ఎండిన పాలమూరు మీకు పచ్చగా కన్పిస్తుందా?

– కేసీఆర్ కు పొగబెట్టి గద్దె దించితేనే ఈ ప్రాంతానికి ఆర్డీఎస్ నీళ్లొస్తాయి
– కేంద్రం మంజూరు చేసిన 1.40 లక్షల ఇండ్లను నిర్మిస్తే మరో లక్ష ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత నాది
– డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివ్రుద్ది సాధ్యం
– కేసీఆర్ ఝూటా మాటలవల్ల రాజకీయ పార్టీలిచ్చే హామీలను నమ్మలేని దుస్థితి
– బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి… అభివ్రుద్ధి చేసి చూపిస్తాం
– ఉండవల్లి మండల కేంద్రంలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
– సంజయ్ సమక్షంలో పలువురు స్థానిక నేతలు బీజేపీలో చేరిక

పచ్చని పాలమూరులో చిచ్చు పెడుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ‘‘ కరువుతో, వలసలతో ఎండిన పాలమూరు కేసీఆర్ కు పచ్చగా కన్పిస్తోందట. ప్రజలారా…. కేసీఆర్ కు పొగ పెట్టి గద్దె దించితేనే పాలమూరు అభివ్రుద్ధి సాధ్యం. ఆర్డీఎస్ సమస్య పరిష్కారమవుతుంది’’అని అన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రెండో రోజు సాయంత్రం అలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఉండవలి మండల కేంద్రం లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి, సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, జిల్లా ఇంఛార్జీ నాగూరావు నామోజీతోపాటు మండల నాయకులు అశోక్, వెంకటేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.

అందులోని ముఖ్యాంశాలు..
ఉండవల్లి ప్రజల జోష్ ను చూస్తే నాకు ఉత్సాహం వస్తోంది. యువత జోష్ తో ఉంది. మిమ్ముల్ని చూస్తే నేను యూత్ నే అన్పిస్తోంది. మీరు మోదీ వ్యాక్సిన్ తీసుకున్నారా?…. లేక కేసీఆర్ వ్యాక్సిన్ (మద్యం) తీసుకున్నారా? (చప్పట్లతో సభికుల నినాదాలు)
కేసీఆర్ ఫాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు ప్రజలేం కోరుకుంటున్నారు? ఏ సమస్యలతో కష్టాలు పడుతున్నారో తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నా. మీరు ఇబ్బంది పడకండి. మీకు అండగా బీజేపీ ఉందని భరోసా కల్పించడానికే పాదయాత్ర చేస్తున్నా. కేంద్ర పథకాలను వివరించడానికే పాదయాత్ర చేస్తున్నా.

మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను గల్లా పట్టి ప్రగతి భవన్ కు, అక్కడి నుండి ధర్నా చౌక్ కు, జిల్లాలకు, దేశ రాజధానికి తిప్పిన ఘనత బీజేపీదే.బీజేపీని ఓడించడానికి కేసీఆర్ తెలంగాణ ప్రజలను పీడించి దోచుకున్న డబ్బును ఇతర రాష్ట్రాల నేతలకు పంపిణీ చేశారు.టీఆర్ఎస్ ను గెలపిస్తే ఆర్డీఎస్ నీళ్లు పారిస్తానన్న కేసీఆర్ ఏమైంది? పచ్చగా ఉన్న పాలమూరులో నేను చిచ్చు పెడుతున్నాననట…

పాలమూరు పచ్చగా ఉందా? ఎండిపోయిన జిల్లా ఇది. వలసల జిల్లా ఇది. కానీ కేసీఆర్ కు పాలమూరు పచ్చగా కన్పిస్తుందట… నేను పచ్చని పాలమూరులో చిచ్చు పెడుతున్నానట…ఆర్డీఎస్ గురించి మాట్లాడే దమ్ముందా కేసీఆర్ కు… కేసీఆర్ కు పొగ పెడితేనే ఆర్డీఎస్ సమస్య పరిష్కారమైతది.

పాలమూరు పచ్చగ కావాలంటే… కేసీఆర్ కు ప్రజలు సెగ తగిలించాల్సిందే.ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు… పైసలు పడేస్తే ప్రజలు ఓట్లేస్తారనే చులకన భావం కేసీఆర్ కు ఉంది.హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పైసలిచ్చి గెలవాలని చూస్తే కేసీఆర్ మైండ్ బ్లాక్ అయ్యేలా ప్రజలు తీర్పిచ్చారు.బుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. కేంద్రం 1.40 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ఘనుడు.

కేసీఆర్… కేంద్రం మంజూరు చేసిన లక్షా 40 వేల ఇండ్లు కట్టిస్తే… మరో లక్ష ఇండ్లు కేంద్రం ద్వారా మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటా…ఇంటికో ఉద్యోగమన్నావ్… నిరుద్యోగ భృతి ఇస్తానని మాట తప్పిన వ్యక్తి కేసీఆర్….ఉద్యోగం ఇవ్వకపోతే నీ సంగతి చూస్తామని బీజేపీ హెచ్చరిస్తే… దిగొచ్చి నోటిఫికేషన్లు ఇస్తామంటూ దిగొచ్చిన నాయకుడు కేసీఆర్.

