నేడు మేడారానికి కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్‌..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మేడారం వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మలను దర్శించుకోనున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన నేరుగా హెలికాప్టర్‌లో మేడారానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఇదిలాఉంటే.. మేడారం మహాజాతరలో అతి కీలకఘట్టం ఆవిష్కృతమైంది. జాతర రెండో రోజు సమ్మక్క గద్దెమీదికి చేరుకుంది. తొలిరోజు కన్నెపెల్లి నుంచి సారలమ్మను గద్దెమీదికి చేర్చిన గిరిజన పూజారులు.. రెండోరోజు చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెమీదికి చేర్చారు. సమ్మక్క, సారలమ్మల ప్రతిరూపాలుగా భావించే, పసుపు-కుంకుమల భరిణలను గద్దెలపైన ప్రతిష్ఠించారు పూజారులు. దీంతో జాతరలో అతి కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.

సమ్మక్క తల్లిని ప్రభుత్వ లాంచనాలతో గద్దెపైకి ఆహ్వానం పలికారు మంత్రులు, అధికారులు. తల్లి రాకకు గౌరవ సూచకంగా జిల్లా పోలీసు అధికారులు గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అమ్మకు గౌరవ వందనం సమర్పించారు. ఇద్దరు తల్లులు గద్దెల మీద కొలువుదీరడంతో మేడారం భక్త జన సంద్రంగా మారిపోయింది. అమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇసుక వేస్తే రాలనంత మంది వన దేవతల దర్శనానికి పోటెత్తారు.

Leave a Reply