Suryaa.co.in

Andhra Pradesh

బీసీల పక్షపాతి చంద్రబాబు

– బీసీ శాఖ మంత్రి సవిత

అమరావతి : బీసీలకు టీడీపీతోనే మేలు కలుగుతోందన్న విషయం మరోసారి రుజువైందని, వెనుకబడిన తరగుతల పక్షపాతి చంద్రబాబు అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముంగిట వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తూ వస్తున్నారన్నారు.

దీనిలో భాగంగా బీసీలకు మరింత రాజకీయ ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో చట్టసభల్లో 33 శాతం మేర రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చంద్రబాబునాయుడు ప్రభుత్వం బుధవారం నాటి కేబినెట్ భేటీలో తీర్మానం ఆమోదించిందన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన కులాలు వారు ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు.

బీసీలకు టీడీపీ ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటూ వస్తోందన్నారు. మహానుభావుడు, అన్నగారు ఎన్టీ రామారావు…బడుగు, బలహీన వర్గాల వారికి మేలు కలుగజేయాలన్న లక్ష్యంతో టీడీపీని స్థాపించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటులో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ప్రాధాన్యమిచ్చారన్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి బీసీ హాస్టళ్లు నెలకొల్పి…వెనుకబడిన తరగతుల పిల్లలకు విద్యను దగ్గర చేశారన్నారు.

ఎన్టీ రామారావు స్ఫూర్తితో పాలన సాగిస్తున్న చంద్రబాబునాయుడు కూడా బీసీలకు దన్నుగా ఉంటూ వస్తున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన తరగతుల యువతకు ఆర్థిక భరోసా కలిగేలా స్వయం ఉపాధి రుణాలు ఇస్తున్నారన్నారు. బీసీ విద్యార్థుల విద్యా ప్రగతికి బీసీ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను విరివిగా మంజూరు చేయడంతో పాటు భవన నిర్మాణాలు చేపట్టారని మంత్రి తెలిపారు.

ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద బీసీ విద్యార్థులకు విదేశాల్లో చదివేలా అవకాశం కల్పించారన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహమందజేశారన్నారు. స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణిస్తూ బీసీ విద్యార్థులకు అండగా నిలిచారన్నారు. ఆదరణ పథకం కింద వెనుబడిన తరగతుల్లో ఉన్న చేతివృత్తుదారులకు పనిముట్లు అందజేశారన్నారు.

రాజ్యాధికారంలో బీసీలకు భాగస్వామ్యం

బీసీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేశాయని మంత్రి తెలిపారు. పాలనలోనూ భాగస్వామ్యమయ్యేలా బీసీలకు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రులుగా అత్యధిక మందికి అవకాశమిచ్చారన్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యులు చేయాలన్న లక్ష్యంతో చట్ట సభల్లో 33 రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని మంత్రివర్గం తీర్మానం చేయడం అభినందించదగ్గ విషయమన్నారు.

ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న చంద్రబాబుకు బీసీ సంఘాలు, కులాలు ధన్యవాదాలు తెలుపుతున్నాయని ఆ ప్రకటనలో మంత్రి సవిత వెల్లడించారు.

LEAVE A RESPONSE