-
పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలి
-
సర్పంచులు, పంచాయతీ ప్రజలు కలిసి గ్రామాభివృద్ధికి నిర్ణయం తీసుకోవాలి
-
ఒకే రోజు నిర్వహించిన 13,326 గ్రామ సభల్లో కోటి మంది పాల్గొనడం… రూ.4500 కోట్లు విలువైన పనులకు ఆమోదం తెలపడం సంతోషకరం
-
గ్రామాల్లో జరిగే పనులపై అందరిలో చైతన్యం రావాలి
-
గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులు, నిధులకు లెక్కలే లేవు
-
భవిష్యత్తు అవసరాల కోసం పంచాయతీలకు భూముల అవసరం ఉంది
-
గత ప్రభుత్వ హయాంలో కోకొల్లలుగా భూ సమస్యలు పెరిగాయి
-
త్వరలో గ్రామ సభల తరహాలోనే రెవెన్యూ సభలు
-
ప్రభుత్వ భూములు కబ్జా చేసే వారిపై కొత్తగా గూండా యాక్ట్ తెచ్చే యోచన చేస్తాం
-
మైసూరువారిపల్లె గ్రామసభలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్
మైసూరువారిపల్లె: ‘మన గ్రామంలో ఏం చేసుకోవాలి.. ఏ పనులు పూర్తి కావాలి.. ఎలా పుట్టిన గ్రామాన్ని ఎలా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకోవాలి? అనే ఆలోచన ఆయా గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి ఉండాలి. గ్రామ సభల్లో గ్రామానికి అవసరం అయ్యే పనుల మీద గ్రామస్తులంతా సమగ్రంగా చర్చించాలి. అంతా ఒక్కటిగా తీర్మానాలు చేసుకొని గ్రామ అభివృద్ధిని, ప్రగతికి ముందుకు నడిపించే చైతన్యం ఉన్నప్పుడే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తాయ’ని ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ అన్నారు.
స్వర్ణ పంచాయతీలుగా మారి సంపన్న ఆర్థిక, అభివృద్ధి ప్రగతి సాధించేలా పటిష్ఠమైన ప్రణాళికను గ్రామస్తులే రూపొందించుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. గ్రామ పంచాయతీ మొదటి పౌరుడు అయిన సర్పంచులకు విశిష్టమైన శక్తి, అధికారాలు ఉన్నాయని, దానిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే ప్రతి గ్రామం రాలేగావ్ సిద్ధిగా మారుతుందని అభిలషించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామపంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరువారి పల్లె గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి, మైసూరవారి పల్లె గ్రామ సర్పంచి కారుమంచి సంయుక్త తో కలిసి ప్రారంభించారు. సంయుక్త మాట్లాడుతూ పంచాయతీ నిధులను, చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. అనంతరం పంచాయతీలో రూ.38.46 లక్షలతో చేపట్టాల్సిన 43 రకాల పనులు గురించి తీర్మానాలను చేశారు. గ్రామస్తులు ప్రత్యేకంగా మాట్లాడారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఎవరు పోటీలో నిలబడలేని, ప్రతికూల పరిస్థితులను ఎదిరించి ఓ ఆర్మీ జవాన్ భార్యగా కారుమంచి సంయుక్త పోటీలో నిలవడమే కాకుండా గెలవడం ఆమె తెగువకు నిదర్శనం. ఆమె ధైర్యం నన్ను కదిలించింది.
అందుకే గ్రామ సభను ఇక్కడ నిర్వహించాలని భావించాం. ఇంట్లో ఆడపిల్ల చదివితే ఆ ఇంటికి వెలుగు అంటారు. అదే ఆడపిల్ల చదివితే దేశానికి కూడా వెలుగు. పంచాయతీల నుంచే భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగిన ద్రౌపది ముర్ము ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం.
గ్రామ పంచాయతీల నుంచి బలమైన నాయకులు దేశానికి తయారవుతారు. అందుకే గ్రామాల నుంచి దేశభక్తి ఉప్పొంగాలనే ఉద్దేశంతో జాతీయ పండుగలను వైభవంగా జరిపేందుకు మేజర్, మైనర్ పంచాయతీలకు నిధులను భారీగా పెంచాం.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి ప్రాధాన్యం
ప్రస్తుత గ్రామ పంచాయతీ సర్పంచులుగా వైసీపీకి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 70 శాతం పైబడి వైసీపీకి చెందిన వారే ఉన్నారు. మేం రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి వైపు అడుగులు వేయాలని బలంగా సంకల్పించామని పవన్ అన్నారు. గ్రామాల అభివృద్ధి బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి బాగుంటుందని నేను నమ్ముతాను.
