– టెక్కలి ఐ-టీడీపీ కో ఆర్డినేటర్ వెంకటేశ్ పై సీఐడీ అధికారుల ఒత్తిడి
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై కేసు నమోదు చేసి, విచారణకు పిలిచిన సీఐడీ అధికారులు నారా లోకేశ్ ప్రోద్బలంతోనే పోస్టు పెట్టినట్లు చెప్పాలని ఒత్తిడి చేశారంటూ ఐ-టీడీపీ టెక్కలి కో-ఆర్డినేటర్ అప్పిలి వెంకటేశ్ పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చినప్పటి నుండి విచారణ వరకు సీఐడీ పోలీసులు అనుసరించిన తీరుపైనా అసహనం వ్యక్తం చేశారు. ముమ్మాటికీ కక్షపూరిత అరెస్టు అన్నారు. ఐ-టీడీపీ వారిని అరెస్టు చేస్తే లోకేశ్ వస్తాడంట కదా అంటూ విచారణ అధికారులు పదేపదే చెప్పినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు నారా లోకేశ్ ప్రోద్బలంతోనే పెట్టినట్లు చెప్పాలంటూ సీఐడీ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారన్నారు.
నారా లోకేశ్ లేదా అచ్చెన్నాయుడి పేరు చెబితే కేసు లేకుండా చూసుకుంటామని పదే పదే చెప్పడం, విచారణ సమయంలో సీఐడీ అధికారులకు పదే పదే ఫోన్ వస్తుండడం, ఫోన్ మాట్లాడి వచ్చిన ప్రతి సారి కూడా లోకేశ్ పేరు చెప్పమంటూ ఒత్తిడి చేయడంతో ఎవరో వెనకుండి మొత్తాన్న నడిపిస్తున్నారని వెంకటేశ్ అనుమానం వ్యక్తం చేశారు.
విచారణ తర్వాత అప్పిలి వెంకటేశ్ తో కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ… శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన ఐటీడీపీ కో ఆర్డినేటర్ అప్పిలి వెంకటేశ్ ను సీఐడీ పోలీసులు నోటీసులిచ్చి పిలిపించారు. జ్వరం వచ్చిందని చెప్పినా వినకుండా బెదిరించి సీఐడీ కార్యాలయానికి తెచ్చారు. మధ్యాహ్నం వరకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా, జ్వరానికి మందులు కూడా వేసుకోనీయలేదు. విచారణ గురించి ప్రశ్నిస్తే.. మాకు ఇంకా ఫోన్ రాలేదు అందుకే విచారణ ప్రారంభించకుండా జాప్యం చేశారు. అప్పుడు పంపించి.. మళ్లీ రావాలని పంపించారు. ఈ రోజు విచారణకు వెళ్తే.. నారా లోకేశ్, అచ్చెన్నాయుడు ప్రోద్బలంతోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు చెప్పమన్నారు. లోకేశ్ ను రమ్మనాలంటూ ఫోన్ ఇచ్చి మరీ ఒత్తిడి చేశారు.
ఇదేం విచారణ?
