• నాడు ఆర్కే రోజా, ధనుంజయరెడ్డిల నిర్వాకంతో రెండు ప్రాణాలు పోయాయి
• కౌలుకు పొలం తీసుకుని.. దొంగ రిజిస్ట్రేషన్ తో అమ్మేశారు
– గ్రీవెన్స్ లో బాధితుల ఫిర్యాదు
మంగళగిరి: తనకు ఉన్న కాస్త పొలంలో వరి పంట వేసుకుని ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్తుంటే తన చిన్నకొడుకు, కోడలు అడ్డుకుని తనను రక్తం వచ్చేలా కొట్టి దవడ పళ్లు రాలగొట్టారని గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన ఆలపాటి భారతి నేతల ముందు లబోదిబోమంది. రాలిన దవడ పళ్లను నేతలకు చూపిస్తూ.. తన మీద జరిగిన దాడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకూకోడలికి బుద్ది చెప్పి తనకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతులు స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి వేడుకుంది. ఆమె నుండి అర్జీని స్వీకరించిన నేతలు ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు లు విచారించి తగిన న్యాయం జరిగేలా చూస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. స్థానిక పోలీసులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
• మాజీ మినిస్టర్ ఆర్కే రోజా, నాడు సీఎం పేసీలో ఉన్న ధనుంజయరెడ్డి తాలూక మనుషులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు.. తమపై దొంగలు గా ముద్ర వేసి తమ ఉద్యోగాలను అన్యాయంగా తొలగించారని, తప్పు చేసిన అధికారులను రక్షించేందుకు తమను బలిచేశారని.. తాము చిన్న ఉద్యోగులమని.. ఉద్యోగం పోయిన బాధలో పరిచర్ల రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నారని.. మనస్తాపంతో ఆరోగ్యం క్షిణించి కత్తిరాశెట్టి రావిబాబు మరణించారని.. విజయవాడ భవానీ హాయ్ ల్యాండ్ లో గతంలో పనిచేసిన ఉద్యోగులు గ్రీవెన్స్‌లో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
• అనంతపురం రూరల్ మండలం రాజీవ్ కాలనీకి చెందిన శ్రీ కాశినాయన సేవాసమితి సభ్యులు గ్రీవెన్స్ సెల్ లో నేతలకు విజ్ఞప్తి చేస్తూ.. ఆశ్రమం తరఫున నిత్యాన్నదానం చేయు స్థలాన్ని పలువురు ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని. వారినుండి స్థలాన్ని విడిపించి న్యాయం చేయాలని కె. నాగేంద్ర విజ్ఞప్తి చేశారు.
• కడప జిల్లా బద్వేల్ మునిసిపాలిటీ సుమిత్రా నగర్ కు చెందిన షేక్ అబ్దుల్ విజ్ఞప్తి చేస్తూ.. తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తమ వద్ద రూ.7,50,000 లు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా షేక్ జినత్ అమన్ అనే వ్యక్తి తమను మోసం చేశాడని.. అతనిపై చర్యలు తీసుకుని తమ డబ్బులు ఇప్పించాలని విన్నవించుకొన్నాడు.
• మచిలీపట్నంకు చెందిన యక్కల లక్ష్మీకుమారి విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమిని పాపాని వీరరాఘవయ్య, ఆయన కుమారులకు కౌలుకు ఇస్తే కౌలుకు తీసుకున్న వ్యక్తులు తమకు తెలియకుండా పొలాన్ని అమ్మేశారని.. దొంగ రిజిస్ట్రేషన్ లు చేయించి డబ్బులు తీసుకున్నారని.. వారిపై చర్యలు తీసుకొని తమ భూమిని తమకు ఇప్పించాలని వేడుకున్నారు.
• ఏలూరు జల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామ రైతులు విజ్ఞప్తి చేస్తూ.. వాగుపొలాన్ని బొడ్డు పులయ్య అనే వ్యక్తి ఆక్రమించుకుని పాసు పుస్తకాలు తెచ్చుకుని.. రైతులకు దారిలేకుండా ఇబ్బంది పెడుతున్నారని.. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. దయచేసి తమ సమస్యను పరిష్కరించాలని పలువురు రైతులు గ్రీవెన్స్ లో నేతలకు విన్నవించుకొన్నారు.
• ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం గ్రామానికి చెందన మందలపు రామాంజనేయులు విజ్ఞప్తి చేస్తూ.. తాము గత టీడీపీ ప్రభుత్వంలో గ్రామ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల డబ్బులు ఇప్పటికీ రాలేదని.. దయచేసి తమకు రావాల్సిన బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.