దానికి అనుగుణంగానే గ్రామాలను బలోపేతం చేసేందుకు ముఖ్యంగా ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు ప్రయాణం మొదలుపెట్టాం. ఇటీవల ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారీగా నిధులను పెంచి సర్పంచులు సగర్వంగా పండుగను జరుపుకొనేలా చేశాం. దీనిలో ఎక్కువ మంది వైసీపీ సర్పంచులే ఉన్నా.. మేం రాజకీయాలను పట్టించుకోలేదు.
అన్ని పంచాయతీలకు నిధులు అందేలా చూసాం. ప్రస్తుతం కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 991 కోట్లు వచ్చాయి. ఎలాంటి కోతలు, మళ్లింపులు లేకుండా పంచాయతీల అకౌంట్లో నిధులను జమ చేశాం. స్వర్ణ పంచాయతీలు చేయడానికి ఆర్థికంగా వాటికి బలాన్ని అందించే కార్యక్రమాన్ని, పంచాయతీల్లోని వనరులను ఉపయోగించుకుని ముందుకు వెళ్లే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదుగానీ బలమైన సంకల్ప బలం, చిత్తశుద్ధితో కూడిన పాలన ఉంది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే ఆలోచనతో, గ్రామాలకు మళ్లీ పునర్ వైభవం రావాలని బలమైన ఆశయంతో పని చేస్తున్నాం.
గత ప్రభుత్వంలో పెట్టిన ఖర్చులకు లెక్కే తెలీదు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.41 వేల కోట్ల పనులు చేశారు. అయితే, వీటికి లెక్కాపత్రం లేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే కేవలం రూ.15 వేల కోట్ల పనులు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన నిధులు ఏమయ్యాయో, ఎలా ఖర్చు చేశారో కూడా తెలీదు. దీనికి కారణం ఒక్కటే. గ్రామసభలను నిర్వహించకుండానే ఇష్టానుసారం పనులు చేయడం వల్ల గ్రామాల్లో జరిగిన పనులే చాలా చోట్ల సర్పంచులకు కూడా తెలీని పరిస్థితి ఉంది. రోడ్లు, మౌలిక వసతులు తప్ప ఇతర పనుల జాడ లభించడం లేదు. గ్రామసభలు నిర్వహించి గ్రామాల్లో చేసుకోవాల్సిన పనులు, వాటి ప్రాధాన్యం గురించి చర్చించి తీర్మానాలు చేసినప్పుడే నిధుల వినియోగం మీద స్పష్టత వస్తుంది.
ప్రతీ పని వివరాలు ప్రజలకి తెలిపేలా బోర్డులు
చేపట్టిన పనికి సంబంధించి కాంట్రాక్టరు పేరుతో సహా ఆ పని వివరాలను సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. దీనివల్ల ప్రతి ఒక్కరికీ ఆయా పనుల నాణ్యత, నిధుల ఖర్చు వివరాలు తెలుస్తాయి. నాకు ఇష్టమైన నాయకుడు అన్నా హజారే. పంచాయతీలతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి తన ఆలోచనలతో ఓ లోక్ పాల్ బిల్లు, సమాచార హక్కు చట్టం వంటి వాటిని తీసుకొచ్చిన నాయకుడు ఆయన. పంచాయతీల్లో బలమైన నాయకత్వం, ఆలోచన తీరు ఉంటుంది. సర్పంచులకు బోలెడు అధికారాలు ఉంటాయి. వాటిని సరైన తీరులో ఉపయోగిస్తే ప్రతి పల్లె అభివృద్ధి పథంలో సాగుతుంది.
పల్లెలు సుసంపన్నం అయితే రాష్ట్ర అప్పులను కూడా సులభంగా తీర్చే అవకాశం ఉంటుంది. రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని ఉద్యాన పంటల రాజధానిగా చేయాలి. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రాంతంలో మామిడి, అరటి, బొప్పాయి పంటలకు ఎంత ప్రత్యేకత ఉందో చాలా పల్లెలు విలక్షణమైన ప్రత్యేకతలను సంతరించుకుంటాయి. వేటపాలెం గ్రామం జీడి పప్పుకు ప్రసిద్ధి. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఉంది. లేపాక్షి, చిలకలపూడి కళాకృతులకు మంచి డిమాండు ఉంది. ఇలా గ్రామాలకు ఉన్న ప్రత్యేకతలను ఆదాయ వనరులుగా మారిస్తే కచ్చితంగా ఆయా గ్రామాల స్వరూపం మారుతుంది. తద్వారా రాష్ట్రం కూడా ఆర్థికంగా పరిఢవిల్లుతుంది. గ్రామాలు కళకళలాడితే రాష్ట్రం… రాష్ట్రం కళకళలాడితే దేశం బాగుంటాయి.
చదువుల నేల రాయలసీమ
రాయలసీమ విద్యల నేల. అత్యధిక గ్రంథాలయాలున్న నేల. ఇక్కడ యువతకు ఉన్న శక్తి అపూర్వం. కర్నూలులో సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని నేను పోరాటం చేస్తే నాతో లక్షలాదిగా ఇక్కడ యువత కదిలారు. అన్యాయంపై పోరాటగల నైజం రాయలసీమ యువతకు సొంతం. నేను ఎన్నికల సభలకు రైల్వే కోడూరు వచ్చిన తర్వాత ఇక్కడి యువత స్వాగతం చూసి.. కచ్చితంగా కూటమి ప్రభుత్వం రాబోతోందని బలంగా భావించాను.
రాయలసీమ యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరగాలి. ఉద్యాన పంటలకు సంబంధించిన పరిశ్రమలు రావాలి. అలాగే మంగంపేట బైరెటీస్ గనుల్లో స్థానిక యువతకు తగిన ప్రాధాన్యత అందేలా చూస్తాం. దీంతో పాటు ఇక్కడి యువత తగిన నైపుణ్యాలను సాధించేందుకు స్కిల్ యూనివర్శిటీ ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెళ్తాం. స్థానికంగా ఉపాధి పెరిగితే గల్ఫ్ దేశాలకు వలసలు తగ్గుతాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన అనుభవం గొప్పది. ఆయన ఆధ్వర్యంలో పని చేస్తూ పాలన అనుభవం నేర్చుకుంటాను. మంచి ఎక్కడున్నా నేర్చుకునేందుకు నేను నిరంతరం తపన పడతాను. ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే సమర్ధులైన బోలెడుమంది నాయకుల అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ముందకు వెళ్తాం.
ప్రభుత్వ భూములు లేకుండా దోచేశారు
గత ప్రభుత్వంలో కనిపించిన ప్రతి భూమిని దోచుకున్నారు. మైసూరువారి పల్లె గ్రామానికి కేవలం ఎనిమిది సెంట్ల భూమి మాత్రమే ఉందని తెలిసి ఆశ్చర్చపోయాను. కనీసం భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా భూమి లేకుండా గ్రామానికి అవసరం అయ్యే పనులు ఎలా చేసుకుంటాం..? కచ్చితంగా ప్రతి గ్రామంలో అవసరం అయ్యే భూములను పంచాయతీకి ఉండేలా చూస్తాం. దాతలు ముందుకు వచ్చి ఆయా పంచాయతీలకు స్థలాలు కేటాయిస్తే, వారికి ప్రభుత్వం, పంచాయతీ తరఫున తగిన గౌరవం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో భూ సమస్యలు, భూ రికార్డుల మార్పిడి, దౌర్జన్యాలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి.
ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన భూ తప్పిదాలు మరెప్పుడూ జరిగి ఉండవు. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పుడు గ్రామసభలు ఎలా నిర్వహిస్తున్నామో… త్వరలో రెవెన్యూ సభలు నిర్వహించి భూ సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరించేలా చూస్తాం. అవసరం అయితే ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కూడా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ భూములు కబ్జా చేసే వారిపై ప్రత్యేకమైన గూండా యాక్ట్ తీసుకొచ్చేలా సీఎం దృష్టికి, క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాను. ప్రతి గ్రామంలోనూ అసలు గ్రామ పంచాయతీకి, ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏమయ్యాయో చర్చిస్తే, అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. దీనిపై అందరిలో చైతన్యం రావాలి. ప్రతి అభివృద్ధి పనికి దాతలను సహాయం చేయాలని కోరడం కాదు… అసలు పంచాయతీకి తగిన భూములుంటేనే భవిష్యత్తు అభివృద్ధి సాధ్యం.
ఏటా 4 గ్రామసభలు నిర్వహించాలి
ప్రతి పంచాయతీ ఏటా నాలుగు గ్రామ సభలు నిర్వహించాలి. అక్కడే మొత్తం గ్రామాల్లో జరగాల్సిన పనులపై చర్చ జరగాలి. దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి.. ఏ పని చేస్తే గ్రామానికి మేలు జరుగుతుందనే దానిపై ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ముఖ్యంగా యువత, మహిళలు గ్రామసభల్లో అధికంగా పాల్గొని భవిష్యత్తు అవసరాలు, గ్రామానికి కావాల్సిన సదుపాయాలపై చర్చించి పనులు జరిగేలా నిర్ణయం తీసుకోవాలి. ప్రజల మధ్యనే, ప్రజల ఆమోదంతోనే గ్రామసభల్లో తీర్మానాలు చేయాలి. ప్రతి గ్రామసభకు తప్పనిసరిగా అంతా హాజరుకావాలి. ఈ సంప్రదాయం విధిగా అమలు అయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలి. జరిగే పనులను కూడా ఆయా గ్రామ పంచాయతీ ప్రజలే పర్యవేక్షించే బాధ్యతను తీసుకోవాలి. పనులెంత నాణ్యంగా జరుగుతున్నాయి… అవసరం మేరకు పనులున్నాయా అనేది ప్రజలే చూసుకోవాలి. పంచాయతీలకు అత్యంత తక్కువ భూమి ఉందని తెలుసుకొని, తన సొంత భూమి 10 సెంట్లను ఇవ్వడానికి ముందుకు వచ్చిన కారుమంచి నారాయణని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
మైసూరువారిపల్లె అవసరాలను తీరుస్తాం
మైసూరువారిపల్లెలో ఉన్న కీలకమైన సమస్యలను తీర్చేలా దృష్టి పెడతాం. పాఠశాలకు ఆటస్థలం, కోల్డ్ స్టోరేజీ, అరటి పంటలకు రబీ బీమా అమలు, వాగుకు రక్షణ గోడ వంటివి తీరేలా చేస్తాం. పండ్లకు రాజధాని చేసి.. ఇక్కడకు పరిశ్రమలు వచ్చేలా చూస్తాం. స్థానిక యువతకు స్కిల్స్ శిక్షణ ఇచ్చి వారికి ఉన్నతంగా తయారు చేస్తాం. అలాగే సర్పంచి కారుమంచి సంయుక్త చెప్పిన పనులను పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. స్వర్ణ పంచాయతీల్లో భాగంగా గ్రామాలకు డిజిటల్ సేవలను తీసుకొస్తాం. కేంద్రం ఆగస్టు 15వ తేదీన దేశంలోని 2.7 లక్షల గ్రామాల్లో స్థానిక భాషలో సాఫ్ట్ వేర్ ఉపయోగించుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీన్ని ఉపయోగించుకొని ఆ పథకాన్ని గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేస్తాం. ఇటీవల చేసిన పంచాయతీ డిక్లరేషన్ పకడ్భందీగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటాం.
అన్ని గ్రామాల్లో పండుగలా…
దేశంలోనూ ఎన్నడూ లేనట్లుగా నిర్వహించిన గ్రామ సభల్లో రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో కోటి మంది పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో పండుగలా దీన్ని నిర్వహించాం. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు అంతే వేగంగా అమలు అయ్యేలా చూస్తాం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ప్రజాప్రతినిధులంతా సభల్లో పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని సచివాలయాలకు మహిళలు నిర్భయంగా వెళ్లేలా, మహిళా ఫ్రెండ్లీ వ్యవస్థను తీసుకొస్తాం.
అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.991 కోట్లను పంచాయతీల ఖాతాల్లో వేసిన తర్వాతే, ఏం పనులు చేయాలనే దానిపై సభలు నిర్వహిస్తున్నాం. ఆ డబ్బుతోనూ గ్రామాలకు అవసరం అయిన పనులు చేసుకునే వీలుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించిన యువతరం, మహిళలకు గొప్ప శక్తి ఉంది. వారు పుట్టిన గ్రామాలను, రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రేమించాలి. వారు శక్తివంతులుగా, చైతన్యవంతులుగా మారితేనే మళ్లీ పంచాయతీలను పచ్చగా పరిఢవిల్లుతాయి. గొప్పగా మారతాయి’’ అన్నారు.
గ్రామ సభలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, ఆరణి శ్రీనివాసులు, పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ, అన్నమయ్య కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ నైదియా దేవి అధికారులు, నాయకులు పాల్గొన్నారు.