(నవీన్)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక విజన్ తోనే పనిచేస్తారు. తాజా విజన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2029 నాటికి దేశంలో 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రంగా ఎదగాలి. ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తరువాత అభివృద్ధి అనే బాబు హయాంలో అభివృద్ధి ఫలితాలు మిశ్రమంగా వున్నాయి. ప్రజల్లో ఆ ప్రభావం కూడా మిశ్రమంగా వుంది. ఆయన పార్టీ గెలుస్తోంది. ఓడిపోతుంది. గెలుస్తోంది. ఓడిపోతుంది.
బాబు అభివృద్ధి మంత్రం ప్రజలను ఎంతగా కనెక్ట్ చేస్తోందో అధ్యయనం లేదు. జగన్ ప్రభావాన్ని దృష్టిలో వుంచుకుని బాబు పేదల సంక్షేమ పధకాల సొమ్ము పెంచి, ఇంకా హెచ్చుమందికి విస్తరింపచేశారు. లబ్దిదారుల తృప్తి లేదా అసంతృప్తి ఇప్పటికిప్పుడే లెక్కతేలేది కాదు. ఇన్వెస్టర్లు నేరుగా బాబు తో టచ్ లో వున్నారు. మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేస్తారేమో అనే భయం తప్ప వారికి మరో సంకోచమే లేదు.
క్షేత్రస్ధాయిలో ఎమ్మెల్యేలదే రాజ్యం. సంక్షేమ పధకాల లబ్ధిదారుల అకౌంట్లలోకే నేరుగా డబ్బు జమ అవుతుంది . వారి ఇతర సమస్యల పరిష్కారం, మధ్యతరగతి వారి సమస్యల పరిష్కారం ఎమ్మెల్యేలకు పెద్ద పని అవుతుంది. ఆచరణలో ఇది కూడా పెద్ద భారంకాదు. సమస్య స్టేటస్ ఆన్ లైన్ లో కనబడుతూనే వుంటుంది. దాన్ని పుష్ చేయడమే ప్రజాప్రతినిధులు చేయగలపని.
ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే వనరుల నిర్వహణ, అజమాయిషీ సిండికేట్లవే! ఈ సిండికేట్ల వెనుక ప్రజాప్రతినిధులు వున్నారు. శక్తివంతులైన ప్రతిపక్షం వాళ్ళు కూడా వున్నారు. లిక్కర్, ఇసుక, మట్టి పాటదారుల సిండికేట్లు నాయకుల మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా చూసుకోవాలి. గ్రామాల్లో ఈ విషయం లెక్కలతో సహా ఓపెన్ గా చెప్పేస్తూ వుంటారు. “మాకేంటి” అనే నాయకులు కూడా వున్నారు.
ఇసుక మట్టి పనుల్లో ఎమ్మెల్యేలు ఎంత దూరంగా వుంటే ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుందని చంద్రబాబు హెచ్చరించడమే పరిస్ధితి శృతిమించి రాగాన పడుతున్నదనడానికి ఒక సూచన! ఎవరి కారణాలు వారికి వున్నా, ఆదివారం జరిగిన అధికారపార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలను ముఖ్యనాయకులను పిలిచారు. మొత్తం ఆహ్వానితుల్లో 56 మంది హాజరు కాలేదంటే అది ఒక విధమైన లెక్కలేని తనానికి ఒక సూచనగా అర్ధం చేసుకోవచ్చు.
క్వాంటమ్ మొదలైన టెక్నాలజీ ప్రాజెక్టులు, రకరకాల పరిశ్రమలకు ఇన్వెస్టిమెంట్లు దీర్ఘకాలంలో భవిష్యత్తుకి అవసరాలే! ఇవేమీ కళ్ళముందున్న ప్రజల అవసరాలు తీర్చలేవు. కనెక్టు కాలేవు. అధికారపార్టీల్లో వున్న ఎమ్మెల్యేల పనితీరే ప్రభుత్వం ప్రతిష్టను పెంచుతుంది. ప్రజల్లో నిలబెడుతుంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తుంది.
రేపటి అభివృద్ధి జపంలో కూటమి ప్రభుత్వం ఇపుడు కళ్ళముందున్న ప్రజల్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి, క్రిమినల్స్ ను నేరుగా సమర్థిస్తున్న అనేక కేసుల్లో నిందితుడైన జగన్ మీద చర్యల్లో కూడా కూటమి ప్రభుత్వం అడుగు వేయలేకపోతోంది.
జగన్ పై చర్య చంద్రబాబు వల్ల కాదని ఆయన పార్టీ వాళ్ళే అంటున్నారంటే.. పరిపాలనలో ఒక పార్శ్వాన్ని ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని అర్ధమౌతోంది. జగన్ మీద వ్యతిరేకతతోనే కూటమిని గెలిపించిన వర్గాల మనోభావాలను బాబు పట్టించుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
బాబు సన్నిహితుడన్న బావసతో జగన్ ప్రభుత్వం వేధించిన ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు ఒంటరి పోరాటం చేసి, తనపై పాత ప్రభుత్వం మోపిన అభియోగాలనుంచి విముక్తుడయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా ఏడాది గడచినా ఎబి పెన్షన్ సెటిల్ మెంట్ జరగలేదు. జీతంలో సగం బకాయిలు ఇంకా ఆయనకు చెల్లించనే లేదు. మధ్యతరగతి విద్యావంతుల్లో చంద్రబాబు పాలనపై పెరుగుతున్న నిరుత్సాహానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో వున్నాయి.
ప్రపంచంలో పెద్ద క్వాంటమ్ ప్రాజెక్టు మాకే వుంది. ఇంకో పాతికేళ్ళకు మేము ప్రపంచంలో గొప్పరాష్టం వాళ్ళమైపోతాం అనుకోడానికే తప్ప! బాబుగారి అభివృద్ధి మంత్రం వల్ల రోజువారీ బతుకుల్లో మార్పులు వుండవు. మాతోపాటు ప్రభుత్వం వుందన్న భరోసా వుంటే చాలు. అదే ముందుకి నడిపిస్తుంది.
సంక్షేమ పధకాల ద్వారా పేద వర్గాలకు జగన్ ఉన్నాడన్న ధీమాను ఆయన ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఎంత చేసినా, అది జగన్ పధకాల కొనసాగింపుగానే చూస్తారు. ఇందులో కూటమి లేబుల్ కాని బాబు లేబుల్ కాని లేవు.
బాబు గారూ! ప్రభుత్వం వుందన్న ప్రజెన్స్ ను మధ్యతరగతి వారికి, విద్యావంతులకు, జగన్ పై ఆగ్రహంతో మీకు అధికారాన్ని ఇచ్చిన వారికి చూపించండి. మీ ప్రభుత్వం ఓడిపోవడం మీకు కొత్తకాదు. కానీ, మీ మీద నమ్మకం వుంచిన వారి ఆశలు కొన్నైనా నెరవేర్చండి!