– రాష్ట్రస్థాయి ప్రక్షాళనకు కుప్పం నుంచే శ్రీకారం
– క్షేత్రస్థాయిలో పనిచేసే సమర్థులకే ఇకపై నాయకత్వ బాధ్యతలు
– కుప్పంలో పార్టీ పటిష్టతకు కో-ఆర్డినేషన్ కమిటీ
– కుప్పం మున్సిపాలిటీ సమీక్షలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు
రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో కోవర్టులను గుర్తించామని, రాబోయే ఆరునెలల్లో వారందరినీ ఏరివేసి కొత్తరక్తంతో పార్టీకి నూతన జవసత్వాలు తీసుకువస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కుప్పం మున్సిపల్ అభ్యర్థులు, పార్టీ నేతలతో బుధవారం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ పార్టీలో ప్రక్షాళన కార్యక్రమాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ పార్టీని సమర్థవంతంగా నడిపేంచేందుకు వీలుగా సమర్థులైన నేతలతో కోఆర్డినేషన్ కమిటీని నియమిస్తామని తెలిపారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 350 ఓట్ల తేడాతో ఏడువార్డుల్లో ఓడిపోయామని అన్నారు. కుప్పం మున్సిపాలిటీలోని 25వార్డుల్లో పోటీచేసిన అభ్యర్థులు ఎన్నికల్లో తాము ఎదుర్కొన్న అంతర్గత, బహిర్గత సమస్యలపై రహస్య నివేదికలు తయారుచేసి తమకు పంపినట్లయితే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తానని అన్నారు.
తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనివిధంగా ప్రత్యర్థులు నీచ రాజకీయాలకు దిగారని, ఈ పరిస్థితుల్లో దీటుగా ఎదుర్కొనే సమర్థ నాయకత్వం అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల అభ్యర్థులను చివరినిమిషంలో ఎంపికచేయడం కూడా కొంత నష్టం కలిగించిందని అన్నారు. అయితే తానుఇప్పటివరకు చేసిన సమీక్షల్లో నిత్యం ప్రజలవద్దకు వెళ్తూ క్షేత్రస్థాయిలో పనిచేస్తూ వచ్చినచోట్ల మంచి ఫలితాలు వచ్చాయని గుర్తించినట్లు చెప్పారు. ఒకచోట బేలుదారి మేస్త్రి, మరొక చోట లిఫ్ట్ ఆపరేటర్, ఇంకొక చోట పెయింటర్, బడ్డీకొట్టు చిరువ్యాపారి విజయం సాధించారని, ఇటువంటి వారి విజయాలు కేస్ స్టడీగా తీసుకొని ముందుకు సాగాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఇకపై పార్టీని సమర్థవంతగా ముందుకు నడిపించే వారికి మాత్రమే పట్టం కడతామని, రకరకాల మొహమాటాలు, లాలూచీ వ్యవహారాలతో ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యే వారికి స్థానం ఉండబోదని చెప్పారు. కొందరు క్షేత్రస్థాయిలో పనిచేయడం మాని…తమ వద్దకు ఏవేవో చెబుతూ తనను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇకపై అటువంటి వారి పప్పులేమీ ఉడకబోవని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల రోజు దొంగఓటర్లను అడ్డుకునేందుకు కుప్పంలో మహిళలు చూపిన చొరవ, పోరాట పటిమను చంద్రబాబునాయుడు కొనియాడారు.
రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటివరకు తమను ఒకవైపే చూశారని, అధికారంలోకి రాగానే రాజకీయ నేరగాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు. బాంబులకు, క్లేమోర్ మైన్లకు భయపడని తాను…ముఠానాయకులకు భయపడేది లేదని అన్నారు. కుప్పంలో స్థానిక నాయకుల అతి విశ్వాసంతోపాటు ప్రత్యర్థుల తప్పుడు ప్రచారం, దొంగఓట్లు, పోలీసులతో బలప్రయోగం, ప్రలోభాలు ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషించారు. అధికార పార్టీ అరాచకాలపై ఐకమత్యంగా పోరాడతామని చంద్రబాబునాయుడు పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు.
కుప్పంలో ఇల్లు నిర్మించుకొని కనీసం ప్రతి మూడునెలలకు ఒకసారి రావాల్సిందిగా ఎస్ ఆర్ బాలకుమార్ అనే స్థానిక నేత చేసిన విజ్జప్తిపై చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందిస్తూ…ఈ అంశాన్ని పరిశీలిస్తానని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, శాసనసభా పక్ష ఉపనాయకుడు నిమ్మల రామానాయుడు, మాజీమంత్రి పరసా రత్నం, హెచ్ ఆర్ డి విభాగం చైర్మన్ బి.రామాంజనేయులు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి మునిరత్నం, పట్టణ పార్టీ అధ్యక్షుడు రాజ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన త్రిలోక్ తదితరులు పాల్గొన్నారు.