కాపులను అవహేళన చేసిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి

* మొదటినుంచి కాపులను కించపరచడమే ఆయన నైజం
* కాపులు అమ్ముడుపోతారని చెప్పడం సిగ్గుచేటు
* కాపుల మనోభావాలు దెబ్బ తీశారు
* కాకినాడ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ వెల్లడి

మొదటి నుంచి కాపులను కించపరచడానికి.. వారిని అవహేళన చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ వ్యాఖ్యానించారు. కాపు నాయకులను వైసీపీ పార్టీలోని అదే సామాజిక వర్గం వారితో ఇష్టానుసారం తిట్టించి ఆనందం పొందటం జగన్ రెడ్డికి మొదటి నుంచి అలవాటే అన్నారు. కాకినాడ కాస్మో పాలిటన్ క్లబ్ లో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ “కాపునేస్తం విడుదల చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి ఆ పనిని పూర్తిగా పక్కన పెట్టేశారు. కాపులపై తనకున్న కోపాన్ని ప్రదర్శించడానికి ఈ సభను వాడుకున్నారు. కాపులకు సంబంధించిన కార్యక్రమంలో వారి మనోభావాలు కించపరిచేలా మాట్లాడారు. కాపులు ఎక్కువగా ఉండే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చినప్పుడల్లా జగన్ రెడ్డి కాపుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు. నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఇష్టానుసారం కాపులపై తనకు ఉన్న చిన్న చూపును బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు.

కాపులు ఓట్లు అమ్ముకునే వారని ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడడం అత్యంత బాధాకరం. జనాభాలో అత్యంత ఎక్కువగా ఉండే కాపులు ఎప్పుడు ఓట్లు అమ్ముకున్నారో ముఖ్యమంత్రి రుజువు చేయాలి. లేకుంటే మొత్తం కాపు జాతికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాపుల ఓట్లతో గెలవలేదా? అలా గెలవలేదు అని వారు చెప్పగలరా? గత ప్రభుత్వాలు సైతం కాపులకు అన్యాయం చేశాయి. ఇప్పుడు కూడా కాకి లెక్కలతో కాపులను మభ్య పెడుతున్నారు.
ప్రజలను మోసం చేసే ప్రభుత్వం ఇది రూ. 2వేల కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేశామన్నారు. అవెక్కడ అని అడిగితే బూతులు తిడతారు. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్ర భవిష్యత్ తాకట్టు పెట్టి నిధులు తెచ్చి పథకాలను నిర్వహిస్తున్నారన్నారు. దీని వల్ల భవిష్యత్ అంధకారం తప్పదు. గొల్లప్రోలు సభలో వలంటీర్లు, అంగన్వాడీలు బలవంతంగా కూర్చున్నారు. వారిని బలవంతంగా సభకు తరలించారు.

ప్రతి ఒక్కరికి టార్గెట్లు పెట్టి మరి జన సమీకరణ చేయడం సిగ్గుచేటు. కాపులను విమర్శిస్తుంటే వైసీపీ కాపు నాయకులు ఎందుకు స్పందించలేదు. వరద ప్రాంతాల్లో సీఎం జగన్ లంక గ్రామాల్లో పర్యటించలేదు. వరద ప్రాంతాల్లో కేవలం కొందరినీ ఎంపిక చేసి.. వారితో ముఖ్యమంత్రికి అంతా బాగుందని చెప్పించి ఈ ప్రభుత్వ అధికారులు చంకలు గుద్దుకుంటున్నారు. జనసేన పార్టీ వరద బాధితులకు అన్ని రకాలుగా సాయం చేసింది. బాధితులకు అవసరమైన నిత్యవసరాలతో పాటు బట్టలు, ఇతరత్రా అవసరాలు తీర్చాం. ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇస్తామన్న పాపానికి జనసేన నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.

అంత భయపడుతూ వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించడం దేనికి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ , జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నాం. వారికి ఏం కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందున్నాం. పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి సీఎం, నాయకులకు కనీస అర్హత లేదు. ఏలేరు కాలువ బాగుచేస్తానని గతంలో హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పళ్లంరాజు నిధులు మంజూరు చేశారు. దీనిని మళ్ళీ ముఖ్యమంత్రి ప్రకటించడం హాస్యాస్పదం.

కాపు నేస్తం లిస్టుల్లో ఉన్న గందరగోళం తొలగించి.. కాపుల సంక్షేమానికి ఎంత కేటాయించరో లెక్కలు చెప్పాలి” అన్నారు. సమావేశంలో కరెడ్ల గోవింద్, తాటికాయల వీరబాబు, శిరంగు శ్రీను, కొండబాబు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply