హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు& బిజెపి శాసనసభ పక్ష ఉప నాయకులు పాయల్ శంకర్, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు , పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి , బిజెపి కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి అభ్యర్థి అంజిరెడ్డి, బిజెపి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి మల్కా కొమరయ్య, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి( సంస్థగత) చంద్రశేఖర్ తివారి జీ, బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ( సంస్థగత) మధుకర్ జీ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు ఏమన్నారంటే.. భారతదేశంలో శివాజీ మహారాజ్ లాంటి పరిపాలకుడు అరుదు. ఆయన పాలన మత, కులాలకు అతీతంగా సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.
శివాజీ మహారాజ్ భారతదేశంలో ఆదర్శ పరిపాలన అందించిన యోధుడు. ఆయన ఒక కులానికి, మతానికి చెందిన రాజుగా కాకుండా, యావత్ భారత దేశానికే మంచి పరిపాలనా యంత్రాంగాన్ని అభివృద్ధి చేశారు. నేటి రెవెన్యూ వ్యవస్థ, సివిల్ సర్వీసెస్ విధానాలు శివాజీ మహారాజ్ పరిపాలనా మోడల్ ఆధారంగా రూపుదిద్దుకున్నాయి.
ఆయన మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, అన్ని మతాలను గౌరవించేలా సమగ్ర పాలన అందించారు. శివాజీ మహారాజ్ పాలన మనందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. శివాజీ మహారాజ్ స్ఫూర్తిగా మన పాలకులు అవినీతిరహిత పాలన అందించాలని కోరుతున్నాను.
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి ఏమన్నారంటే.. శివాజీ మహారాజ్ పాలన మానవతా విలువలకు అద్దంపడుతుంది. దేశాభివృద్ధికి ఆయన చూపిన మార్గమే స్ఫూర్తి. శివాజీ మహారాజ్ ఆదర్శవంతమైన పాలన అందించి, రక్షణ, వైద్య, విద్య, సివిల్ సర్వీసుల వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచారు.
ప్రజాసేవలో నిస్వార్థమైన అంకితభావంతో పాలనను అందించి, రాజధర్మానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. శివాజీ మహారాజ్ స్ఫూర్తితో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఐక్యత కోసం కృషి చేశారు. అదే మార్గాన్ని అనుసరించి ప్రధాని నరేంద్ర మోదీ సమర్థమైన పాలన అందిస్తున్నారు.