టీఆర్ఎస్ పాలనలో రైతులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.కేసీఆర్ ఫాలనలో వైద్యం పడకేసింది. అలంపూర్ ప్రజలకు అనారోగ్యమొస్తే ఏపీకి వెళ్లాల్సిన దుస్థితి.

ఆరోగ్యశ్రీ పనిచేయదు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడు.గ్రామాల్లోని రోడ్లు, డ్రైనేజీ, స్మశాన వాటికలు, మరుగుదొడ్లు, ఇండ్లు, పల్లె ప్రగతి సహా అభివ్రద్ధి నిధులన్నీ కేంద్రమే ఇస్తోంది.

పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యానికయ్యే ఖర్చు కేంద్రానిదే. ఒక్కో కిలో బియ్యానికి కేంద్రం రూ.30లు ఇస్తే… రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి మాత్రమే భరిస్తోంది. ఎవరు గొప్పో ప్రజలే ఆలోచించాలి. ఎన్నికలొస్తే తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి మళ్లీ ఓట్లు దండుకోవాలన్నదే కేసీఆర్ ప్లాన్… కానీ జనం కేసీఆర్ ను నమ్మడం లేదు. ఇచ్చిన హామీలేవీ అమలు చేయడంతో రగలిపోతున్నరు.

ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్ కు వాతపెట్టాలని కాచుకుని కూర్చుకున్నారు.అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరగరాసి కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తాడంట.కల్వకుంట్ల కుటుంబం చెప్పిందే శాసనం కావాలట. పేదోళ్లు పేదోళ్లుగానే ఉండాలట. దళితులంటే నచ్చదట. కేసీఆర్ కుటుంబానికే పదవులు కావాలట.ఆయనకు సీఎం, కొడుకుకు మంత్రి పదవి, బిడ్డకు ఎమ్మెల్సీ, అల్లుడికి మంత్రి పదవి, సడ్డకుడి కొడుకుకు ఎంపీ పదవులు అనుభవిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో దొంగ దీక్షలు చేసిన చరిత్ర కేసీఆర్ ది. తెలంగాణ కోసం యువకులు బలిదానాలు చేసుకుంటే వారి త్యాగాలతో టీఆర్ఎస్ భోగాలను అనుభవిస్తోంది.ఇప్పటి వరకు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ పార్టీలకు అధికారం ఇచ్చారు. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వాలి. తెలంగాణ అభివృద్ధి చేసి చూపిస్తా.

కేంద్రం ఉండవల్లి మండలానికి ఎన్ని నిధులిచ్చిందో… టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చిందో బహిరంగ చర్చకు సిద్ధం. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. అప్పుడే అభివ్రుద్ధి సాధ్యం. ఎందుకంటే కేంద్రం నిధులిస్తున్నా… కమీషన్ల కోసం కక్కుర్తి పడి గుంటనక్కలా దోచుకుతింటున్నారు.పైగా కేంద్రాన్ని బదనాం చేస్తూ రాక్షసానందం పొందుతున్న వ్యక్తి కేసీఆర్.

ఇగ కేసీఆర్ పాలన వద్దు… ఇక బలిదానాలు వద్దు. ఇదే ఆఖరు పోరాటం కావాలి. ఈ పోరాటంలో బీజేపీ అండగా ఉంటుంది.ప్రజలారా… నేను చెప్పిన విషయాలు వాస్తవాలైతేనే బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరుతున్నా. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చాక ఆర్డీఎస్ సమస్యను పరిష్కరిస్తాం.కేసీఆర్ చెబుతున్న ఝూటా మాటలు… తప్పుడు హామీల వల్ల రాజకీయ పార్టీలిచ్చే హామీలను నమ్మలేని పరిస్థితి.తెలంగాణలో ప్రజలకు న్యాయం జరగాలంటే… పేదలు బాగుపడాలంటే బీజేపీని గెలిపాంచాలి.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి మాట్లాడుతూ….అలంపూర్ ఎమ్మెల్యే కమీషన్లు ఇస్తేనే పనులు చేస్తున్నరు. ఎమ్మెల్యే కొడుకు కమీషన్ల కోసం ఆగడాలు చేస్తున్నారు. ఇక్కడ నాగల్ ఫిడేల్ బ్రిడ్జి శిథిలమైపోయినా పట్టించుకునే దిక్కు లేరు. ఎమ్మెల్యేకు ఇక్కడి ప్రజలు అవసరం లేదు. కేసీఆర్ కు సలాం కొట్టి బతకాలనుకుంటున్నారు.

స్థానిక ఎంపీ పత్తాలేరు. ఒక్కరోజు కూడా రాలేదు. ఓట్ల కోసం మాత్రమే వస్తారు.ఉద్యోగాల కోసం ఎమ్మెల్యే వద్దకు వెళితే చులకనగా మాట్లాడుతున్నారు.తండ్రీ కొడుకులు జనాలను మోసగించి, భయపెట్టి పోలీసులతో అధికారం చెలాయిస్తున్నారు.ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం కావాలా? బెదిరించే పాలన కావాలా? తేల్చుకోవాలి.