమతి ఎంకాయమ్మ గారు అయింది. అప్పటివరకు ఎంకాయమ్మ గారిగా వెలిగి, 2019 ఎన్నికల్లో ఎంకి అయి, చింపిరి జుట్టేసుకుని ఎటో వెళ్ళిపోయింది.

దాంతో…. ఎంత జుట్టు పీక్కున్నా, రైల్వే పోలీసులకు ఈ దహనం కేసులో సాక్ష్యాధారాలు కనిపించలేదు. రైలు బో్గీలు ఎవరు తగల బెట్టారో వాళ్ళు కనిపెట్టలేక పోయారు.

“బోగీ… బోగీ…. ఎట్లా తగలబడి పోయావో చెప్పు ” అంటూ రైల్వే పోలీసులు ఎంత బతిమిలాడినా రత్నా చల్ నోరు మెదప లేదు.

కోర్టు మాత్రం ఏం చేస్తుంది? కేసు కొట్టేసింది.

దానితో, ” న్యాయం ” గెలిచిందహో అంటూ నిందితులు, వారి సంబంధీకులు సంబరాలు చేసుకున్నారు.

ఇది 2023 లో జరిగింది.

అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులూ…. చేర్పులూ జరిగిపోయాయి.

రాష్ట్ర స్థాయి కాపు ఉద్యమ నేత స్థాయి నుంచి పత్తిపాడు నియోజకవర్గం లెవెల్ కి ముద్రగడ పద్మనాభరెడ్డి వచ్చేశారు.(” ఆయన స్థాయి అసలు అదే. మీరంతా కలిసి భజన చేసి, ఆయన్ను రాష్ట్ర స్థాయికి పెంచారు ” అంటూ మీడియా వాళ్ళను తిట్టి పోసేవారికి కిర్లంపూడి, వీరవరం, ఇరిపాక, జగ్గంపేట, పత్తిపాడు వంటి మెట్ట ప్రాంతంలో రాజకీయ వాసనలు కలిగిన వారితో పాటు, కాకినాడలో కూడా తక్కువేమీ లేరు. ) 2019 ఎన్నికల్లో
తెలుగు దేశం అధికారం కోల్పోవడం తో, చంద్రబాబు పై ముద్రగడ కక్ష, కసి, ఆగ్రహం, అసహనం, ఉక్రోషం, ఉడుకులమోతు తనం, కడుపు మంట వంటివి అన్నీ తీరాయి. “కాపు ఉద్యమ నేత” అవతారం లక్ష్యం నెరవేరింది. ఇక కాపు ఉద్యమం ముసుగుతో ఆయనకు పని లేకుండా పోయింది.

” మీ చావు మీరు చావండి!” అనుకుంటూ ఆయన వెళ్లి వైసీపీ లో చేరిపోయారు. కాపు జాతి… ” ఔరా! ఇంత మోసమా!? ” అంటూ ముక్కుమీద వేలేసుకుంది.

మొన్నటి ఎన్నికల్లో, రాష్ట్రం లోని రాజకీయం మళ్ళీ తిరగబడింది. ఎంకి కాస్తా శ్రీమతి ఎంకాయమ్మ గారు అయింది.2019 నుంచి ఓ ఐదేళ్లు పెట్రోమాక్స్ లైట్ లాగా ఓ వెలుగు వెలిగిన ఎంకాయమ్మ గారు, 2024 లోఎన్నికల్లో ….దుస్తులన్నీ చిరిగిపోయి, ఎంకిలాగా తయారై ఎటో పోయింది.
దాంతో, పద్మనాభరెడ్డి ని రాజకీయం గా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.

తన రాజకీయం చివరి అంకానికి చేరుకున్నదని ఆయనకు కూడా అర్ధమైంది. తను జీవించి ఉండగానే, తన చిన్న కొడుకు గిరి ని పత్తిపాడు వైసీపీ ఎం ఎల్ ఏ గా చూడాలని పద్మనాభరెడ్డి తాపత్రయ పడుతున్నారు. ఎంతగానో ఇదై పోతున్నారు.

ఇది ఇలా ఉంటే, ప్రభుత్వం లోని కొందరు ‘ఉత్సాహపరులు ‘ నిశ్శబ్దం గా పావులు కదిపి, రైల్వే కోర్టు 2023 లో ఇచ్చిన ‘ ఎక్విటల్’ తీర్పు పై హైకోర్ట్ లో అప్పీల్ చేయాలంటూ ఒక జీవో జారీ చేయించారు. నిజానికి, ఆనాటి నిందితుల్లో అత్యధికులు అటు బీజేపీ లోనో…., ఇటు టీడీపీ లోనో చేరిపోయారు.

మాట వరుసకు అమలాపురం లో ముద్రగడకు గుడ్డి భక్తులైన నల్లా విష్ణు ( మునిసిపల్ మాజీ చైర్మన్ కూడా ), ఆయన కుమారుడు నల్లా పవన్ బీజేపీ లో ఉన్నారు. ఇంకో అంధ భక్తుడైన ఆకుల రామకృష్ణ, ముద్రగడ వంటి నిండా “కాపు ఉద్యమ” బురద పులిమిన వాసిరెడ్డి ఏసుదాసు వగైరాలు ఇప్పుడు టీడీపీ లో ఉన్నారు.

గోదావరి జిల్లాల కాపు సామాజిక వర్గం లో ఎంతో కొంత గుర్తింపు కలిగిన ఆకుల రామకృష్ణ…. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా కరుణిస్తారేమో అని శ్రీరాముడి రాకకోసం ఎదురు చూసిన అహల్యా దేవి లాగా ఎదురు చూస్తున్నారు. ఈలోపేమో…. వయసైపోతున్నది.

