Suryaa.co.in

Andhra Pradesh

వ్యవస్థల నిర్మాణంలో చంద్రబాబు మేటి

– విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ భవానీ ప్రసాద్
– చంద్రబాబు X.O హిందీ పుస్తకావిష్కరణ

హైదరాబాద్ (జూబ్లీహిల్స్) ఆగస్టు 27: సామాన్యునికి ఉపయోగపడేలా వ్యవస్థల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు మరే రాజకీయ పార్టీ నాయకుడూ సాటి రారు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ పేర్కొన్నారు.

గుంటూరు కు చెందిన పాత్రికేయుడు శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించిన చంద్రబాబు X.O హిందీ పుస్తకాన్ని జస్టిస్ భవానీ ప్రసాద్ ఆవిష్కరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ క్లబ్ లో మంగళవారం సాయంత్రం జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ మహిళా నాయకురాలు భవనం షకీలా రెడ్డి అధ్యక్షత వహించారు.

కార్యక్రమంలో జస్టిస్ భవానీ ప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు ఎప్పుడూ వ్యవస్థలు బలీయంగా వుండాలని కోరుకుని ఆ దిశగా నిర్మాణం చేసేవారని చెప్పారు. న్యాయశాఖ కార్యదర్శిగా తాను పనిచేసిన కాలంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలిపారు. ఎపి విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ గా అయిదేళ్ల పాటు పనిచేసిన సమయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడూ ఒక్క సిఫార్సు చేయలేదని వివరించారు. చంద్రబాబు X.O పుస్తకంలో ప్రతి అంశమూ నేటి సమాజానికి ఎంతో ఉపయుక్తమైనదని అన్నారు.

ఏపీ రేరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాథ్ వెలమాటి మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడూ తెలుగుజాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలని తపన పడుతుంటారని చెప్పారు. కార్యక్రమంలో మదనపల్లి ఎంఎల్ఏ మొహమ్మద్ షాజహాన్ బాషా, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, ప్రముఖ గజల్ విద్వాంసుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్, పుస్తక రచయిత శాఖమూరు శ్రీనివాస ప్రసాద్, ప్రచురణ కర్త మిక్కిలినేని శ్రీకాంత్ తదితరులు ప్రసంగించారు.

షకీలా రెడ్డి తన అధ్యక్షోపన్యాసం లో చంద్రబాబు వంటి దార్శనికుడు ప్రపంచంలోనే ఎవరూ లేరన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయటం తన పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నాను అని చెప్పారు. ప్రతిదినం ఎనిమిది బరువుల బంగారం ఇచ్చే శమంతక మణి తో చంద్రబాబును పోలుస్తూ పుస్తకంలో ప్రస్తావించటం ఎంతో సముచితంగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE