* బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ఎస్.సవిత
* రాంపురంలో ఎంజేపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం
* అడ్మిషన్లు ప్రారంభించామన్న మంత్రి
* వచ్చే విద్యా సంవత్సరానికి సొంత బిల్డింగ్ నిర్మిస్తాం గడిచిన 5 ఏళ్లూ నలిగిపోయిన బీసీ విద్యార్థులు : మంత్రి సవిత
పెనుకొండ : చంద్రబాబు రాకతో బీసీ విద్యార్థులకు మరోసారి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. పెనుకొండలోని తన స్వగ్రామం రాంపురంలో ఎంజేపీ బాలిక రెసిడెన్షియల్ స్కూల్ ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అణగారిన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వసతితో కూడిన ఉన్నత విద్య అందించాలన్న ఉద్దేశంతో అన్న ఎన్టీ రామారావు సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలనను సాగిస్తున్న సీఎం చంద్రబాబు సైతం సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి ఏటా భారీ ఎత్తున నిధులు మంజూరు చేశారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న రెసిడెన్షియల్ స్కూళ్లన్నీ టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే ఏర్పడినేవనని అన్నారు.
టీడీపీ ప్రభుత్వాల ముందు చూపు వల్ల నేడు ఎందరో బీసీ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం, కర్నూలులో బీసీల సంఖ్యలో ఎక్కువగా ఉందని, విద్యార్థుల సౌలభ్యం కోసం మరో రెసిడెన్షియల్ స్కూల్ అవసరమని సీఎం చంద్రబాబును కోరామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మరో ఆలోచన లేకుండా చంద్రబాబు పెనుకొండ నియోజక వర్గానికి బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ను మంజూరు చేశారన్నారు.
గడిచిన 5 ఏళ్లు నలిగిపోయిన విద్యార్థులు
గడిచిన అయిదేళ్లలో జగన్ రెడ్డి అసమర్థ పాలనతో బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులతో నలిగిపోయారని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. చిన్న చిన్న మరమ్మతులకు సైతం నిధులు మంజూరు చేయలేదన్నారు. దీంతో బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల జీవితాలు నరక ప్రాయంగా మారాయన్నారు.
నా బీసీలు…నా ఎస్సీలు…నా ఎస్టీలు…అని కబుర్లు చెబుతూ జగన్ రెడ్డి…టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలకు రంగులు వేయడం తప్ప మరే అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసి, నిర్మించిన రెసిడెన్షియల్ హాస్టళ్ల భవనాలు 80 నుంచి 90 శాతం పూర్తయ్యాయని, వాటిని కూడా పూర్తి చేయలేని అసమర్థుడు జగన్ అని తీవ్రంగా విమర్శించారు.
అడ్మిషన్లు ప్రారంభం
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే రాంపురం రెసిడెన్షియల్ స్కూల్లో బోధన ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి సవిత వెల్లడించారు. అనంతరం రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తాత్కాలిక భవనంలో రెసిడెన్షియల్ ను ప్రారంభించామని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి సొంత భవనం సిద్ధం చేస్తామని తెలిపారు. నిధులు సిద్ధంగా ఉన్నాయని, అధికారులు స్థలం చూపించగానే భవన నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.