మూడేళ్లుగా అర్ధం పర్ధం లేని కేసులు పెట్టడం, అర్ధరాత్రి వరకు స్టేషన్లో కూర్చోబెట్టి వేధించడమే సీఐడీ పోలీసుల విధా.? టెర్రరిస్టుల్ని ఉంచినట్లు సీఐడీ స్టేషన్ ముందు ఇనుప కంచెలు వేశారు. తాడేపల్లి కొంపలో జగన్ ఉన్నట్లు అందరినీ తీర్చిదిద్దుతున్నారు. ఎంతో గొప్ప ప్రతిష్ట కలిగిన సీఐడీ కార్యాలయం వైసీపీ రెండో కార్యాలయంగా తయారైంది. పోలీసు వ్యవస్థ ఇంతగా దిగజారిపోవడం సిగ్గుచేటు. డీజీపీగా ఉన్న వారు కూడా వారి విలువలు కోల్పోయారు. ప్రజలు చీదరించుకుంటున్నా సిగ్గులేదు. కోర్టుల్లో సెక్షన్లు చదివించినా ఇంకా వైసీపీకి ఊడిగం చేయడం సిగ్గుచేటు. మహానాడు విజయవంతంతో తాడేపల్లి ప్యాలెస్ లోని జగన్ రెడ్డికి, సజ్జలకు పిచ్చి పట్టింది. అందుకే పిచ్చి పిచ్చిగా ఆదేశాలిస్తున్నారు. జగన్ రెడ్డి చెప్పినట్లు నడుచుకుని గతంలో ఎంతోమంది జైళ్లకెళ్లారు. ఇప్పుడు మళ్లీ వింటే జైలుకు వెళ్లి రావడం కాదు.. అక్కడే ఉండిపోతారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడం సరికాదని సుప్రీం కోర్టు ఆదేశాలున్నప్టపికీ అరెస్టులు సిగ్గుచేటు.
అడ్వొకేట్ మాగులూరి హరిబాబు మాట్లాడుతూ… చిన్న విషయమైన 41ఏ నోటీసులిచ్చే ప్రక్రియను కూడా కక్ష తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు. కొన్ని అదృశ్య శక్తుల ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలపై కక్ష తీర్చుకుంటున్నారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థ శాశ్వతమని పోలీసులు గుర్తించాలి. జగన్ రెడ్డిపై అంత ప్రేమ ఉంటే.. పోలీసులు ఖాకీ చొక్కాలు వదిలి వైసీపీ కండువాలు కప్పుకోండి. ఫోన్ చేస్తే కార్యకర్తకు లోకేశ్ గారు అండగా ఉంటారంట కదా.. అని ప్రశ్నించడానికి బుద్ధి ఉందా అసలు.? లోకేశ గారి ప్రమేయం ఉందని నిరూపించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు. ఎవరి పరిధిలో వారు ఉద్యోగాలు చేసుకుంటే ఇబ్బంది ఉండదని తెలియదా.? ఐపీఎస్ లు కూడా ఈ వైసీపీ గూండాలు ఫోన్ లో చెప్పింది చేయాలనుకోవడం దుర్మార్గం. భయపెట్టి నాయకుల పేర్లు చెప్పించాలనుకోవడం మీకు సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి. అధికారులు పరిధి దాటకుండా ఉంటే మంచిది.
టెక్కలి ఐ-టీడీపీ కో ఆర్డినేటర్ అప్పిలి వెంకటేశ్ మాట్లాడుతూ.. మే 30న రాత్రి 9 గంటలకు సీఐడీ ఎస్ఐ ఫోన్ చేసి.. నోటీసులు వచ్చాయి తీసుకోవాలన్నారు. నాకు జ్వరంగా ఉందని చెప్పా. ఫోన్ చేసిన రాత్రే లోకల్ పోలీసులు నోటీసులు తీసుకుని ఇంట్లోకి వచ్చారు. బెడ్ రూంలోకి రావడంతో సెర్చ్ వారంట్ ఉందా అని ప్రశ్నిస్తున్న సమయంలోనే ఛార్జింగులో ఉన్న నా ఫోన్ తీసుకుని సీజ్ చేశారు. టెర్రరిస్టులు, నక్సలైట్ కోసం వచ్చినట్లు తెల్లవారు జామున ఇంటికొచ్చారు. తర్వాతి రోజు ఉదయం 10కి మంగళగిరి సీఐడీ కార్యాలయానికి రావాలన్నారు. ఎలా సాధ్యమని ప్రశ్నించినా పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని చెబుతూ సీఐడీ అధికారులకు మెయిల్, వాట్సప్ ద్వారా అడిగాను. దానికి రిప్లై కూడా ఎవరూ ఇవ్వలేదు.
తర్వాత జూన్ 1న ఉదయం 10 గంటలకు మంగళగిరి రమ్మన్నారు. బాధ్యత గల పౌరుడిగా మంగళగిరి కార్యాలయానికి వచ్చాను. మధ్యాహ్నం వరకు మంగళగిరిలో ఉంచి తర్వాత గుంటూరు రమ్మన్నారు. అడ్వొకేట్ కూడా ఉండడానికి వీల్లేదన్నారు. అక్కడ దర్యాప్తు చేస్తున్న ఒక అధికారి లోకేశ్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పమ్మన్నారు. అచ్చెన్నాయుడి పేరు, చంద్రబాబు గారి పేరు చెబితే కేసు లేకుండా వదిలేస్తామంటూ సాయంత్రం 4 వరకు విచారించారు. ఆ సమయంలోనే విచారణ కార్యాలయంలో సాక్షి మీడియా వారు కనిపించారు. వారిని ఎందుకు, ఎవరు అనుమతించారో వారికే తెలియాలి. సీఐడీ కార్యాలయంలో సాక్షి మీడియాకు ఏం పని.? సాక్షి కార్యాలయమా.. లేక సీఐడీ కార్యాలయమా అని ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా రాత్రి 8.30 వరకు స్టేషన్ లోనే ఉంచారు.
విషయం తెలుసుకుని గుంటూరుకు చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు సీఐడీ కార్యాలయానికి రావడంతో అప్పటికప్పుడు వెళ్లిపొమ్మన్నారు పంపంచారు. తర్వాత రోజు రావాల్సిందిగా కమిట్మెంట్ నోటీసు రాయించుకున్నారు. ఈ రోజు 10 గంటలకు సీఐడీ కార్యాలయానికి వెళ్తే.. నన్నో ఉగ్రవాదిలా ట్రీట్ చేశారు. 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం లోపలికి వెళ్తే లోపల ఎవరూ లేరు. సాయంత్రం నాలుగు గంటలకు ఎస్సై వచ్చి 7వ తేదీన రమ్మని చెప్పి వెళ్లిపొమ్మన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా., పోలీసు రాజ్యాంగం నడుస్తోందా అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
అమ్మఒడి, వాహన మిత్ర పథకాలను రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో తిరుగుతుంటే దాన్ని నేను షేర్ చేశాను. తప్పుడు సమాచారం అనిపించి వెంటనే డిలీట్ చేశాను. కానీ దాన్ని బూచిగా చూపించి నోటీసులిచ్చారు. విచారణకు పిలిచి.. లోకేశ గారే చేయించారని చెబితే వదిలేస్తామంటూ బెదిరించారు. నన్ను బెదిరించిన పోలీసులకు చెబుతున్నా.. ఒత్తిడి తెచ్చినా తలలు తెంచినా మీకు తలొగ్గేదే లేదు. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు చేస్తున్న దురాగతాలను ప్రజలు గమనిస్తున్నారని గుర్తుంచుకోండి.
విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. పోలీసులు ఉన్నది ప్రజల్ని రక్షించడానికో, భక్షించడానికో అర్ధం కావడం లేదు. మహానాడు విజయవంతం కావడం, బస్సు యాత్ర తుస్సు మనడంతో వైసీపీ నేతల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఎక్కడో ఏదో షేర్ చేశారనే కక్షతో.. ప్రతిపక్ష సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్నారు. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసే దురాగతాలను ప్రజలు గమనించారు. ఇప్పటికైనా ఇలాంటి అక్రమ కేసులతో సాధించేదీ లేదని జగన్ రెడ్డి తెలుసుకోవాలి. ఎన్ని అరాచకాలకు పాల్పడినా తెలుగుదేశం పార్టీ వెన్ను చూపేదే లేదు. పోరాడుతుందే తప్ప పారిపోదని గుర్తుంచుకోవాలి.