సీబీఐ విచారణ జరిపించాల్సిందే..

Spread the love

-హోంమంత్రి, ఎమ్మెల్యే, టీఆర్ఎస్, ఎంఐఎం నేతల ప్రమేయమున్నట్లు ఆరోపణలున్నాయి
-అత్యాచారంపై ఫిర్యాదు చేసి 5 రోజుల దాకా పోలీసులు ఎందుకు స్పందించలేదు?
-ట్విట్టర్ పిట్ట చెబితే తప్ప హోంమంత్రి, డీజీపీ, సీపీ కదలరా?
– కేసు నుండి నిందితులను తప్పించే కుట్ర జరుగుతోంది
-పోక్సో చట్టం కింద మెజిస్ట్రేట్ ఎందుకు వాంగ్మూలం ఎందుకు నమోదు చేయడం లేదు?
-జూబ్లిహిల్స్ అత్యాచార ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్…

జూబ్లిహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కేసులో హోంమంత్రి మనవడు, ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారులతోపాటు టీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయని అన్నారు. వారందరినీ ఈ కేసు నుండి తప్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పోలీసులకు ఆదేశాలొచ్చాయని ఆరోపించారు. సీఎంఓ ఆదేశాలతో ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు రాత్రి 8.30 గంటలకు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు…

జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటు. పోలీసులు, ప్రభుత్వ తీరువల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది. హైదరాబాద్ క్రిమినల్స్ కు, అక్రమ దందాలకు అడ్డాగా మారింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్ చర్చ జరుగుతోంది.

ఆ పబ్ లో అసలు పార్టీ అరెంజ్ చేసిందెవరు? గత నెల 28 మైనర్ బాలికపై ఎవరెవరు అత్యాచారం చేశారో స్పష్టంగా ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదు? ఎందుకు విచారణ జరపలేదు? ఎఫ్ఐఆర్ లో వారి పేర్లు ఎందుకు నమోదు చేయలేదు?

అత్యాచారం జరిగి 5 రోజులైనా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. సాక్షాత్తు ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డు కొడుకుపైన, హోంమంత్రి మనువడి పైన, టీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపణలొస్తున్నాయి.28న అఘాయిత్యం జరిగితే ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు. గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు? ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు?
మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే పోక్సో కింద సీఆర్పీసీ 164 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలి. మెజిస్ట్రేట్ ఎదుట అమ్మాయి స్టేట్ మెంట్ రికార్డు చేయాలి. కానీ ఇక్కడెందుకు ఆ పని చేయడం లేదు?

సీసీ పుటేజీలో అన్ని ఆధారాలు రికార్డై ఉన్నాయి. ఇన్ని రోజులపాటు సీసీ పుటేజీలు ఎందుకు దొరకలేదు? హైదరాబాద్ లో కోట్లు పెట్టి వేల కొద్ది సీసీ పుటేజీలెందుకున్నట్లు? హైదరాబాద్ లో మహిళలకు రక్షణ ఉండదా?

పాతబస్తీలో పోలీసులపైనా, విద్యుత్ సిబ్బందిపైనా దాడులు చేస్తే పట్టించుకోరు. నిర్మల్, కోదాడలో మైనర్ బాలికపై టీఆర్ఎస్ గూండాలు అత్యాచారం చేస్తే పట్టించుకోరు. మంథనిలో లాయర్ వామనరావు హత్య జరిగినా, రామాయంపేటలో వైశ్య కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా, కొత్తగూడెంలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా… ఖమ్మంలో బీజేపీ సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్నా… అందుకు కారణం టీఆర్ఎస్ నేతలేనని మరణ వాంగ్మూలం ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోరు? టీఆర్ఎస్ గూండాలు దాడులు చేసినా… హత్యలు చేసినా.. ఆత్మహత్యలకు కారకులైనా సీఎం మాత్రం స్పందించరు? టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యవల్ల పోలీస్ వ్యవస్థ మీద రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది.

మానవతా థ్రుక్పథంతో వ్యవహరించకుండా… చట్ట ప్రకారం పనిచేయకుండా పోలీసులు నిందితుల కొమ్ముకాస్తారా? చంచల్ గూడ జైల్లో ఉండాల్సిన క్రిమినల్స్ ను కాపాడతారా? నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తారా? మహిళలని చూడకుండా పిడిగుద్దులు గుద్దుతారా? బట్టలు చింపుతారా? బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయడానికి కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు…. క్రిమినల్స్ ను ఎందుకు అరెస్ట్ చేయరు?

సాక్షాత్తు హోంమంత్రిపైనే ఆరోపణలొస్తుంటే…. ట్విట్టర్ పిట్ట హోంమంత్రితోనే విచారణ జరిపించాలని ఆదేశిస్తారా? హోంమంత్రి, డీజీజీ, సీపీలను ప్రగతి భవన్ కే పరిమితం చేస్తరు? ట్విట్టర్ పిట్ట చెబితే తప్ప స్పందించరా?

క్రిమినల్స్ ను క్రిమినల్స్ గా చూడకపోవడంవల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీనిపై ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై మతం జోడించి ఆరోపణలు చేయడం సిగ్గు చేటు… అత్యాచారానికి గురైన బాలికది ఏ మతమో మాకు ఇంతవరకు తెలియదు. బీజేపీ మానవతా ధ్రుక్పథంతో మాత్రమే స్పందిస్తోంది.

హైదరాబాద్ అత్యాచారాలు, డ్రగ్స్, హత్యలకు అడ్డగా మారింది. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతోంది.అత్యాచారం కేసులో బాధితులను నయానో భయానో బెదిరించి కేసును నీరుగార్చి మూసేసే కుట్ర జరుగుతోంది. నిందితులను కేసు నుండి తప్పించాలని సీఎంఓ నుండి ఆదేశాలొస్తున్నాయి. నిజాయితీగల పోలీసులు ఆ శాఖలో పనిచేయాలంటేనే సిగ్గు పడే స్థితికి వచ్చింది.బాధితుల పక్షాన ప్రశ్నిస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం బాధాకరం. తక్షణమే వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా…

జూబ్లిహిల్స్ అత్యాచార ఘటనలో హోంమంత్రి, శాసనసభ్యులు, టీఆర్ఎస్ నేతలపైనే ఆరోపణలొస్తున్నందున పోలీసుల విచారణపైనా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్ పైన మాకు నమ్మకం లేదు. ఈ కేసులో నిజంగా టీఆర్ఎస్, మజ్లిస్ నేతల హస్తం లేదని సీఎం భావిస్తే.. తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. వాస్తవాలు నిగ్గు తేల్చాలి. నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలి.

Leave a Reply