అధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని మలుపు తిప్పిన డార్వినిజం

0
90

చార్లెస్ రాబర్ట్ డార్విన్ (ఫిబ్రవరి 12, 1809 – ఏప్రిల్ 19, 1882) ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది,ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రం చెందాయి అనే విషయంపై పరిశోధనలు చేశాడు. మరియు జీవపరిణామ సిద్ధాంతాన్ని వర్ణించాడు.

తండ్రి దృష్టిలో పనికిరాని వాడు.. బాల్యం ఉపాధ్యాయుల మాటల్లో మందబుద్ధివాడు..
ఇలా విమర్శల మధ్య ఎదిగిన ఓ కుర్రాడు.. అసలు మనిషి ఎలా పుట్టాడో చెప్పగలిగాడు! అతడే డార్విన్‌!
ఇంగ్లండులో ఒక డాక్టర్‌ తన స్నేహితులతో కొడుకు గురించి చెబుతూ బాధపడేవారు.. ‘వాడొక పనికిమాలిన వాడు. మా కుటుంబానికి తీరని మచ్చ’ అని. దానికి కారణం ఆ బాలుడు ఎప్పుడూ బొద్దింకలు, గొంగళి పురుగులు, సీతాకోక చిలుకల్లాంటి జీవుల్ని జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి తెచ్చేవాడు. వాటికి తిండి పెడుతూ, పరిశీలిస్తూ కాలక్షేపం చేసేవాడు. ఇంట్లో ఎక్కడైనా దుర్వాసన వస్తే ఆ కుర్రాడు తెచ్చిన ఏ జీవో చచ్చి ఉంటుందని పెద్దవాళ్లు వెతికేవారు.

darvnఅలాంటి కుర్రాడు పెరిగి పెద్దయ్యి ఈ భూమిపై జీవరాశులు ఎలా ఉద్భవించాయో, ఎలా పరిణామం చెందాయో, మానవుడు ఎలా పుట్టుకొచ్చాడో సాధికారికంగా చెప్పగలిగాడు. మానవ విజ్ఞానాన్నే మలుపు తిప్పిన గ్రంథం ‘ద ఆరిజిన్‌ ఆఫ్‌ స్పీసీస్‌’ రచించాడు. అతడే ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త ఛార్లెస్‌ డార్విన్‌.
డార్విన్‌ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో పుట్టాడు. వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలూ సమకూర్చినా చదువులో రాణించలేదు. అతడొక మందబుద్ధిగా ఉపాధ్యాయులు భావించేవారు. తండ్రి వైద్యవిద్య కోసం ఎడింబరో విశ్వవిద్యాలయంలో చేర్చినా డార్విన్‌ కొనసాగించలేకపోయాడు. ఏదో ఒక డిగ్రీ సంపాదించాలనే తండ్రి కోరికపై కేంబ్రిడ్జ్‌లో తత్త్వశాస్త్ర అధ్యయనంలో చేరినా అక్కడా అంతే.

అక్కడి ప్రొఫెసర్‌ ఓసారి అతడికి ‘బీగల్‌’ అనే ఓ నౌక కెప్టెన్‌కి పరిచయం చేశాడు. వివిధ దేశాల్లో, దీవుల్లో ఉండే జీవుల పరిశీలనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో డార్విన్‌ తన తండ్రి వద్దంటున్నా వినకుండా ఆ ఓడ ఎక్కేశాడు. ఆ నౌకాయానంలో డార్విన్‌ అనేక ప్రాంతాల్లో మొక్కలు, రాళ్లు, శిలాజాలు, కీటకాలు, జంతువులను పరిశీలించి చాలా నమూనాలను సేకరించి ఇంటికి పంపుతూ వచ్చాడు.

ఆ పరిశీలనల ఆధారంగానే జీవజాతుల పరిణామ క్రమంపై పుస్తకం రాశాడు. 150 సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పటికీ ప్రామాణికంగా నిలిచి ఉంది. జీవుల్ని ఏదో అతీత శక్తి ఏకకాలంలో సృష్టించలేదని, అవి వివిధ దశల్లో స్వాభావిక ఎంపిక (natural selection) ద్వారా పరిణామం చెందాయని డార్విన్‌ సిద్ధాంతం చెబుతుంది. ఇది ఇప్పటి మైక్రోబయాలజీ, జెనిటిక్స్‌, మాలిక్యులర్‌ బయాలజీలను సంఘటిత పరచడంలోనూ, డీఎన్‌ఏ పరీక్షల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తోంది.

చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం (Darwin’s theory of evolution) భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలని విభేదించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. మనిషి కోతి నుంచి వచ్చాడు, మనిషిని దేవుడు సృష్ఠించలేదన్న సిద్దాంతాన్ని తెర మీదకు తెచ్చింది. ఇప్పుడు కూడా సృష్ఠివాదం పేరుతో డార్వినిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. డార్విన్ జీవ పరిణామ సిధ్ధాంతం మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాద రచనలకి కూడా ఊపిరిపోసింది.

మలేషియా నుంచి రసెల్ వాలేస్ (1823- 1913) అనే వ్యక్తి పంపిన సిద్ధాంత వ్యాసం డార్విన్ వ్యాసం ఒకే విధంగా ఉన్నాయి. డార్విన్1844లో తన రచనను, వాలేస్ పంపిన వ్యాసాన్ని లియన్ సొసైటీ జర్నల్‌కు అందచేశాడు. 1858 జూలై 15న శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. ఇరువురి వ్యాసాలు పరిశీలించారు. 1844లో డార్విన్ మొదలు పెట్టగా, వాలేస్ 1858లో రాశాడు. కనుక డార్విన్ ముందు రాసినట్టు నిర్ధారించారు.
వివరణ
ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటినుంచీ లేవనేది ఈ సిద్ధాంతం యొక్క ప్రధానమైన వాదన. కుక్కలూ, నక్కలూ, తోడేళ్ళూ ఒక జాతివనీ, పిల్లులూ, చిరతపులులూ, పెద్ద పులులూ, సింహాలూ మరొక జాతికి చెందినవనీ, గుర్రాలూ, గాడిదలూ, జీబ్రాలూ ఒకలాంటివే. గతంలో వీటికి తలొక “పూర్వీకుడూ” ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ “ఆదిమ” శునకానికీ, మార్జాలానికీ, అశ్వానికీ జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది.

ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ, తక్కిన చేపలూ, తాబేళ్ళూ, జలచరాలూ, పక్షులూ అన్నిటి ఆవిర్భావానికీ దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది. వీటిలో కొన్ని శాకాహారులుగానూ, మరికొన్ని మాంసాహారులుగానూ రూపొందడానికి భౌతిక ప్రేరణలూ, పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి. ఇన్నిరకాల ప్రాణులు “వాటంతట అవే” ఎలా ఉద్భవిస్తాయని వీరి వాదన సాగిపోతుంది.

ఉదాహరణకు ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన మానవజాతి క్రమంగా ఉత్తరదిశగానూ, తక్కిన ప్రాంతాలకీ విస్తరించిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఉష్ణోగ్రత దృష్య్టా తొలిమానవులు నల్లని రంగులో ఉండి ఉంటారని అనుకోవచ్చు. ఉత్తరాన ఎండపొడ తక్కువగా పడే ప్రాంతాలకు వెళ్ళినవారి చర్మం తెల్లగా మారక తప్పలేదు. పూర్తిగా నల్లరంగులో ఉన్న ఒక మానవసమూహం తెల్లగా మారిపోవడానికి 20 వేల సంవత్సరాలు సరిపోతాయని అంచనా.

తక్కిన జంతువుల సంగతి ఎలా ఉన్నా, ఒక్క మనిషిజాతినే తీసుకుంటే, చర్మం రంగూ, ముఖకవళికలూ అన్నీ కాస్తకాస్తగా మారడానికి జీవపరిణామ ప్రక్రియలే కారణమని రుజువు అవుతోంది. దీని కారణంగానే జీవపరిణామ సిద్ధాంతాన్ని కాదనేవారు ఎక్కువ సంఖ్యలో లేరు.చార్లెస్ డార్విన్ స్వంత దేశమైన బ్రిటన్ లో డార్వినిజం ఎన్నో ప్రశంశలు అందుకుంది. డార్వినిజం ప్రపంచంలో ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తలని, జీవ శాస్త్రవేత్తలని ప్రభావితం చేసి అధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది.

Collected by
Dr.A.Srinivasa Reddy
9912731022
Zphs Munugodu Amaravathi mandal Guntur district.