బూతులపై ఉద్యమాన్ని నడపడం ఇక్క‌డే చూస్తున్నాం

– పట్టాభి విమర్శలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
– సీఎం వైయ‌స్ జగన్‌కు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బాబు క్షమాపణ చెప్పాలి
– చంద్రబాబుకు రాజకీయాల్లోనే కాదు..ఈ సమాజంలో ఉండే అర్హత కూడా లేదు
– టీడీపీ సభ్య సమాజంలో ఉండే అర్హత కోల్పోయింది
– టీడీపీ ప్రతినిధి మాటలను కేంద్ర ఎన్నికల సంఘానికి వినిపిస్తాం
– ఇప్పటికైనా మిగిలిన రాజకీయ పార్టీలు నోరు విప్పాలి
– విజయవాడలో జనాగ్రహ దీక్షలో పాల్గొన్న వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
విజయవాడ: బూతులు మాట్లాడి వాటిపైన ఉద్యమాన్ని నడపడం ప్రపంచంలోనే బహుషా ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే తెలుగు దేశం పార్టీని చూస్తున్నామ‌ని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అది కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే సాధ్యమైంద‌న్నారు. ఇవాళ చంద్రబాబునాయుడు , ఆయన పార్టీ నేతలు చేస్తున్న పని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్ధం కావడం లేద‌న్నారు. ఏ మాటలు అయితే పలకడానికి కూడా ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఏ మాటలను కనీసం ఇంట్లో మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బంది పడతామో, చివరకు ఆ పదాలను టీవీల్లో ప్రసారం చేసే సమయంలో మ్యూట్‌ చేస్తామో.. వాటిని మాట్లాడడమే కాకుండా, వాటి మీద రియాక్షన్‌ వస్తే.. ఆ మాటలు మాట్లాడడం పొరపాటు అని ఒప్పుకుంటే చంద్రబాబునాయుడు పెద్దరికం నిలబడేదన్నారు.
ఆ తర్వాత జరిగిన ఘటనలను తప్పు పట్టినా ఎవరూ అభ్యంతరం పెట్టే వారు కాదు. కానీ అలాంటి మాటలు మాట్లాడి, ఆ తర్వాత చోటు చేసుకున్న ఘటనలకు స్పందిస్తూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేయడం, కేంద్ర హోం మంత్రిని కలుస్తానని చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంద‌న్నారు. విజయవాడలో గురువారం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో త‌ల‌పెట్టిన‌ జనాగ్రహ దీక్షలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.
అన్నింటికీ ఆయనే కర్త:
పార్టీ అధికార ప్రతినిధిగా ఒక బాధ్యతారహితమైన వ్యక్తిని పెట్టడం, ఆ వ్యక్తి మాట్లాడిన తీరు చూశాక మేము అనుకున్నాం, అదంతా చంద్రబాబునాయుడుకు తెలియకుండా జరిగిందేమో అని. కానీ, అది నిజం కాదని.. తానే చెప్పి మాట్లాడించానన్నట్లుగా ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడిన మాటలు, ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అర్ధమవుతోంది.
ఏం చేస్తారు? మళ్లీ అలా అనిపిస్తాను. ఇది మా హక్కు. దానిపై పోరాటం చేస్తాము. ప్రశ్నిస్తే తాట తీస్తాను అంటూ అధికార పక్షాన్ని, ప్రజలను కూడా హెచ్చరిస్తున్నాడు. లేకపోతే దాని మీద రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం ఏమిటి. దాని మీద 36 గంటల దీక్షకు కూర్చోవడం ఏమిటి. దాని మీద ఆర్టికిల్‌ 356 కింద రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం ఏమిటి?
ఆ పార్టీ నేతల్లోనే..:
మన కర్మ కాకపోతే 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి. 25 ఏళ్లు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అలా మాట్లాడితే ఎలా. చంద్రబాబు తీరు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా సమంజసంగా అనిపించడం లేదు. అందుకే బంద్‌లో ఎవరూ పాల్గొనలేదు. చివరకు దీక్షను వర్ల రామయ్య వంటి నేతలు కూడా తప్పు పడుతున్నారు. 70 ఏళ్లు దాటిన వ్యక్తి ఎందుకిలా వ్యవహరిస్తున్నాడు. మన కర్మ కాకపోతే.
