Suryaa.co.in

Telangana

వరంగల్‌ సీపీ రంగనాథ్‌పై పరువునష్టం దావా

– వరంగల్‌ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
– ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తాం
– తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌

హైదరాబాద్‌: పదో తరగతి పేపర్‌ లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను వరంగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, జరిగిన పరిణామాలతో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, పేపర్‌ లీక్‌ కేసులో సంజయ్‌.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. బండి సంజయ్‌.. వరంగల్‌ సీపీ రంగనాథ్‌పై పరువునష్టం దావా వేయడానికి రెడీ అయ్యారు. టెన్త్‌ పేపర్‌ లీకేజీ విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారని సంజయ్‌ కోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను కూడా సంజయ్‌ ప్రిపేర్‌ చేసినట్టు తెలుస్తోంది. తన హక్కుల భంగంతోపాటు ఇతర విషయాలపై పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తన చేసిన ఆరోపణలపై కూడా పోరాటం చేస్తానని అన్నారు.

ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన అవినీతి చిట్టా మొత్తం బయటకు తీస్తాం. నా ఫోన్‌ ఇవ్వడం లేదని అంటున్నారు. ముందు సీపీ ఫోన్‌కాల్‌ లిస్టు బయటకు తీస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈటల రాజేందర్‌ ఫోన్‌ అడిగే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. నా ఫోన్‌ కేసీఆర్‌ దగ్గరే ఉందని అన్నారు. మీ దగ్గరే నా ఫోన్‌ పెట్టుకుని నన్ను ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE