– ప్రెస్‌క్లబ్‌లో రణరంగం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్మిక అనుబంధవిభాగమైన ఐఎన్‌టియులో అంతర్గత పోరు చివరకు దాడుల వరకూ వెళ్లింది. ఐఎన్‌టీయూసీ నేతలు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బాహాబాహీకి దిగారు. సంజీవ్ రెడ్డి, అంబటి కృష్ణ మూర్తి వర్గాల మధ్య గొడవ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో దాడుల వరకు వెళ్లింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి.
ఐఎన్‌టీయూసీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి చాలా రోజులుగా పరస్పరం దూషణలకు దిగుతున్నారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఓ వర్గం ప్రెస్‌మీట్ నిర్వహిస్తుండగా, మరొక వర్గానికి సంబంధించిన నేతలు వెళ్లి ప్రెస్‌మీట్‌ను అడ్డుకుని వారిని దుర్భాషలాడారు. ఒక వర్గానికి చెందిన నేతల అనుచరులు మరొక వర్గానికి చెందిన నేతల అనుచరులు కొట్టుకున్నారు.
వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని సంజీవ్ రెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. చాలా రోజులుగా ఐఎన్‌టీయూసీ ఆర్ అనే పేరుతో అంబటి కృష్ణమూర్తి అనే వ్యక్తి సొంతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కానీ ఐఎన్‌టీయూసీ అనేది ఒకటే ఉంటుంది. ఐఎన్‌టీయూసీ ఆర్ అని పెట్టుకోవడానికి ఎలాంటి అర్హత లేదని సంజీవ్ రెడ్డి వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. పోలీసుల చర్యను సంజీవరెడ్డి వర్గీయులు ఖండించారు.