తనకు కేటాయిస్తారనుకున్న బెర్త్ ను కొత్తపల్లి సుబ్బారాయుడు కు కేటాయించడంతో ; ఆకుల రామకృష్ణ తీవ్రాతి తీవ్ర నిరాశ కు లోనైనారు.
ఇలా… ఏదో ఒక కారణం తో…. అటు జగన్ పార్టీ వైపు వెళ్లలేక, ఇటు చంద్రబాబు వైపు చూడలేక సతమవుతున్న కాపు సామాజిక వర్గం మొత్తం…. ఈ ఒక్క జీ వో తో అలర్ట్ అయింది.

ఇటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వైసీపీ రాత్రికి రాత్రే రంగం లోకి దిగేసింది.

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఓ భారీ ప్రెస్ మీట్ పెట్టి, కాపులను టీడీపీ కి వ్యతిరేకంగా సంఘటితం చేసే కృషికి శ్రీకారం చుట్టారు. టీడీపీ పై విరుచుకు పడ్డారు.

వైసీపీ కి సంబంధిన మీడియా, ఏకం గా పతాక శీర్షిక గా ఈ జీ ఓ ను, దాని కాపీ తో సహా ప్రచురించి సంబరాలు చేసుకుంది.

ఈ జీ ఓ ఎంత ప్రమాదకరమో ఆ రాత్రికే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముద్రగడ ను ఇబ్బంది పెట్టడానికే ప్రభుత్వం ఈ జీ ఓ ను తెచ్చిందనే భావన కాపు సామాజిక వర్గం లో క్షణాలలో వ్యాపించిన విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది.

కాపు సామాజిక వర్గానికి చెందిన ఎం పీ సానా సతీష్ రంగం లోకి దిగి ; ఈ జీ ఓ…. తెలుగు దేశం పార్టీకి ఎంత ప్రమాద కరమైందో….. చెప్పవలసిన వారికి చెప్పారు. అప్పటికే బాగా పొద్దు పోయింది.

తెల్లవారుతూనే, చంద్రబాబు నాయుడు దృష్టికి విషయం వెళ్ళింది. ఆయన దాదాపు షాక్ అయ్యారు. తనకు తెలియకుండా ఇంతటి సున్నితమైన అంశంలో అంత బండగా ఎవరు జీ ఓ ఇప్పించారో కనుక్కోమని ఆదేశి స్తూనే, ఈ జీ ఓ ను వెంటనే ఉపసంహరిస్తూ మరో జీ ఓ ను జారీ చేయాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

ఒక జీ ఓ ను ముందు జారీ చేసి, 24 గంటలు కూడా గడవక ముందే దానిని ఉపసంహరించుకుంటూ మరో జీ ఓ ను ప్రభుత్వం జారీ చేయడం…. దాదాపు ఇదే ప్రధమం అని కొందరు పరిశీలకులు అంటున్నారు.

ఈ పరిణామం కాపు సామాజిక వర్గానికి గొప్ప ఉపశమనం కలిగించింది. భీమవరం కు చెందిన న్యాయవాది, కాపు సంక్షేమ సంఘం నాయకుడు ఆరేటి ప్రకాష్ ఈ జీ ఓ ఉపసంహరణ పై తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కి అప్పటికప్పుడు సందేశం పంపించారు.

కాపులలో అగ్గి రాజేద్దామనుకున్న వైసీపీ అత్యుత్సాహం చప్పున చల్లారిపోయింది.

ఇది చోటుచేసుకున్న కొద్ది రోజులకే, ” మా తండ్రి గారు కాన్సర్ తో బాధ పడుతున్నారు…. ” అంటూ రాజమండ్రి లో నివాసం ఉంటున్న ముద్రగడ కుమార్తె క్రాంతి తీవ్ర ఆవేదనతో, ఒక ట్వీట్ చేశారు.

ఇదినిజంగా కాపు సామాజిక వర్గం లో ఆందోళన, ఆవేదన కలిగించాల్సిన సమాచారం.

అయితే, కాపు సామాజిక వర్గపు ఆశలు… ఆకాంక్షలకు పద్మనాభరెడ్డి దూరంగా జరిగారు. చంద్రబాబు పతనమే తన జీవిత, రాజకీయ లక్ష్యం అనుకున్నారు. ఇందుకోసమే కాపు సామాజిక వర్గాన్ని అడ్డం గా వాడుకున్నారు. గుడ్డిగా నమ్మి వచ్చిన ఆడపిల్లను మాయమాటలు చెప్పి, ముంబయి తీసుకెళ్లి, వేశ్యా వాటిక లో అమ్మేసినట్టు, రాష్ట్రం లో 100 శాతం ఆయనను నమ్మి, అమాయకం గా ఆయన దరజేరిన కాపు సామాజిక వర్గాన్ని అమ్మేశారు.

వైసీపీ లో మునిగి తేలుతున్నారు. అందుకే, ఆయనకు క్యాన్సర్ అని స్వయంగా కూతురే చెప్పినా…. కాపు సామాజిక వర్గం లో సానుభూతి గానీ, స్పందన గానీ వ్యక్తం కావలసినంత గట్టిగా వ్యక్తం కావడం లేదు. వైసీపీ వర్గాలలో అయినా వ్యక్తం అవుతుందో …. లేదో …. తెలియడం లేదు .

– భోగాది వేంకట రాయుడు

LEAVE A RESPONSE