Suryaa.co.in

Telangana

నిర్దేశిత స‌మ‌యంలో నిర్మాణాలు పూర్తి చేయాలి

* స్థ‌ల సేక‌ర‌ణ‌.. అనుమ‌తులపై సీనియ‌ర్ అధికారులు దృష్టి సారించాలి
* క‌లెక్ట‌ర్లు క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌లు చేప‌ట్టాలి
* యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌పై సమీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల నిర్మాణాన్ని నిర్దేశిత స‌మ‌యంలో పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఐసీసీసీలో విద్యా శాఖ అధికారుల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల నిర్మాణాల‌పై ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ప్ర‌శ్నించారు. కొడంగ‌ల్‌, మ‌ధిర‌, హుజూర్ న‌గ‌ర్ ల్లోని స్కూళ్ల నిర్మాణానికి టెండ‌ర్లు పూర్త‌య్యాయ‌ని, మార్చి 20వ తేదీన ప‌నులు ప్రారంభిస్తామ‌ని అధికారులు తెలిపారు. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో భూ సేక‌ర‌ణ‌, అనుమ‌తుల ప్ర‌క్రియ‌ను ఉమ్మ‌డి జిల్లాల‌కు కేటాయించిన సీనియ‌ర్ అధికారులు చూడాల‌ని సీఎం ఆదేశించారు.

నియోజ‌క‌వ‌ర్గాల్లోని అన్ని ప్రాంతాల‌కు రాక‌పోక‌లు అనువుగా ఉండే ప్ర‌దేశాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ఎంచుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విష‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్లు క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న చేసి స్థ‌లాల ఎంపిక‌లో జాగ్ర‌త్త వ‌హించాల‌ని సీఎం అన్నారు.

భూ సేక‌ర‌ణ‌, స్థ‌లాల ఎంపిక ప్ర‌తి రెండు రోజుల‌కోక‌సారి స‌మీక్షించాల‌ని, ప‌ది రోజుల్లోపే దీనిపై నివేదిక ఇవ్వాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్త‌యిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

* నిర్మాణాలు యూనివ‌ర్సిటీ స్థాయిలో ఉండాలి

వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మహిళా విశ్వవిద్యాలయంలో బోధ‌న‌, బోధ‌నేత‌ర అవ‌స‌రాల కోసం చేప‌ట్టే నిర్మాణాలు యూనివ‌ర్సిటీల స్థాయిలోనే ఉండాల‌ని… ఈ విష‌యంలో ఏమాత్రం రాజీప‌డొద్ద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని గ‌దులు, ల్యాబ్‌లు, ప్లేగ్రౌండ్‌, ఇత‌ర నిర్మాణాలు చేప‌ట్టాల‌ని సీఎం అన్నారు. యూనివ‌ర్సిటీ నిర్మాణాల‌కు సంబంధించి నిధుల వ్య‌యానికి ప్ర‌భుత్వం వెనుకాడ‌దని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

యూనివ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోని చారిత్ర‌క‌, పురాత‌న క‌ట్ట‌డాల‌ను ప‌రిర‌క్షించాల‌ని, వాటికి అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తుల విష‌యంలో పురావ‌స్తు శాఖ అధికారుల‌తో చ‌ర్చించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. నిర్మాణ ఆకృతుల‌కు సంబంధించి ప‌లు మార్పుల‌ను ముఖ్య‌మంత్రి సూచించారు.

స‌మీక్ష‌లో రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస‌రాజు, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్‌రాజ్‌, విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, ఎంఆర్డీసీఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ పి.గౌత‌మి, పాఠ‌శాల విద్యా శాఖ క‌మిష‌న‌ర్ న‌ర‌సింహారెడ్డి, వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా విశ్వ విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్ సూర్య ధ‌నంజ‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE