Suryaa.co.in

Andhra Pradesh

ఐదేళ్లలో ఎన్.పి.సి.ఎ కింద రాష్ట్రానికి విడుదల చేసిన నిధుల వివ‌రాల‌పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల పర్యావరణ వ్యవస్థల సంరక్షణ జాతీయ ప్రణాళిక (NPCA) కింద పునరుద్ధరించబడిన వెట్లాండ్స్ ( చిత్తడి నేలలు) , సరస్సుల సంఖ్య వివ‌రాలు, అలాగే గత ఐదేళ్లలో ఈ ప్రణాళిక కింద ఆంధ్రప్రదేశ్‌కు ఏడాది వారీగా విడుదల చేసిన నిధుల వివరాలు తెలపాల‌ని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, హిందూపురం ఎంపి బి.కె. పార్ధసారథి, చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు, విజ‌య‌న‌గ‌రం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు లతో కలిసి సోమ‌వారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర‌ పర్యావరణం, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ను ప్ర‌శ్నించారు.

ఈ ప్ర‌శ్నల‌కు కేంద్ర‌ పర్యావరణం, అటవీ, వాతావరణ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ బ‌దులిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23,352 చిత్తడి నేలలు ఉన్నాయని తెలిపారు. అలాగే చిత్త‌డి నేల‌లు అధికంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 2263 వుండ‌గా, స్వ‌ల్పంగా అల్లూరి సీతారామ‌రామ జిల్లాలో 197 మాత్ర‌మే వున్న‌ట్లు చెప్పారు.

కొల్లేరు సరస్సు పునరుద్ధరణ కోసం కొల్లేరు సరస్సు పరిరక్షణ మరియు నిర్వహణ కోసం నేషనల్ ప్లాన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ (NPCA) పథకం కింద కేంద్ర ప్ర‌భుత్వం 1987 నుండి 2010 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2 వంద‌ల 49 కోట్ల 56 ల‌క్ష‌ల 90 వేల రూపాయిలు ( రూ. 249.569 ) విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు. గత 5 సంవత్సరాల్లోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్స్ (IMPs) సమర్పించకపోవడం వల్ల కొత్తగా ఎటువంటి నిధులు విడుదల కాలేదన్నారు.

LEAVE A RESPONSE