– ఇదే బీజేపీ సిద్ధాంతం
-ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతోనే ‘‘మైక్రో డొనేషన్స్’’
– అవినీతి, బ్లాక్ మెయిల్ సొమ్ముతో నిధులు సేకరించాలనే తత్వం బీజేపీది కాదు
– ‘మైక్రో డొనేషన్స్’’ సేకరణలోనూ తెలంగాణ నెంబర్ వన్ గా నిలవాలి
-పార్టీ కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు..
‘‘ దేశం ఫస్ట్…. పార్టీ నెక్స్ట్… పార్టీ లాస్ట్….’’ ఇదే బీజేపీ సిద్ధాంతమని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాకే ప్రతి ఒక్కరూ తాను ఇండియన్ అని, హిందువునని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారని చెప్పారు. అనేక సవాళ్లను స్వీకరించి అధిగమించడమే బీజేపీ కార్యకర్తల నైజమని అన్నారు. రామ మందిర నిర్మాణంలో విరాళాల సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని… అదే స్పూర్తితో ‘‘సూక్ష్మ విరాళాల సేకరణ’’లోనూ అగ్రభాగాన నిలవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బీజేపీ నాయకులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్‘‘మైక్రో డొనేషన్స్’’పై వర్చువల్ సమావేశం నిర్వహించారు. మైక్రో డొనేషన్స్ జాతీయ ఇంఛార్జీ సునీల్ దేవధర్, దక్షిణాది విభాగం ఇంఛార్జ్ నిర్మల్ సురానా, రాష్ట్ర ఇంఛార్జీ చింతల రామచంద్రారెడ్డి, సహ ఇంఛార్జ్ లు భండారు శాంతి కుమార్, పాపారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్రో డోనేషన్స్ ఆవశ్యకత, ఉద్దేశాలను వివరిస్తూ బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…
• కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ విరాళాలు అడగడం ఏంటనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీల మాదిరిగా బ్లాక్ మెయిల్ చేసి, అవినీతికి పాల్పడి పార్టీకి నిధులు సమీకరించాల్సిన అవసరం బీజేపీకి లేదు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలన్నదే బీజేపీ లక్ష్యం. ఇది నా పార్టీ. పార్టీ బలోపేతంలో నా భాగస్వామ్యం ఉంది అనే భావన కలిగించేందుకే ఈ ‘‘మైక్రో డొనేషన్స్’’ కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే ‘‘దేశం ఫస్ట్… పార్టీ నెక్స్ట్… ఫ్యామిలీ లాస్ట్..’’ అనే సిద్ధాంతం బీజేపీ కార్యకర్తలది.
• కేంద్రం తలుచుకుంటే ఎన్ని నిధులైనా కేటాయించి రామ మందిరం నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. అయితే ‘‘ఈ రామ మందిరం నాది… ఇందులో నా భాగస్వామ్యం ఉంది’’ అనే భావనను ప్రతి హిందువులో కలిగించేందుకే అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి విరాళాలు సేకరించారు.. ఈ విషయంలో అత్యధిక విరాళాలు సేకరించడం ద్వారా తెలంగాణను అగ్రభాగాన నిలపడంతోపాటు హిందుత్వ శక్తికి నిలువెత్తు నిదర్శనంగా రాష్ట్రం నిలిచింది.
• మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 25న ఈ కార్యక్రమాన్ని జేపీ నడ్డా ఢిల్లీలో ప్రాంభించారు. విరాళాల సేకరణకు మరో 5 రోజులు మాత్రమే గడువుంది. ఈ విషయంలోనూ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలవాలని కోరుతున్నా. పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్త పార్టీ కోసం చిన్న మొత్తాన్ని విరాళం ఇవ్వాలి. వారి వారి శక్తిని బట్టి 5..రూపాయలు..10, 50, 100 వేయి వరకు పార్టీ కి విరాళం ఇవ్వొచ్చు.
• నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాకే విదేశాల్లో ఉండేవారు సైతం నేను ఇండియన్ ను… నేను హిందువును అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకుంటున్నారు. చినజీయర్ స్వామి వంటి పెద్దలు మోదీ గొప్పతనాన్ని వివరించిన సంగతి మీకు తెలుసు. ఈ దేశంలో పార్టీ కోసం నిరంతరం నిస్వార్దంగా కృషి చేసే కార్యకర్తలు బీజేపీకి మాత్రమే ఉన్నారు. వారి శ్రమ వల్లనే ఈరోజు ప్రపంచంలో నే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.
• ఎన్ని అవమానాలకు గురైనప్పటికీ కార్యకర్తల కఠోర దీక్ష, క్రుషి వల్లే బీజేపీ దేశంలో, 18 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. రెండు సార్లు వరుసగా నరేంద్ర మోడీ సంపూర్ణ మెజారిటీతో ప్రధాన మంత్రి పదవి చేపట్టారు. తెలంగాణలో మేము ఎంపీలుగా గెలిచామంటే.. అది కార్యకర్తలు చేపట్టిన క్రుషి వల్లే సాధ్యమైంది.
• మైక్రో డొనేషన్స్ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ మాట్లాడుతూ….. ప్రతి అంశంలోనూ అత్యంత పారదర్శకత పాటించాలన్నదే నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ విధానం. అందులో భాగంగానే ‘మైక్రో డొనేషన్స్’ కార్యక్రమాన్ని పార్టీ చేపట్టినం. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ తెలంగాణ శాఖ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తోంది. ఇదే స్పూర్తిని కొనసాగిస్తే… రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరేసే అవకాశం ఉంది. ‘మైక్రో డొనేషన్స్’ సేకరణ ద్వారా డబ్బులు ఎంత వచ్చాయన్నది ముఖ్యం కానేకాదు… కార్యకర్తల భాగస్వామ్యం మనకు అత్యంత ప్రధానం. ఈ కార్యక్రమం తెలంగాణలో బాగా జరుగుతోంది. మరింత బాగా కొనసాగాలి. బీజేపీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లోనూ తెలంగాణ కార్యకర్తలు ముందుంటున్నారు. మైక్రో డొనేషన్స్ కార్యక్రమంలోనూ తెలంగాణ కార్యకర్తలు అగ్ర భాగాన నిలవాలి.