మాకు సంస్కారం ఉంది:
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కానీ, మన నేత జగన్‌కి కానీ తిట్లు రాక కాదు. కానీ సంస్కారం ఉంది. అందుకే అలా దుర్భాషలాడడం లేదు. చేతకానివాడు మాత్రమే నిరాశ, నిస్పృహతో తిడతాడు.
సీఎం వైయస్‌ జగన్‌ మహిళా పక్షపాతి. అందుకే అన్ని పథకాల్లో వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం ఇస్తున్నారు. ఇది ఏనాడో రుజువైంది. అందుకే ఎవరినీ కించపర్చకుండా సీఎం మాట్లాడతారు. అందుకే పార్టీలో కూడా ఎవరూ అలా మాట్లాడవద్దని ఆయన నిర్దేశిస్తారు. ఎవరైనా మాట్లాడితే వారిస్తారు.ఎందుకంటే మనది మహిళాపార్టీ. వారికి ప్రాధాన్యం ఇచ్చే పార్టీ.
అదే టీడీపీలో చూస్తే..:
అదే టీడీపీలో చూస్తే అలా మాట్లాడేవారిని ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వారినే ఆ పార్టీ పెట్టుకుంది. రామారావు కాలం నుంచి ఉన్న కొందరు సీనియర్‌ నేతలకు కూడా ఈ వ్యవహారం మింగుడు పడడం లేదు. వారికి విలువలున్నాయి. అందుకే చంద్రబాబు చేస్తున్న పనులు చూస్తూ, ఆయన పార్టీ అధికార ప్రతినిధిగా పెట్టుకున్న వ్యక్తి మాటలు వింటూ ఏం చేయాలో అర్ధం కాక మింగలేక, కక్కలేక ఉన్నారు.
వారిని తిడితే ఊర్కుంటారా:
ఇంత జరిగినా మిగిలిన పార్టీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బాధ కలుగుతోంది. కమ్యూనిస్టు పార్టీలు కానీ, పవన్‌ కళ్యాణ్‌ కానీ కనీసం ఆ తిట్లను ఖండించలేదు. కానీ దాడిని తప్పు పట్టారు. మరి ఇదే తిట్లు వారిని తిడితే ఊర్కుంటారా.
ఆ మాటే లేకపోతే?:
నిజానికి మనం నిగ్రహంగా ఉన్నాం కాబట్టే, వారు రెచ్చిపోతున్నారు. అసలు ఆ మాట వారు అనకుండా ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈ పార్టీ రాజశేఖర్‌రెడ్డి అంశతో మొదలై.. లక్షలాది మంది వెంటరాగా సాగుతోంది. అందుకే పార్టీ నాయకుడిని అందరూ అంతగా గౌరవిస్తారు. ఆయనను ఎవరైనా చిన్న మాట అంటే అస్సలు భరించలేరు.
సహనానికీ హద్దు ఉంటుంది:
ముఖ్యమంత్రి ని ఉద్దేశించి టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మీరారు, ఇక ఊరుకోం. 2014లో కూడా టీడీపీ గెల్చింది కేవలం 1 శాతం ఓట్ల తేడాతో మాత్రమే. అంటే ఆనాడే జగన్‌కి ఆ స్థాయిలో ప్రజామోదం ఉంది. అదే 2019 ఎన్నికల్లో జగన్‌గారు 50శాతం పైచిలుకు ఓట్లతో గెల్చారు. అందుకే పార్టీకి అఖండ మెజారిటీ వచ్చింది. ఆయన రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతి. పూర్తి ప్రజామోదం పొందిన వ్యక్తి.
అలాంటి మనిషిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా. ఇది అసలు ప్రజాస్వామ్యం అవుతుందా. ఆయనను తిడితే, పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదకు వస్తే మీరు నిలబడగలరా. జగన్‌ని వదిలేస్తే, మిగిలిన నాయకులు మీ మాదిరిగా తిడితే అసలు మీరు తట్టుకోగలరా?.
ఇన్నాళ్లూ తిట్లు తింటూ మౌనంగా భరిస్తూ వచ్చింది మనం అయితే, మళ్లీ మన మీదే నింద వేస్తున్నారు. అయితే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందనేది, మొన్న పట్టాభి మాటల తర్వాత స్పష్టమైంది. కాబట్టి మళ్లీ మళ్లీ చెబుతున్నాను. ఎవ్వరూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వరు. నీ మాదిరిగా కుట్రలు చేసి మాట్లాడించడం, ఆ తర్వాత దొంగ దీక్షలు చేయడం కాకుండా, సహజంగానే స్పందిస్తారు.
వదిలేస్తే తట్టుకోగలరా?:
నాయకుడు పట్టుబట్టి ఆపుతున్నారు కాబట్టి అందరూ ఆగుతున్నారు. మనం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాం తప్ప, ఇలా వీధి రాజకీయాలు, దందాలు, దౌర్జన్యాలు చేయడానికి కాదని జగన్‌ స్పష్టం చేస్తున్నారు. కనీసం దౌర్జన్యం అన్న మాట కూడా వినిపించకూడదని ఆయన చెబుతున్నారు. అంతా నిగ్రహంగా ఉండాలని కోరుతున్నారు.
లేకపోతే ఇంతటి ప్రజాబలం, ఈ స్థాయిలో కార్యకర్తల బలం ఉన్న పార్టీ, వారి తిట్లు భరిస్తూ ఉంటుందా. వదిలేస్తే వెంటపడి తరమరా? ఒక వ్యక్తి ఎవరైనా సరే, ఆయనను దుర్భాషలాడితే స్పందించకపోతే ఏదైనా లోపం ఉందనుకుంటారు. అలాంటిది కోట్లాది అభిమానులు ఉన్న ఒక నేతను తిడితే, ఆయన అభిమానులు స్పందించరా.
అదీ సంస్కారం:
ఎక్కడైనా దాడి జరిగితే ఖండించాల్సిందే. అయితే దానికి కారణాలు కూడా చూడాలి. బూతులు తిట్టడం ఏ మాత్రం సరికాదు. విలువలు పాటించకపోతే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడా మనుగడ కొనసాగించలేదు. అందుకే ఆ పార్టీలు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. ముందుగా చంద్రబాబు వైఖరిని, ఆయన పార్టీ ప్రతినిధి మాట్లాడిన మాటలను ఖండించాలి. లేదా ఆ మాటలు మాట్లాడడం సంస్కారం అని ఒప్పుకోవాలి.
నిజంగా బలం ఉంటే!:
ఇప్పుడు ఎన్నిక వచ్చింది. బద్వేలు ఉప ఎన్నిక జరుగుతోంది. నిజంగా జగన్‌పై ప్రజలకు నమ్మకం పోతే, ఆయనపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని మీరు భావిస్తే, అలాగే మీ పార్టీకి బలం పెరిగిందని అనుకుంటే ఈ ఎన్నికలో పోటీ చేయొచ్చు కదా. పదే పదే గంజాయి, హెరాయిన్‌ గురించి మాట్లాడుతున్నావు కదా. వాటినే బద్వేలు ఉప ఎన్నికలో కూడా ప్రస్తావించవచ్చు కదా.
ఆ అర్హత కోల్పోయారు:
కానీ అలా కాకుండా బూతులు తిట్టించడం. దానిపై స్పందిస్తే ఇలా రాజకీయాలు చేయడం, బంద్‌కు పిలుపునివ్వడం, దీక్షకు దిగడం.. ఇవన్నీ చూస్తుంటే, చంద్రబాబునాయుడుకు రాజకీయాల్లోనే కాదు, ఈ సమాజంలో ఉండే అర్హత కూడా లేదని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ సభ్య సమాజంలో ఉండే అర్హత కూడా కోల్పోయింది. అలాంటి దౌర్భాగ్యకరమైన పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించిందని ప్రజలు కూడా సిగ్గు పడుతున్నారు.
డిమాండ్‌–విజ్ఞప్తి:
మన డిమాండ్‌ ఒక్కటే. పట్టాభి అనే వ్యక్తి చేసిన విమర్శలు చంద్రబాబు చేయించినవి కాబట్టే, వాటికి జగన్‌కి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాగే మిగిలిన రాజకీయా పార్టీలు ఇప్పటికైనా నోరు విప్పాలి. అయ్యా చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు అని చెప్పాలి.
ఇక చంద్రబాబు ఢిల్లీ వెళ్తాడట. మనం కూడా వెళ్దాం. టీడీపీ ప్రతినిధి మాటలను కేంద్ర ఎన్నికల సంఘానికి వినిపిద్దాం. అలాగే టీడీపీ నాయకులు ఎక్కడ కనిపించినా నిలదీయండి. ఇలాంటి తిట్లు, బూతులు మాట్లాడం ఏమిటని అడగండి. రాష్ట్ర ప్రజలకు ఇదే మా విజ్ఞప్తి.. అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Leave a Reply