– ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
పోషకాహార లోపం, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలన క్రమంలో ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా ఆహార భద్రతకు పెద్దపీట వేస్తూ వ్యవసాయ విద్య ఆధునికతను సంతరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
వ్యవసాయ రంగం అభివృద్ధికి యువతను ఈ రంగంలో ప్రోత్సహించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ వృత్తిలో వారు నిలదొక్కుకోవటానికి మంచి శిక్షణ అవసరమని సూచించారు. భారత ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు.
ఆచార్య ఎన్.జి వ్యవసాయ విశ్వవిద్యాలయం 51వ స్నాతకోత్సవం శుక్రవారం తిరుపతి వేదికగా నిర్వహించారు. విజయవాడ రాజ్ భవన్ నుండి కులపతి హోదాలో హైబ్రీడ్ విధానంలో గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఐఎఎస్ అధికారిగా ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో పనిచేసి ప్రస్తుతం భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని నేషనల్ రెయిన్-ఫెడ్ ఏరియా అథారిటీ సిఇఓ డాక్టర్ అశోక్ దల్వాయ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కావటం విధ్యార్ధులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.
గవర్నర్ మాట్లాడుతూ ప్రథమ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీని “వ్యవసాయ విద్యా దినోత్సవం”గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. గ్రామీణ ప్రజలకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంపొందించడం వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క విధులలో ఒకటిగా ఉండాలన్నారు.
పాఠశాల చదువులను ముగించుకున్న వారికి వ్యవసాయం, అనుబంధ శాస్త్రాలలో శిక్షణ ఇవ్వడం, వ్యవసాయ పాలిటెక్నిక్, సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్, సేంద్రీయ వ్యవసాయంలో డిప్లొమాలు అందించడం కోసం విశ్వవిద్యాలయం చొరవ తీసుకోవటం అభినందనీయమన్నారు. వ్యవసాయ రంగంలో పుష్కలంగా ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు.
విద్యార్ధులు స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించాలని, రైతు సంఘం పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల ఉన్న బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలని సూచించారు. ఆహార భద్రతపై పెరుగుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా, సాంకేతికత స్వీకరణ వేగవంత కావాలన్నారు. భారతీయ వ్యవసాయం డిజిటల్ సాంకేతికతలను అవలంబించాల్సిన అవసరం ఉందన్న గవర్నర్ స్మార్ట్ టెక్నాలజీతో రైతులకు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చే అవకాశం ఉందన్నారు.
యువత శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, ధ్యానం సాధన చేయాలని, జీవితాంతం నేర్చుకునే అలవాటును పెంపొందించుకుంటే విజయం సుసాధ్యమని గౌరవ బిశ్వభూషణ్ అన్నారు. రైతులు, వ్యవసాయ మహిళలు, గ్రామీణ యువత, ఇతర భాగస్వాములకు దూరవిద్య ద్వారా వ్యవసాయ విద్యను విస్తరించాలనే నినాదంతో “ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్” ను ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు.
డ్రోన్ టెక్నాలజీ, జియో-స్పేషియల్ టెక్నాలజీ, నానో-టెక్నాలజీ వంటి వ్యవసాయ సాంకేతికతలను ఉపయోగించడంలో విశ్వవిద్యాలయం మంచి పురోగతిని కనబరిచిందని, సుస్థిర వ్యవసాయాన్ని సమర్ధించడంలో జరుగుతున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. స్నాతకోత్సవంలో విజయవాడ నుండి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, తిరుపతి నుండి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.