– హెచ్డీ బర్లీ పొగాకును ఐటీసీ, జీపీఐ కలిసి 25 మిలియన్ కేజీల వరకు కొనుగోలు చేయాలి
– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి : కోకో, మామిడి, పొగాకు పంట ఉత్పత్తుల గిట్టుబాటు ధర, కొనుగోళ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
రైతు ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.హార్టికల్చర్, ఆక్వాకల్చర్, ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. అనుకున్న సమయంలో సాయం చేయడంతో పాటు, ఫీల్డ్‌కు వెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి… రైతుల్లో అసంతృప్తి తలెత్తకుండా చూడాలి.
రైతుల సమస్యేలను ముందుగానే అంచనా వేయాలి. కోకో పాలసీ తీసుకురావాలి… మంచి నాణ్యత ఉండేలా రైతుల్ని చైతన్య పరచాలి. ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా ఉండేలా చూడాలి. ఎఫ్‌పీవోలు ఎంఎస్ఎంఈలు నెలకొల్పేలా… ప్రాసెసింగ్ జరిగేలా ప్రోత్సహించాలి.
పొగాకు కొనుగోళ్లపై కీలక ఆదేశాలు :
రాష్ట్రంలో ఎఫ్‌సీవీ పొగాకు రకాన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనేది టొబాకో బోర్డు నిర్ణయించాలని చెప్పారు. వైట్ బర్లీ పొగాకు రకాన్ని ఒప్పందం మేరకే సాగు చేయించి కంపెనీలే కొనుగోలు చేయాలి. హెచ్డీ బర్లీ (బ్లాక్ బర్లీ) రకానికి ప్రత్యామ్నాయంగా ఆయా గ్రామాలలో రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు చర్చించి అపరాలు, చిరుధాన్యాలు పండించేలా ప్రోత్సహించాలి.
పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు… ఈ ఏడు మార్కెట్ యార్డులను పొగాకు కొనుగోళ్ల కోసం ఇప్పటికే సిద్ధం చేశారు. వెంటనే కొనుగోళ్లు మొదలు కానున్నాయి.
హెచ్డీ బర్లీ పొగాకును ఐటీసీ, జీపీఐ కలిసి 25 మిలియన్ కేజీల వరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హెచ్డీ బర్లీ పొగాకులో సెకెండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ రకాలు కొనేందుకు కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీలతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
మామిడి
43 వేల మెట్రిక్ టన్నుల మామిడి పల్ప్ నిల్వలు ప్రాసెసింగ్ కంపెనీల దగ్గర నిలిచిపోయాయి. పార్లే ఆగ్రో, కోకోకోలా, పెప్సీకో తదితర సంస్థల నుంచి మామిడి ప్రాసెసింగ్ కంపెనీలకు ఆర్డర్లు రాకపోవడం వల్ల సమస్య ఉత్పన్నమైంది. వ్యాపారులు కేజీ మామిడి రూ.12కి తక్షణం కొనుగోలు చేయాలి. వ్యాపారులు కనీసం రూ.8 చెల్లిస్తే… రాష్ట్ర ప్రభుత్వం కేజీకి రూ.4 రైతులకు నేరుగా చెల్లిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.
అయితే రైతులు, ట్రేడింగ్ కంపెనీలు, ప్రాసెసర్లు అందరినీ రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు. రైతులు, ట్రేడర్, ప్రాసెసర్…రికార్డ్ మెయింటైన్ చేయాలి…
కోకో
ఇప్పటికే రైతుల దగ్గర నుంచి 465 మెట్రిక్ టన్నులు కోకో కొనుగోలు చేయగా, ఇంకా 745 మెట్రిక్ టన్నుల కోకో ఉత్పత్తి రైతుల దగ్గర మిగిలివుంది. రైతులకు కనీసం కేజీకి రూ.500 గిట్టుబాటు అయ్యేలా చూడాలని నిర్ణయించారు. కంపెనీలు కేజీ రూ.450 చెల్లిస్తుండగా, అదనంగా మరో రూ.50 రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తున్నాం.
మిగిలిన సూచనలు
పంటలు, రెయిన్ ఫాల్, డిమాండ్, వాటర్ సేవింగ్ వంటి డేటాను దృష్టిలో పెట్టుకుని రైతులు ఏ పంటలు సాగుచేయాలో ముందుగానే చెప్పాలి. క్రాప్ మేనేజ్మెంట్ చేయాలి.. శాటిలైట్ వినియోగించాలి…. డిమాండ్ ప్రిడిక్షన్ చేయాలి, వ్యవసాయం లాభసాటి చేయాలని సీఎం చెప్పారు. అనుకోని పరిస్థితుల్లో ధర రాకుంటే ప్రభుత్వం ఆదుకునేలా ఉండాలి.
శుక్రవారం నుంచే పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లు ముమ్మరం చేయాలి. ప్రస్తుతం ఉన్న 116 రైతు బజార్లను 200కి పెంచాలి… మొబైల్ మార్కెట్లను కూడా ప్రవేశపెడతాం. ఆగ్రో ప్రాసెసింగ్ వృద్ధి చెందేలా చూడాలి. సంక్షోభ సమయంలోనే తెలివిగా కష్టపడాలి.
పీఎం కిసాన్ డేటాకు అనుగుణంగా అన్నదాత జాబితాను రూపొందించి పొరపాట్లు దొర్లకుండా చూడాలన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసా రైతులకు కలిగించాలి. సమస్య పరిష్కారం అయ్యేవరకు అధికారులు, మంత్రులు ప్రజల్లోకి వెళ్తూ ఉండాలి
ఈ క్రాప్ డేటా పకడ్బందీగా తయారు చేయాలి. ప్రభుత్వ సాయం దళారులకు, వ్యాపారులకు కాకుండా రాష్ట్ర రైతాంగానికి అందేలా చేయాలి. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా రైతులకు కనీస గిట్టుబాటు ఉండాలని సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శమిస్తోంది.
పొగాకు విషయంలో పొగాకు బోర్డు….బోర్డు తిప్పేసేలా వ్యవహరించకూడదు. రైతులను సరైన రీతిలో మార్గదర్శనం చెయ్యాలి. ధరలు లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపునకు రైతులను మళ్లించే బాధ్యత వ్యవసాయ శాఖదే.
రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ఎంపీలు.. సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి పామాయిల్ పై కేంద్రం తగ్గించిన దిగుమతి సుంకం రైతులకు ఏ విధంగా నష్ట పరుస్తుందో చెప్పి, ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఒప్పించాలి.