‘విడదల’కు మంత్రి పదవిపై వైసీపీలో దడ దడ!

– సోషల్‌మీడియాలో సొంత పార్టీ నేతలే విమర్శలు
– మర్రికి చేయిచ్చిన వైనంపై సీనియర్ల అసంతృప్తి
– అంబటి, ఆళ్ల, పిన్నెల్లి, జంగా, గోపిరెడ్డి ఆశలు
– రజనీకి పదవి ఇస్తే పార్టీలో ఉండలేమంటున్న సీనియర్లు
– అందరి చూపు చిలకలూరిపేట వైపే
( మార్తి సుబ్రహ్మణ్యం)

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి క్యాబినెట్‌లో స్థానం ఖాయమంటూ జరుగుతున్న ప్రచారం, అధికార వైసీపీలో అసమ్మతికి దారితీస్తోంది. నాలుగుసార్లు, రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలను విస్మరించి కొత్తగా ఎన్నికైన రజనీకి మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ సొంత పార్టీ శ్రేణులే సోషల్‌మీడియాలో విమర్శలకు దిగుతుండటం నాయకత్వానికి తలనొప్పిలా పరిణమించింది. ప్రధానంగా సీఎం జగన్.. సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇస్తానంటూ బహిరంగ సభలో చేసిన ప్రసంగం వీడియో, ఇప్పుడు వైరల్ అవుతోంది. మరోవైపు ఆమెకు మంత్రి పదవి ఇస్తే తాము పార్టీలో కొనసాగలేమని జిల్లాకు చెందిన నేతలు తెగేసి చెబుతున్నారు. జూనియర్ అయిన ఆమెకు మంత్రి పదవి ఇవ్వడమంటే, తమను అవమానించినట్టేనని స్పష్టం చేస్తున్నారు.

నర్సరావుపేట జిల్లా వైసీపీలో విడదల ముసలం పార్టీ నాయకత్వానికి శిరోభారంగా పరిణమించింది. చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీకి, మంత్రి పదవి ఖాయమయిందన్న ప్రచారమే దానికి కారణంగా కనిపిస్తోంది. నిజానికి సీఎం జగన్‌కు సన్నిహితుడైన ఒక ప్రభుత్వ సలహాదారు సిఫార్సుతో, ఆమెకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం చాలాకాలం నుంచి జరుగుతోంది. ఈ విస్తరణ సమయంలో అది నిజమేనన్న భావన పెరగడం ప్రస్తావనార్హం.

నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల
Ycp mlaరామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా, బీసీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని విస్మరించి తొలసారి ఎమ్మెల్యే అయిన రజనీకి మంత్రి పదవి ఇస్తున్నారన్న ప్రచారంపై, వైసీపీ సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనితో ఇప్పటికే నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలును.. చిలకలూరిపేట నియోకవర్గంలో పర్యటించకుండా బహిష్కరించిన రజనీ వర్గీయులకు, తాజా పరిణామాలు ఇరకాటంగా పరిణమించాయి. ఎంపీ కృష్ణదేవరాయలు-ఎమ్మెల్యే రజనీ మధ్య చాలాకాలం పొసగడం లేదన్నది బహిరంగమే.

కాగా పార్టీ సమస్యల్లో పడినప్పుడల్లా తెరపైకి వచ్చి, తన వాదనతో విపక్షాల నోళ్లు మూయించే కాపు వర్గ నేత అంబటి రాంబాబుకు, గతంలోనే అన్యాయం జరిగిందన్న భావన పార్టీవర్గాల్లో ఉంది. పార్టీకి రక్షణ కవచంలా ఉన్న రాంబాబుకు ఈసారి పదవి ఇవ్వకపోతే, ఆయనకు అన్యాయం చేసినట్టేనని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

ప్రధానంగా తన కాపు వర్గం నుంచి అనేక విమర్శలు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న్పటికీ ఆయన జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. పవన్‌పై విమర్శలు కురిపించడం కాపు వర్గానికి రుచించడం లేదు. అయినా పార్టీ ప్రయోజనాల కోసం రాంబాబు, జనసేనాధిపతిపై ఎదురుదాడి కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వ్రతం చెడిన రాంబాబుకు, కనీసం ఫలితం ఉంటుందా అని చర్చ జరుగుతున్న సమయంలో.. రజనీ పేరు వినిపించడం అటు కాపుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది.

