– ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోంది
– వివేకా హత్య నాపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారు
– బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారు
– ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్ధుల బాధలు కలిచివేస్తున్నాయి
– టిడిపి స్ట్రాటజీ మీటింగ్ లో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
అమరావతి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వివేకా హత్యపై తాజాగా బయటకు వస్తున్న వాంగ్మూలాలతో జగనే దోషి అనేది స్పష్టంగా అర్ధం అవుతోందని చంద్రబాబు అన్నారు. కేసును మొదటి నుంచి తప్పుదోవ పట్టిస్తున్న జగన్ ను సిబిఐ విచారించాలన్నారు. నాడు సిఎంగా ఉన్న నాపై హత్యానేరం మోపి జగన్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారనేది రుజువయ్యిందన్నారు.
తండ్రి హత్యపై న్యాయం చెయ్యాలని కోరిన సునీత పట్ల అన్నగా వ్యవహరించిన తీరుతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారని చంద్రబాబు అన్నారు. విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడే హక్కు గాని, సిఎం చైర్ లో కూర్చునే అర్హత గాని జగన్ కు లేవని చంద్రబాబు మండిపడ్డారు. హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తే… ఏమవుతుంది….నాపై 12వ కేసు అవుతుంది అని జగన్ వ్యాఖ్యానించడం అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని, తన అవినీతి డబ్బుతో దేనినైనా మేనేజ్ చేయగలననే అహంకారాన్ని స్పష్టం చేస్తోందని చంద్రబాబు అన్నారు. పార్టీ ముఖ్యనేతలతో జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్ ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాబాయ్ హత్యలో సూత్రధారి ఎవరో అనేది ఇప్పుడు తేలిపోయిందని….ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు.నాడు గ్యాగ్ అర్డర్ తేవడం నుంచి….ఇప్పుడు సిబిఐ విచారణను తప్పు పట్టడం వరకు హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయని చంద్రబాబు అన్నారు.
ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు డైవర్ట్ పాలిటిక్స్ అమలు చేస్తున్న జగన్….ఈ విషయంలో ప్రజలను ఏమార్చలేరని అన్నారు. హత్యను పాత్రధారులకే పరిమితం చేసి సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఏ పౌరుని ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా? వైఎస్ కోటలోనే వైఎస్ తమ్ముణ్మి హత్యచేయడం అంత:పుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమా? అని ప్రశ్నించారు.
స్ట్రాటజీ మీటింగ్ లో చర్చకు వచ్చిన ఇతర అంశాలు:-
ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల వెతలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. రెండు రోజుల పాటు వారితో జూమ్ ద్వారా మాట్లాడి ధైర్య చెప్పానని అన్నారు. వారి సమాచారాన్ని సేకరించి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ కార్యాలయానికి ఎప్పటికప్పుడు పంపుతున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా ఏదో రూపంలో విద్యార్థులకు సాయంచేసేందుకు టిడిపి ప్రయత్నం చేస్తుందని నేతలు అన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని…దీనిపై ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. రష్యా -ఉక్రెయిన్ యుద్ధం పేరుతో అప్పుడే వంటింటి నూనె రేట్లు పెంచేశారని…రానున్న రోజుల్లో ఇవి మరింత భారం కాకుండా ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో జరగుతున్న పరిణామాలపై టిడిపి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టును ఒక సాధారణ బ్యారేజ్ గా మార్చే నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారుతాయని అన్నారు. ఈ విషయంలో వైసిపి సర్కారు వైఫల్యానికి రాష్ట్ర రైతాంగం నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
పాఠశాలల విలీనం, జిల్లాల విభజన విషయంలో శాస్త్రీయత అనేది లేదని నేతలు అన్నారు. పిల్లలకు పాఠశాలలను దూరం చేస్తున్న ప్రభుత్వ పాలసీలపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని నేతలు అన్నారు. ఇక జిల్లాల విభజన విషయంలో తొందరపాటుతో కొత్త సమస్యలు వస్తున్నాయని సమావేశం అభిప్రాయ పడింది.
పార్టీ సీనియర్ నేత, రాజకీయ దురంధరుడు యడ్లపాటి వెంకట్రావు మృతికి సమావేశం సంతాపం తెలిపింది. ఉన్నత విలువలతో రాజకీయం చేసిన యడ్లపాటి ఆదర్శ ప్రాయుడని నేతలు కొనియాడారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కె.అచ్చెన్నాయుడు,వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బండారు సత్యనారాయణ మూర్తి, కేఎస్ జవహర్, బోండా ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర యాదవ్, టీడీ జనార్థన్, బీసీ జనార్థన్ రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పి.అశోక్ బాబు, గురజాల మాల్యాద్రి, కొమ్మారెడ్డి పట్టాభిరాం, మద్దిపాటి వెంకటరాజు, జి.వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.