Suryaa.co.in

Andhra Pradesh

పారదర్శకంగానే చిక్కీల టెండర్ల ఖరారు జరిగింది

• విద్యార్థుల సంఖ్య పెరడంవల్లే చిక్కీల టెండర్ల విలువ పెరిగింది
• ఫౌల్ట్రీ రైతుల సంక్షేమం దృష్ట్యానే గుడ్ల టెండర్లను ఖరారు చేస్తాం
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గోరుముద్దలు పథకం క్రింద విద్యార్థులకు వారాని మూడు రోజుల పాటు అందజేసే వేరుశెనగ చిక్కీల టెండర్ల ఖరారు ప్రక్రియలో ఎటు వంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సచివాలయం నాల్గో బ్లాక్ లోని ప్లబిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ చిక్కీలు, గుడ్ల టెండర్ల ఖరారు ప్రక్రియలో పలు మాద్యమాల్లో వచ్చిన ప్రతికూల వార్తాంశాలను ఖండించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ చిక్కీల టెండర్ల ఖరారు ప్రక్రియను రివర్సు టెండరింగ్ విదానంలో ఎంతో పారదర్శికంగా నిర్వహించి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా ఎన్నో జాగ్రతలు తీసుకోడం జరిగిందన్నారు. కోవిడ్ నేపథ్యంలో మల్టీలేయర్ ప్యాకెట్ ల ద్వారా చిక్కీలను విద్యార్థులకు సరఫరా చేసే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. టెండర్ల నియమ, నిబందనలకు, షరతులకు అనుగుణంగా కేంద్రీయ భండార్ మరియు జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య లేని కారణంగానే అవి ఎంపిక కాలేదని మంత్రి స్పష్టంచేశారు. అదే విధంగా థర్డు పార్టీ అయిన టాటా ప్రొజెక్టు లిమిటెడ్ తో కూడా విచారణ జరిపించడం జరిగిందని, చిక్కీలను పెద్ద మొత్తంలో సరఫరా చేసే తగిన సామర్థ్యం కేంద్రీయ బండార్ కు లేదని, తగిన యంత్ర సామాగ్రి ఆ సంస్థ వద్ద లేదని వారి నివేదికలో కూడా పొందుపర్చడం జరిగిందని మంత్రి తెలిపారు. ఇ-ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆన్ లైన్ టెండర్ ప్రక్రియ నిర్వహించి, రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంతో పారదర్శకంగా సరఫరాదారులను ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు చిక్కీలను సరైన సమయంలో సరఫరా చేయడానికి, కాంట్రాక్టర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని నెలకొల్పి ఉత్తమమైన ధర రావడానికి 6 ప్యాకేజీల క్రింద టెండరు పిలవడం జరిగిందన్నారు. దానికి అనుగుణంగా టెండర్లలో నిబంధనలను పొందుపరచడం జరిగిందని, టెండర్ ప్రక్రియలో 6 ప్యాకేజీలకు గానూ 20 సంస్థల నుండి 62 దరఖాస్తులు వచ్చాయని, ఈ 62 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి చివరిగా 6 ప్యాకేజీలకు 9 సంస్థల నుండి 6 సంస్థలను ఎంపిక చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

గుడ్ల టెండర్లు ఇప్పటి వరకూ ఖరారు కాలేదు…..

మద్యాహ్న భోజన పథకం అమల్లో భాగంగా విద్యార్థులకు సరఫరా చేసే గుడ్ల టెండర్లు ఇప్పటి వరకూ ఖరారు కాలేదని, అయినప్పటికీ గుడ్ల టెండర్లలో ఏదో గోల్ మాల్ జరిగినట్లు పలు మాద్యమాల్లో ప్రతికూల వార్తాంశాలు ప్రచురించడం విడ్డూరంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఫౌల్ట్రీ రైతుల నుండే గుడ్లను సేకరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. కేంద్రీకృత దోరణిలో కాకుండా గుడ్ల సేకరణ, సరఫరాను వికేంద్రీకరించి విద్యార్థులకు తగిన పరిమాణంలో నాణ్యమైన గుడ్లను సరఫరా చేయాలనే లక్ష్యంతో పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా టెండర్లను పిలవడం జరిగిందన్నారు. గుడ్ల సరఫరాలో దళారుల ప్రమేయం ఏమాత్రం లేకుండా ఫౌల్ట్రీ రైతులకు పూర్తి స్థాయిలో మేలు జరిగే విధంగా టెండర్లలో నియమ, నిబంధనలను రూపొందించడం జరిగిందన్నారు. ఫౌల్ట్రీ రైతులు అంతా కన్సార్టియంగా ఏర్పడి గుడ్లను సరఫరా చేసే అవకాశాన్ని కూడా ఫౌల్ట్రీ రైతులకు కల్పించడం జరుగుతుందన్నారు. తద్వారా ఫౌల్ట్రీ రైతులకు మేలు జరడమే కాకుండా మరో వైపు వికేంద్రీకరణ విధానం ద్వారా గుడ్ల రవాణా చార్జీలు చాలావరకు తగ్గుతాయని మంత్రి తెలిపారు.

పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాదానం చెపుతూ ప్రభుత్వం పై బురదజల్లే విధంగా చిక్కీలు, గుడ్ల టెండర్ల విషయంలో అసత్యాలను ప్రచారం చేసే వ్యక్తులపై పరువునష్టం దావాలు వేస్తామని మంత్రి హెచ్చరించారు.రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మద్యాహ్న భోజన పథకం సంచాలకులు బి.మొహ్మద్ దివాన్ మైదీన్, అదనపు సంచాలకులు సుబ్బారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE