ఆ రూ.1.62 లక్షల కోట్లపై సీబీఐ దర్యాప్తు చేయాలి

-సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలి
-చంద్రబాబు పాలనలో లెక్క తేలని రూ.1.62 లక్షల కోట్లు
-రాజ్యసభలో కేంద్రం స్వయంగా ప్రకటించింది
-దీనిపై ఏం చర్య తీసుకున్నారో వెంటనే చెప్పాలి
-లేదా ఏ చర్య తీసుకుంటారో కేంద్రం వెల్లడించాలి
-ప్రభుత్వ ప్రతి వ్యయానికి అసెంబ్లీ అనుమతి ఉండాలి
-205 ఆర్టికిల్‌లో ఈ విషయం స్పష్టంగా ఉంది
-దాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారు
-ప్రజా సొమ్మును అప్పనంగా దోచుకున్నారు
-విచారణ జరిపి ఆయనపై కఠిన చర్య తీసుకోవాలి
-ప్రెస్‌మీట్‌లో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌

కేంద్రం స్వయంగా ప్రకటన:

రాష్ట్రంలో నిధుల వినియోగంపై రాజ్యసభలో టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇస్తూ, చంద్రబాబు హయాంలోనే రూ.1.10 లక్షల కోట్లకు పైగా నిధులపై లెక్కలు లేవని స్పష్టం చేసింది. దీన్నే అంటారు ‘తన్నడానికి వెళ్లి తన్నించుకోవడం అంటే..’ దీన్ని ఆనాడు కాగ్‌ కూడా ప్రశ్నించింది. ఆ లెక్కలు ఇప్పటికీ తేలలేదని కేంద్ర మంత్రి రాజ్యసభలో వెల్లడించారు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో చేసిన రూ.1.10 లక్షల కోట్ల వ్యయానికి లెక్కలు లేవని రాజ్యసభ సాక్షిగా కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రూ.1,62,888 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించిందని, కానీ వాటికి ఇప్పటికీ లెక్కలు సరిగ్గా లేవని రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్వయంగా తెలిపారు. అంటే ఆ వ్యయం వివరాలు లేవని కేంద్రం వెల్లడించింది.

శాసనసభ అనుమతి తప్పనిసరి:

రాజ్యాంగంలోని 205వ ఆర్టికిల్‌ ప్రకారం, రాష్ట్రం చేసే అదనపు వ్యయంలో ప్రతి పైసాకు శాసనసభ అనుమతి కావాలి. అయితే ఆ నిబంధనను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించిందని, ఆ విషయం కాగ్‌ తన నివేదికలో స్పష్టం చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు.

మీరేం చేశారో చెప్పాలి:

ఇది చాలా తీవ్ర పరిణామం. ఒక బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారు. అయితే ఏం చర్యలు తీసుకున్నారనేది కేంద్రం చెప్పలేదు. కాబట్టి దీనిపై ఏం చర్య తీసుకున్నారు? లేదా ఏ చర్య తీసుకోబోతున్నారనేది కేంద్రం ఇప్పుడు చెప్పాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం. అది ప్రజల డబ్బు. ఈ మధ్యకాలంలో చాలా మంచి సూడో మేధావులు పథకాల కింద డబ్బులు ఇవ్వొద్దని అంటున్నారు. ఎందుకు ఆపాలి? అది ప్రజల డబ్బు. వారికే ఇవ్వాలి.

ఈ ప్రభుత్వంలో అంతా డీబీటీ:

ఈ ప్రభుత్వం ఈ మూడేళ్లలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రూ.1.62 లక్షల కోట్లు నేరుగా పథకాల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. అదే విధంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక ప్రైవేటు కంపెనీ, అగ్రిగోల్డ్‌ చేసిన మోసానికి కూడా ప్రభుత్వం ఆ బాధితులకు పరిహారం చెల్లించింది. ఈ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. పేదరికం పోవాలని చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఆ దిశలో విద్యా రంగం ప్రాధాన్యతను గుర్తించి అందుకోసం తగిన మొత్తం వ్యయం చేస్తోంది. ప్రభుత్వం అప్పులు చేసినా, ప్రతి పైసా సద్వినియోగం చేస్తోంది. ప్రది పైసాకు లెక్క ఉంది. వివిధ పథకాల కింద పేద ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేస్తోంది. అదే విధంగా మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు. పనులు కొనసాగుతున్నాయి. కరోనావల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా ఎక్కడా, ఏ పథకం ఆపలేదు. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో మూడేళ్లలో 95 శాతం అమలు చేశారు.

చంద్రబాబు సమాధానం చెప్పాలి

మరి లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు, ఆ నిధులు ఏం చేశారో చెప్పాలి? రూ.1,62,888 కోట్ల నిధులు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. సీఎం వైయస్‌ జగన్‌ ఈ మూడేళ్లలో దాదాపు అంతే మొత్తాన్ని డీబీటీ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. చంద్రబాబు ఆర్థిక అక్రమదారు. ఆయన నారా గొటబాయి అని చెప్పాలి.

మేధావులూ స్పందించరేం?:

డబ్బుల పంపిణీ ఆపాలంటున్న మేధావులను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు హయాంలో లెక్కతేలని రూ.1.62 లక్షల కోట్ల గురించి ఏమంటారో చెప్పాలి. అది ఒక ప్రజా విద్రోహం. ప్రజల డబ్బును అప్పనంగా దోచుకున్నారు. ప్రభుత్వాలు నడపడం కోసం రుణాలు తెస్తే, వాటిని ప్రజల కోసమే ఖర్చు చేయాలి కదా? పథకాల కింద డబ్బు పంపిణీ ఆపాలంటున్న సూడో మేధావులు ఇకనైనా మాట్లాడాలి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్వయంగా రాజ్యసభలో చెప్పారు. ఇది నిజం. కాబట్టి ఇకనైనా స్పందించాలి.

సీబీఐ దర్యాప్తు జరపాలి

కాబట్టి దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని నేను కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాను. సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలి. నిజానిజాలు నిగ్గు తేల్చి.. బాధ్యుడిని గుర్తించి, అరెస్టు చేయాలి. చేతికి సంకెళ్లు వేసి, ఓపెన్‌ టాప్‌ జీపులో ఊరేగించాలి. ఇన్ని చేసిన ఆ పెద్దమనిషి ఇవాళ కబుర్లు చెబుతున్నాడు. ఇది ప్రజాద్రోహం కాదా?

ఇది పారదర్శక ప్రభుత్వం

వైయస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని టీడీపీ ఎంపీ కనకమేడల చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆయన తన జీవితమంతా ప్రయత్నించినా ఈ ప్రభుత్వంలో ఒక్క అవినీతిని కూడా కనిపెట్టలేడు. ఇక్కడ ప్రతి పైసా నేరుగా ప్రజలకు చేరుతుంది. మ«ధ్యలో కమిషన్లు లేవు. అవినీతి లేదు. పర్సంటేజ్‌లు లేవు. పూర్తి పారదర్శకంగా మారుమూల గ్రామాల్లో సైతం, నేరుగా ప్రతి పైసా చేరుతోంది. అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ అవుతోంది. గొప్ప పత్రికాధిపతులు.. రాజ్యసభలో స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన విషయాన్ని మీ పత్రికల్లో రాయలేదు. దీన్ని ఏమనాలి? ఇదేనా జర్నలిజమ్‌. ఇదేనా మీ విలువ. ఏదేమైనా దీనిపై కేంద్రం అత్యున్నత దర్యాప్తు జరిపి, వాస్తవాలను ప్రజలకు వివరించాలి.