Suryaa.co.in

Political News

మొండి బాకీలో అత్యధిక భాగం చెల్లించడం పట్ల హర్షం

– ఉత్తర్వుల్లోని షరతులపై మోడీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి!

2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు గ్రాంట్ పద్దు క్రింద కేంద్ర ప్రభుత్వం ‘ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం- ‘ పద్దు క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,460.87 కోట్లు గ్రాంట్-ఇన్-ఎయిడ్ మంజూరు చేయడం సంతోషం. రాష్ట్రానికి ఆర్థికంగా ఊరట కలిగించే నిర్ణయం.

ఆంధ్రప్రదేశ్ పున్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014 -15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ లోటును కాగ్ నిర్ధారించిన మేరకు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రు.16,078.76 కోట్లుగా కాగ్ నిర్ధారించింది.

మోడీ ప్రభుత్వం దాదాపు రు.3,979.50 కోట్లు ఇచ్చి, ఇహ! అంతకు మించి ఇచ్చేదిలేదని చెబుతూ వచ్చింది. తాజాగా రూ.10,460.87 కోట్లు విడుదల చేయమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పే & అకౌంట్స్ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తంతో కలిపి రెవెన్యూ లోటు పద్దు క్రింద రు.14,440.37 కోట్లు మంజూరు చేసినట్లయ్యింది. కాగ్ నిర్ధారించిన మొత్తం ప్రకారం ఇంకా రు.1,638.39 కోట్లు ఇవ్వాలి. మొండి బాకీలో అత్యధిక భాగం చెల్లిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం.

ఒక వైపున 2014 -15 రెవెన్యూ లోటు భర్తీ నిమిత్తం ప్రత్యేక సాధారణ ఆర్థిక సహాయమని చెబుతూ, మరొకవైపున ఆ ఆదేశాల్లో షరతులు ప్రస్తావించడం ద్వారా అనుమానాలకు ఆస్కారం కల్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల్లో పేర్కొన్న షరతుల్లోని అంతరార్థం ఏమిటో విస్పష్టమైన వివరణతో, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత, మోడీ ప్రభుత్వంపైన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన ఉన్నది.

రెవెన్యూ లోటు భర్తీ పేరుతో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకం మరియు ఇతర పథకాలు, పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ -2 కు ముడిపెట్టిన షరతులుగా ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన ద్రోహం తలపెట్టినట్లే.

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

LEAVE A RESPONSE