– డీజీపీ ద్వారక తిరుమలరావు
ఒంగోలు: తిరుపతి శ్రీ సిటీ నుండి విజయవాడకు వెళ్తూ మార్గమధ్యలోని ఒంగోలు పోలీస్ కార్యాలయాన్ని డీజీపీ ద్వారక తిరుమలరావు తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్(ప్రస్తుతం ఆయన ఒంగోలులోని పోలీసు శిక్షణ కేంద్రం (పీటీసీ) ప్రధానాచార్యుడు) డీజీపీని ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన హంగులతో అన్ని సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్ ను డీజీపీ పరిశీలించారు.
ఈ సందర్భంగా డీజీపీతో జిల్లా ఎస్పీ జిల్లాలోని భౌగోళిక స్దితిగతులు,శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, పోలీస్ సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలు, జిల్లాకు సంబంధించిన పలు అంశాల గురించి వివరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకోవలసిన పూర్తి చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అలాగే చెడునడత కలిగిన వారిలో మార్పు తెచ్చేందుకు విజయవంతంగా సత్ప్రవర్తన కార్యక్రమాన్ని కొనసాగించడంపై డీజీపీ ప్రత్యేకంగా జిల్లా ఎస్పీని, పోలీసు అధికారులను అభినందించారు.
జిల్లాలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రకాశం పోలీస్ సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం, అలాగే కళాశాలలను ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు సందర్శించి విద్యార్థులలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడం, జిల్లాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నందుకు జిల్లా పోలీసులను ప్రశంసించారు.
జిల్లాల్లో శాంతిభద్రతలను పరిరక్షించటంలో ప్రతి పోలీస్ అధికారి కృషి చేయాలని, ప్రజలకు పోలీసు సేవలను అందించడంలో పారదర్శకతతో పనిచేస్తూ, ప్రతి ఒక్కరూ జవాబుదారీ తనంతో వారి వారి విధులను నిర్వర్తించాలని సూచించారు. జిల్లాలోని సిబ్బంది అందరూ క్రమశిక్షణతో మెలుగుతూ, పోలీస్ శాఖ గౌరవం పెంపొందించేలా సరైన నడవడికతో ఉత్తమ సేవలను అందించాలని డీజీపీ ఎస్పీకి సూచించారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా దామోదర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లాలో పట్టు సాధించడంపై, అలాగే పోక్సో యాక్ట్ కేసులకు సంబంధించి ఎస్పీ సత్వరమే చర్యలు తీసుకోవడంపై డీజీపీ అభినందించారు.