మరోవైపు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీ హయాంలో కూడా ఎదురొడ్డి నిలిచిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు కూడా వినిపించకపోవడంపై అటు రెడ్డి వర్గం కూడా అసంతృప్తితో ఉంది. టీడీపీ యువనేత లోకేష్‌ను ఓడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి, ఈసారి కూడా చేయిస్తారన్న ప్రచారం రెడ్డి వర్గంలో అసంతృప్తికి కారణమవుతోంది. దళిత వర్గం నుంచి మేరుగ నాగార్జున కు స్థానం లభిస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

అయితే ప్రధానంగా.. రజనీకి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారంపై, సొంత చిలకలూరిపేట marri-rajasekharనియోజకవర్గంలోనే అసంతృప్తి వ్యక్తమవుతుండటం విశేషం. గత ఎన్నికల్లో ఆమె విజయానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రిని చేస్తానని జగన్ స్వయంగా ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకూ ఆయనకు కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోగా, నియోజవకవర్గంలో మర్రి వర్గీయులను రజనీ అణచివేయడం, ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవంపై మరి వర్గీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మర్రికి మంత్రి పదవిఇస్తానన్న జగన్ హామీ వీడియో, ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అయి పార్టీ నాయకత్వానికి ఇరకాటంగా మారింది.

నిజానికి టీడీపీ హయాంలో పార్టీ మారిన 23 మందిలో గుంటూరు జిల్లా నుంచి ఒక్కరూ ఉండకపోవడానికి, జిల్లా అధ్యక్షుడిగా మర్రి చేసిన కృషి ఫలితమేనని సీనియర్లు ఇప్పటికీ చెబుతుంటారు. అలాంటి మర్రిని స్థానికంగా రజనీ అవమానిస్తున్నా, ఎంపీ కృష్ణదేవరాయలు తప్ప ఎవరూ దన్నుగా లేకపోవడంపై ఆయన వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే ఒక ప్రభుత్వ సలహాదారు ఆమెకు అండగా ఉన్నారన్న ప్రచారం జరుగుతుండటంతో, పెదవి విప్పే ధైర్యం చే యలేకపోతున్నారు.

చిలకలూరిపేట నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో ఆమె కుటుంబమే రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటంతో, మిగిలినవారికి అవకాశం లేకుండా పోయిందని వైసీపీ రియల్టర్లు చాలాకాలం నుంచీ అసంతృప్తితో ఉన్నారు. ప్రచారం తప్ప, పనులు చేయని ఆమెకు సలహాదారు, ప్రధాన అనుచరుడిగా ఉన్న ఒక నేత చిలకలూరిపేట పట్టణంలో పేకాట క్లబ్బు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుపడిన మీడియా క్లిప్పుంగులు.. అదేవిధంగా చిలకలూరిపేటలో తెలంగాణ మధ్యం, గుట్కా, పేకాట వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయంటూ గతంలో మీడియాలో వచ్చిన క్లిప్పింగులు.. మూడేళ్లలో నలుగురు సీఐలు మారిన వైనం… ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయంటే.. రజనీకి మంత్రి పదవి ఇవ్వడంపై సొంత నియోజకవర్గంలోనే ఏస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోందో స్పష్టమవుతోంది.

ఇదిలా ఉండగా రజనీకి మంత్రి పదవి ఇస్తే తాము పార్టీలో కొనసాగలేమని, కొందరు ఎమ్మెల్యేలు ఒక ప్రముఖుడి వద్ద స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా సీఎం జగన్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, వారంతా ఆ ప్రముఖుడి వద్దకు వెళ్లి తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకేసారి గెలిచిన రజనీకి మంత్రి పదవి ఇవ్వడమంటే తమను అవమానించడమేనని వారు సదరు ప్రముఖుడి వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Leave a Reply