Suryaa.co.in

Andhra Pradesh

గౌరవ సభ కాదది కౌరవ సభ:చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించి కింది నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కె. అచ్చెన్నాయుడు,  యనమల రామకృష్ణుడు,  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,  నిమ్మకాయల చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, కేఎస్ జవహర్, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి,  ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీ జనార్థన్, పి.అశోక్ బాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,గురజాల మాల్యాద్రి,  పట్టాభిరాం, మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.
1. ప్రజా సమస్యలు చర్చించాల్సిన గౌరవ శాసన సభను కౌరవ సభగా మార్చారు. మహిళల పట్ల అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గౌరవ సభలు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆయా సభల్లో ప్రజా సమస్యలను చర్చించడంతో పాటు మహిళల పట్ల వైసీపీ విధానాన్ని వివరించడం జరుగుతోంది. గౌరవ సభలు ప్రతి పంచాయతీలోనూ జరపాలి. రెండున్నరేళ్లలో ప్రజలపై అన్ని విధాలుగా భారం మోపారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అవినీతి కోసం అప్పులు చేస్తున్నారు. ప్రతి కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపారు. పుట్టబోయే బిడ్డపైనా అప్పు చేశారు. అన్ని గ్రామాల్లోనూ ఈ గౌరవ సభలు నిర్వహించి జగన్మోహన్ రెడ్డి రాక్షస విధానాలను తీవ్రంగా ఎండగట్టాలని సమావేశంలో తీర్మానించడం జరిగింది.
2. అంబేద్కర్ స్ఫూర్తి భావితరాలకు తెలియజేసేందుకు రాజధాని అమరావతి నడిబొడ్డులో స్మృతివనం పేరుతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్థాపనకు టీడీపీ కృషిచేసింది. ఇందుకు రూ.210 కోట్లు కేటాయించడం జరిగింది. 20 ఎకరాల స్మృతివనంలో 125 అడుగల అంబేద్కర్ విగ్రహంతో పాటు కన్వెన్షన్ సెంటర్, బుద్ధిస్ట్ ధాన్య కేంద్రం, లైబ్రరీ ఏర్పాటుకు కృషిచేయడం జరిగింది. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అంతా నాశనం చేశారు. నేడు అంబేద్కర్ స్ఫూర్తి కాలరాస్తూ.. ఓటీఎస్ వసూళ్ల పేరుతో పేదల మెడకు ఉరితాడు బిగిస్తున్నారు. ప్రజలను హింసిస్తున్నారు. దీంతో ప్రజలు ఎక్కడ చూసినా తిరుగుబాటు చేస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో అంబేద్కర్ స్ఫూర్తి లేదు. దీంతో అంబేద్కర్ విగ్రహాల వద్ద విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగింది. అధికారంలోకి వస్తే ఇంటి రుణాన్ని మాఫీ చేస్తానని హామీ ఇచ్చి జగన్ రెడ్డి మాట తప్పారు. అమరావతిలో రెండు లక్షల కోట్ల ప్రజాసంపదను నాశనం చేసి, ఓటీఎస్ పేరుతో పేదలపై భారం మోపడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. దీనిపై పెద్దఎత్తున పోరాటాన్ని కొనసాగించాలని సమావేశంలో తీర్మానించారు. ఓటీఎస్ పథకం కింద పేదలెవరూ ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం విశాఖలో వేలాది ఇళ్లకు ఉచితంగా పట్టాలు ఇవ్వడమేకాక చీరా సారే కూడా ఇవ్వడమైంది.
3. ఈ నెల 17వ తేదీన తిరుపతిలో జరగనున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ తన సంఘీభావం తెలియజేయనుందని సమావేశంలో తీర్మానించడం జరిగింది. అమరావతి రైతుల పాదయాత్రతోనైనా జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరవాలి. వైసీపీ మినహా ప్రతి పార్టీ ప్రజారాజధాని అమరావతికి మద్దతు తెలుపుతున్నారు. అమరావతికి చారిత్రక నేపథ్యం ఉంది. అన్ని ప్రాంతాలకూ సమదూరంలో ఉంది. ఏపీ ప్రైడ్ అమరావతి. రెండు లక్షల కోట్ల సంపద సృష్టించడం జరిగింది. దీని ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి. ప్రతి ఊరు నుంచి పవిత్రమైన నీరు, మట్టి తీసుకువచ్చి అమరావతికి మద్దతు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కూడా స్వాగతించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పూయలేని వాళ్లు మూడు రాజధానులు నిర్మిస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది. టీడీపీకి అన్ని ప్రాంతాలూ ముఖ్యమే. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్ ను అంధకారం చేశారు. జగన్ రెడ్డిది వికేంద్రీకరణ కాదు.. విద్వేషం. జగన్ రెడ్డి ఇసుక, మధ్యం, పంచాయతీల నిధులతో సహా అన్నీ కేంద్రీకృతం చేశారు. జగన్ రెడ్డి వికేంద్రీకరణ కొంగజపమే. ఇప్పటికైనా జగన్ రెడ్డి మూర్ఖత్వం వీడాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు.
4. రాష్ట్ర ప్రజలు టీడీపీతో ఉన్నారనేది స్పష్టమవుతోంది. జగన్ రెడ్డి అవినీతి, వైఫల్యాలను నేతలు మరింత బలంగా తీసుకెళ్లాలి. జగన్ రెడ్డి ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అనేందుకు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి పెరిగిన ఓటింగ్ శాతమే నిదర్శనం. డబ్బు, అధికార దుర్వినియోగం, పోలీసులతో జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇవన్నీ చేసినా పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి.

LEAVE A RESPONSE