– ఇప్పుడు కులగణన పేరుతో మరోసారి విభజించే కుట్ర
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ
విజయవాడ: దేశ అభివృద్ధికి, సాంస్కృతిక పురోగతికి పాటు పడే సంస్థ ఆర్ఎస్ఎస్, అటువంటి సంస్థ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి నీచమైన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశం అంగీకరించదు.
మోహన్ భగవత్ రామాలయ నిర్మాణం అనంతరం జరుగుతున్న భారత దేశ సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి మాత్రమే వ్యాఖ్యానించారు, స్వాతంత్య్ర సమరాన్ని ఎక్కడా అవమానించలేదు పైగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దేశం కోసం పోరాడారు, ఆఖరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటారు.
శ్రీ రాముడి అస్తిత్వం గురించి ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టుకు తెలిపి, అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని అంగీకరించలేక, ప్రాణ ప్రతిష్ఠను తిరస్కరించి దేశ సంస్కృతిని అవమానించిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారు.
భారతదేశాన్ని మతం ఆధారంగా ముక్కలు చేసింది కాంగ్రెస్, ఇప్పుడు కుల గణన పేరుతో దేశాన్ని మరోసారి విభజించే కుట్ర రాహుల్ గాంధీ చేస్తున్నాడు, హిందులను విభజించే ఇంతటి నీచ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారు, కాంగ్రెస్ కార్యాలయాలకు పరిమితమయ్యేలా చేస్తారు.
అయినా స్వాతంత్య్రం, స్వాతంత్య్ర సమరయోధులను గురించి మాట్లాడే హక్కు, అర్హత రెండు రాహుల్ గాంధీకి లేవు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, బాబా సాహెబ్ అంబేడ్కర్ వంటి మహోన్నతమైన వ్యక్తులకు గౌరవాన్ని కల్పించలేదు సరికదా వారిని అవమానించి, వారి మరణానంతరం వారి కుటుంబాలను కూడా వెంటాడి, వేధించింది కాంగ్రెస్ పార్టీ, నేడు బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆయనను రెండు సార్లు ఎన్నికల్లో ఓడించేందుకు సర్వశక్తులను ఒడ్డింది.
దేశ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన పి.వి.నరసింహ రావు గారి పార్థివ దేహాన్ని కాంగ్రెస్ కార్యాలయంలోకి కూడా అనుమతించకుండా అవమానించింది సోనియా గాంధీ, 20 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆయన చిత్రపటం కాంగ్రెస్ పార్టీలో లేదు, ఎందుకని? మీ దేశ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించినందుకా?
జాతిపిత గాంధీని అవమానించేలా కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ కార్యాలయాన్ని “గాంధీ భవన్” కాకుండా “ఇందిరా భవన్” అని పిలవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? దేశ ప్రజల హక్కులను చిదిమేసేందుకు ఆవిడ విధించిన ఎమర్జెన్సీని మరోసారి అమలు చేయాలనుకుంటున్నారా?
మీ కుటుంబానికి కొన్ని దశాబ్దాల పాటు అధికారాన్ని ఇచ్చిన భారత దేశంపై, దేశం కోసం కార్యనిర్వహణ చేస్తున్న వ్యవస్థలపై పోరాటం చేస్తామంటూ రాహుల్ గాంధీ చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని బహిర్గతం చేశారు. దేశ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. సరైన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంది.