గుడివాడలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుండి బిళ్ళపాడు వరకు ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నాం

– భావితరాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డిజైన్ లో మార్పులు చేస్తున్నాం
– కేంద్రం ఆమోదించిన వెంటనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)
గుడివాడ, నవంబర్ 8: గుడివాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుండి గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడు వరకు ఫ్లైఓవర్ ను నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం గుడివాడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి మంత్రి కొడాలి నాని విలేకరులతో మాట్లాడారు. గుడివాడ ఆర్టిసి బస్టాండ్ దగ్గర నుండి ఫ్లైఓవర్ నిర్మాణం గుడివాడ- భీమవరం, గుడివాడ- మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల మీదుగా గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడు వరకు జరుగుతుందన్నారు. మార్గమధ్యంలో గుడివాడ పట్టణంలోని బైపాస్ రోడ్, మచిలీపట్నం వైపు వెళ్లే రోడ్డు, ఆటోనగర్ రోడ్డు ఉన్నాయన్నారు. మూడు వైపుల నుండి వచ్చే వాహనాలను కలుపుతూ ఫ్లైఓవర్ డిజైన్ లో కొన్ని మార్పులు, చేర్పులు కోరామన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారన్నారు. ఇప్పుడున్న డిజైన్ ఆమోదిస్తే బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమవుతుందని, అయితే భావితరాలు ఇబ్బందులు పడకూడదని చెప్పారు. మచిలీపట్నం వైపు నుండి, బైపాస్ రోడ్డు నుండి, ఆటోనగర్ వైపునుండి వచ్చే వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్లై ఓవర్ కు కలపాల్సి ఉంటుందన్నారు. గుడివాడ- కంకిపాడు ప్రధాన రహదారిని నేషనల్ హైవే పరిధిలోకి తీసుకోవాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రతిపాదన చేశారని చెప్పారు.
ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే రూ. 400 కోట్లతో రోడ్డు, దానికి ఇరువైపులా రిక్రూట్మెంట్ వాల్స్ నిర్మాణం జరుగుతాయన్నారు. నిడుమోలు నుండి ముదినేపల్లి వెళ్లే రోడ్డు కూడా నేషనల్ హైవే పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఎంపీ బాలశౌరి కృషి చేస్తున్నారని చెప్పారు. ఎంపీ బాలశౌరి శక్తివంచన లేకుండా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను మంజూరు చేయిస్తున్నారని తెలిపారు. గుడివాడ రూరల్, నందివాడ మండలాల్లో చేపల చెరువుల వల్ల నీరు కలుషితమై తాగునీటి సమస్య ఎదురైందని చెప్పారు. రూ. 270 కోట్ల నాబార్డ్ నిధులతో మల్టీ విలేజ్ స్కీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న ఎంపీ బాలశౌరికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుండి ఎంపీ బాలశౌరికి అత్యధిక మెజార్టీనివ్వాలని మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవి నారాయణరెడ్డి, నాయకులు మట్టా జాన్ విక్టర్, పెయ్యల ఆదాం, కందుల దుర్గా కుమారి, మేకల సత్యనారాయణ, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి, ఎస్కే బాజీ, కంచర్ల జగన్, తోట రాజేష్, గంటా చంద్రశేఖర్, దారం నరసింహ, కందుల నాగరాజు, అంగడాల వేణు, రహమతుల్లా, సయ్యద్ గఫార్, మూడెడ్ల ఉమా, మెండా చంద్రపాల్, అబ్బూరి భాస్కరరావు, గోళ్ళ రామకృష్ణ, మాదాసు వెంకట లక్ష్మి కుమారి, కొర్నిపాటి గణపతి, సత్య దుర్గాప్రసాద్, రేమల్లి పసి, అగస్త్య రాజు కృష్ణమోహన్, అల్లం సూర్యప్రభ, అల్లం రామ్మోహన్, రంగా, వెంపటి సైమన్, మామిళ్ళ ఎలీషా, గుదే లక్ష్మి రంగనాయకమ్మ, గణపతి సూర్జ్యం, బచ్చు మణి కంఠ, కొత్తూరి లక్ష్మీనారాయణ, వీరిశెట్టి వెంకట నరసింహారావు, కనుమూరి రామిరెడ్డి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, కొలుసు నరేంద్ర, గుమ్మడి నాగేంద్ర, గుడివాడ ఆర్డిఓ జి శ్రీను కుమార్ తదితరులు పాల్గొన్నారు.