Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

-పెన్షన్ల పంపిణీలో అధికారుల వైఫల్యంతో 33 మంది లబ్ధిదారులు చనిపోయారు
-బాధ్యులైన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

ఇంటింటికీ పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్‌ దారులు చనిపోయా రని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయు డు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అధికార వైసీపీకి అనకూలంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించు కోవడం ద్వారా లబ్ధిదారులకు పథకాలు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోలని, కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు విరుద్ధంగా పెన్షన్ల పంపిణీ గ్రామ సచివాలయాల వద్ద చేపట్టాలని సెర్ప్‌ సీఈవో ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. దీని వల్ల తలెత్తే ఇబ్బందులను తెలుపుతూ ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్లు చెప్పారు.

గ్రామ/వార్డు సచివాలయాల్లో 1,34,694 మంది ఉద్యోగులు అందుబాటు లో ఉన్న దృష్ట్యా వారి ద్వారా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేయవచ్చని, అయితే టీడీపీని దోషిగా చేసి రాజకీయంగా లబ్ధిపొందేందుకు పెన్షనర్లను 40 డిగ్రీల ఎండలో వృద్ధులు, వికలాంగులను సచివాలయాల కు పిలిపించారని, అక్కడ షామియానాలు, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించలేదన్నారు.

సచివాలయాల వద్ద నగదు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది పింఛను పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చారని, ఈ క్రమంలోనే 33 మంది వడదెబ్బకు గురై మరణించినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇంటికి వెళ్లి పెన్షన్‌ అందించి ఉంటే 33 మంది వృద్ధుల ప్రాణాలు పోయేవి కావన్నారు. ఆనారోగ్యంతో ఉన్న వారికి ఇంటివద్దకు వెళ్లి పెన్షన్‌ ఇవ్వాలని సూచనలు ఉన్నప్పటికీ….ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించి 33 మంది మరణానికి కారణమైన అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

LEAVE A RESPONSE