– అధికారం కోసం మత విద్వేషాలను రెచ్చ గొడుతున్న బిజెపి
– ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిన టిఆర్ఎస్ సర్కార్
– భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ
– ఉదయపూర్, వరంగల్ డిక్లరేషన్ ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి
– నవ సంకల్ప శిబిరంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడి
దేశాన్ని విభజించి రాజకీయ అధికారం పొందాలని చూస్తున్న బిజెపిని, ధనిక రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసి దివాలా తీయించిన టిఆర్ఎస్ ప్రభుత్వాలను గద్దె దింపడానికి చింతన్ శిబిరం లో తీసుకునే నిర్ణయాలు ప్రజలను సమాయత్తం చేయడానికి దోహదపడతాయని సీఎల్పీ నేత, నవ సంకల్ప మేధోమధన శిబిరం చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం మేడ్చల్ జిల్లా కీసర లోని బాలవికాస్ లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న నవ సంకల్ప మేధోమధన శిబిర్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
భిన్నత్వంలో ఏకత్వంగా భారత జాతిని కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేస్తే… దేశాన్ని విభజించి రాజకీయ అధికారం పొందాలని తెలంగాణలో మత విద్వేషాలను సృష్టిస్తున్న బిజెపి కుట్రలను జాతి నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీ వారసులుగా తిప్పికొట్టాలన్నారు. భారత దేశ సార్వభౌమాధికారానికి భిన్నంగా దేశంలో బీజేపీ సర్కారు పాలన సాగుతుందన్నారు. హిందూ దేశంగా మార్చాలని బిజెపి, భారత రాజ్యాంగాన్ని మార్చాలని టిఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మనందరిపైనా ఉందని నొక్కి వక్కాణించారు. దేశ స్వాతంత్ర సంగ్రామం చరిత్రను వక్రీకరించే విధంగా నవభారత నిర్మాత జోహార్ లాల్ నెహ్రూ ఫోటో లేకుండా ఆజాదికా అమృత్ ఉత్సవాలు నిర్వహించే అధికారం బిజెపికి ఎవరిచ్చారని నిలదీశారు. కాంగ్రెస్ పై ఆర్ఎస్ఎస్ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టి చరిత్రలు కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనందరిపైనా ఉందని వెల్లడించారు.
ఉదయపూర్ చింతన్ శిబిర్ నిర్ణయాలు, వరంగల్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ తీసుకునే విధానపరమైన నిర్ణయాలను అమలు చేయడంలో ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని, గతంలో అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటించిందన్నారు. భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయం అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందన్న ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎదురు చూస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చి అధికారంలోకి రావడంతో పాటు సామాజిక రుగ్మతలపై యుద్ధం చేసి సామాజిక మార్పులు చేసిందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ నెహ్రూ నాయకత్వంలో పంచవర్ష ప్రణాళికలు రూపొందించి మిశ్రమ ఆర్థిక విధానాలతో నవభారత నిర్మాణం చేసిందన్నారు. అసమానతలు లేని జాతి నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా కృషి చేస్తుందని వివరించారు.
ఎఐసీసీ ఆదేశాల మేరకు ఈరోజు కీసరలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న నవ సంకల్ప్ మేథో మధన శిబిర్ సమావేశాలల్లో భాగంగా పతాకవిష్కరణ చేసి గౌరవ వందనం చేసిన నవ సంకల్ప్ చింతన్ శిబిర్ చైర్మన్ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అనంతరం ఈ సమావేశం తెలంగాణలో చారిత్రాత్మకంగా నిలిచిపోతాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ శిబిరానికి హాజరైన తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మానిక్కం ఠాగూర్, ఎఐసిసి కార్యదర్శి బోసురాజు, శ్రీనివాస కృష్ణన్ టిపిసిసి ముఖ్య నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.