రష్యా నరమేధం.. బుచా వీధుల వెంట చెల్లాచెదురుగా శవాలు

140

యుద్ధ నేరానికి దిగిన రష్యా.. నర మేధానికి పాల్పడింది!. కాళ్లు చేతులు కట్టేసి.. తలలో బుల్లెట్లు దింపిన పౌరుల ఫొటోలు, వీడియోలు ఉక్రెయిన్‌లో జరిగిన మారణహోమం తాలుకా పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. రాజధాని కీవ్‌కు ఇంతకాలం అడ్డుగోడగా నిలిచిన బుచా పట్టణంలో.. శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. మరోవైపు మహిళలపై నడిరోడ్డుపైనే అఘాయిత్యాలు జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఈ తరుణంలో ఉక్రెయిన్‌, అమెరికాలు రష్యాపై తీవ్రస్థాయిలో ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. కీవ్‌కు ఈశాన్యంగా 37 కిలోమీటర్ల దూరంలో ఉంది బుచా పట్టణం. నెలరోజుల పాటు జరిగిన రష్యా దురాక్రమణలో సుమారు 300 మంది పౌరులు మరణించినట్లు బుచా మేయర్‌ ఫెడోరుక్‌ ఇదివరకే ప్రకటించారు.

ఈ తరుణంలో.. రష్యా బలగాలు తిరుగుముఖం పట్టిన టైంలో మరో 400 మందికి పైగా పొట్టనపెట్టుకుందని చెప్పారాయన. వీధుల వెంట బుల్లెట్‌ గాయాలతో, కాళ్లు చేతులు కట్టేసి ఉన్న శవాలే దర్శనమిస్తున్నాయి ఎటు చూసినా. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేషీలోని ఒలెక్‌సీ అరెస్టోవీచ్‌ బుచా ఊచకోతకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు.