పీ4కు హైబ్రిడ్ మోడల్ లో బాబు చేపట్టిన జన్మభూమి స్ఫూర్తితో ఉండిలో అభివృద్ధి కార్యక్రమాలు
– రేపు లేదన్నట్లుగానే యుద్ధ ప్రాతిపదికపై అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన… శరవేగంగా పూర్తి చేసేందుకు కృషి
– పది రోజులపాటు పదిమంది ఇబ్బంది పడినా లక్షమంది జీవితాంతం సుఖంగా ఆరోగ్యంగా ఉండాలన్నదే నా సిద్ధాంతం
– శాసనసభా ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు
ఉండి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో చేపట్టిన జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తితో, ప్రస్తుతం ప్రవేశపెట్టిన పీ 4 కి హైబ్రిడ్ మోడల్ లో ఉండి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ హైబ్రిడ్ మోడల్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత కచ్చితంగా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పీ 4 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏమి చేయగలమన్నదానిపై ఒక నిర్ణయాన్ని తీసుకొనున్నట్లుగా ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి 4 విధానం వినూత్నమైన కాన్సెప్ట్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సమాజంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిన పది శాతం మంది, సమాజంలోని అట్టడుగున ఉన్న 20 శాతం మందిని ఎంపిక చేసుకుని ఆ కుటుంబాల బాగోగులు చూసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సమాజంలోని అట్టడుగు కుటుంబాలను ప్రభుత్వమే ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. మీ ప్రాంతంలోని ఈ కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్నాయని చెప్పవచ్చునని, మనం మరికొంద మందిని గుర్తించి ఒక పద్ధతి ప్రకారం పీ 4 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని రఘురామకృష్ణంరాజు అన్నారు.
రేపు లేదన్నట్లుగానే యుద్ధ ప్రాతిపదికపై అభివృద్ధి కార్యక్రమాలు
ఐదేళ్లు పదవీకాలం ఉందని నిదానంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుదామని కాకుండా, రేపు లేదన్నట్లుగానే అభివృద్ధి కార్యక్రమాలను యుద్ద ప్రాతిపదికన చేపట్టి వాటిని పర్యవేక్షిస్తున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పాలకోడేరు మండలంలో మంగళవారం నాడు 89.5 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందన్నారు. కాళ్ల మండలంలోను 68.75 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
సీసీ రోడ్లను పంచాయితీ రాజ్ శాఖలోని ఎన్ఆర్జిఎస్ నిధులతో ప్రారంభించినట్లు పేర్కొన్న ఆయన, గత నెల రోజుల క్రితమే అభివృద్ధి పనులు పూర్తి అయినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర ఆంక్షల కారణంగా ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలన్నీ చాలా చక్కగా జరుగుతున్నాయని, రేపు, ఎల్లుండి నియోజకవర్గంలోని ఇంకా మిగిలిన రెండు మండలాలలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలను చేపట్టనున్నట్లుగా వెల్లడించారు.
స్వచ్ఛమైన తాగునీరు అందించడమే నా సంకల్పం
ఉండి నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నదే తన సంకల్పమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. చుట్టూ గోదావరి నీళ్లు ఉన్న తాగటానికి మాత్రం మంచినీరు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందడంతో, చేపల, రొయ్యల చెరువుల వ్యర్ధాలతో తాగునీరు కలుషితమై ప్రజలు ఎక్కువగా క్యాన్సర్ రోగం బారిన పడుతున్నారని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకపక్క అభివృద్ధి జరగాలన్న ఆయన, మరోవైపు ప్రజారోగ్యం కూడా ముఖ్యమేనని అన్నారు. కలుషిత జలాల వల్ల ప్రజలు దారుణమైన అనారోగ్యానికి గురికావడమనేది కలత పెట్టే అంశం అన్నారు. ప్రజల అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సి ఎస్ ఆర్ నిధులతో స్వచ్ఛమైన మంచినీరును అందించేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. సిఎస్ఆర్ నిధులను అందజేయడానికి కెనరా బ్యాంక్, ఇంకా వివిధ బ్యాంకింగ్ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో ఎన్నో మంచి కార్యక్రమాలను కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగిందన్నారు.
ఇది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ4 కార్యక్రమంలో లాంటిదేనని తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు మంచినీటిని ఏప్రిల్ నెలాఖరులోగా అందిస్తామన్నారు. ఒకవేళ, కించిత్ ఆలస్యం అయితే మే రెండవ వారం, 14వ తేదీ నా పుట్టిన రోజు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నన్ను కొట్టించిన రోజు నాటికి నా స్వచ్చ్ సంకల్పాన్ని నెరవేర్చుతానని తెలిపారు.
అన్ని గ్రామాలలో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటుచేసి , మంచినీటిని సరఫరా చేయడం తన ధ్యేయమని తెలిపారు . గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి గా పవన్ కళ్యాణ్ బాధ్యతలను చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఏళ్ళ తరబడిగా ఉన్న పెండింగ్ బిల్లులను కూడా చెల్లించడం జరిగిందన్నారు.
ఒకవైపు దాతల విరాళాలతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వ సౌజన్యంతో కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు అందేలా చూస్తూ… ఇంటింటికి పైప్ లైన్ ద్వారా మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామన్నారు. మంచినీటి ప్రజలకు అందించడమే తన మొదటి ప్రాధాన్యతన్న రఘురామకృష్ణం రాజు, ఇది కూడా ఒక రకమైన పీ 4 కార్యక్రమమేనని అన్నారు.
చంద్రబాబు నాయుడు చేపట్టిన పీ 4 అనేది ఒక వినూత్నమైన కార్యక్రమం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పీ 4 అనేది ఒక వినూత్నమైన కార్యక్రమమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అయితే పీ 4 లాంటిదే, ఉండి నియోజకవర్గంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం తాము చేపట్టిన కార్యక్రమమని వెల్లడించారు. పీ 4 కార్యక్రమంలో కేవలం ప్రభుత్వం అనుసంధాన కర్త మాత్రమేనన్న ఆయన, భగవంతుడికి భక్తుడికి మధ్య అంబికా దర్బార్ అనుసంధాన కర్త అన్నట్టు గా ఇక్కడ ప్రభుత్వం పాత్ర కూడా అంతేనని చెప్పారు.
కమ్యూనిటీ డెవలప్మెంట్ లో ప్రభుత్వ నిధులు ఒక పార్ట్ ఆఫ్ ది హోల్ చైన్ అని పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు, ప్రజల సహకారం సం పార్ట్ ఆఫ్ ది హోల్ చైన్ అని తెలిపారు. ఇక నా మిత్రుల సహకారం, వారి కంపెనీల సి ఎస్ ఆర్ నిధులు, బాగా లాభాలను ఆర్జించే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచి కూడా సిఎస్ఆర్ నిధులను సేకరించి కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయడం జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వద్దకు సిఎస్ఆర్ నిధుల కోసం వెళ్ళినప్పుడు, తాము చేపట్టబోయే ప్రాజెక్టు రిపోర్ట్ తీసుకు వెళ్లి వారిని ఒప్పించి నిధులను తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా అంతిమంగా ప్రజలే లబ్ధిదారులన్న రఘురామకృష్ణం రాజు, గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తితో పది నెలల క్రితమే ఈ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉగాది రోజున తీసుకువచ్చిన పి4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకులను గుర్తించి, సమాజంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధికి వారు చొరవ తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా స్కూళ్లను చక్కగా అభివృద్ధి చేసి, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అదనపు తరగతి గదులు నిర్మించడంతోపాటు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసినట్లుగా తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని 24 జిల్లా పరిషత్ పాఠశాలలలో భాగంగా 15 పాఠశాలలను ఎంపిక చేసి దాతల సహకారంతో లాబొరేటరీలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
వేసవి సెలవులు ముగిసి తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోలజీ, కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాంటి లాబొరేటరీలను జిల్లా పరిషత్ సహకారంతోపాటు, దాతల సహకారంతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించినట్లుగా వెల్లడించారు.
పదిమంది మాత్రమే బతకటం కాదు… లక్ష మంది ఆరోగ్యంగా ఉండాలి
చేపల చెరువు వ్యర్థాలను మంచినీటి కాలువలలో కలుపుకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇన్నాళ్లు చేపల చెరువుల రైతులు విచ్చలవిడిగా కాలువలలో వ్యర్థాలను కలిపే వారిని, అటువంటి వారికి ప్రస్తుతం చేపడుతున్న కట్టుదిట్టమైన చర్యలు అసంతృప్తికి గురి చేయడం సహజమేనని అన్నారు. కేవలం పదిమంది బ్రతకడమే కాదని, లక్షమంది చక్కటి ఆరోగ్యంతో ఉండాలన్నదే తన లక్ష్యం అని తెలిపారు.
నేను ఒక్కడినే మినరల్ వాటర్ కొనుక్కొని తాగడం కాదని, ప్రజలందరికీ కూడా చక్కటి నీరు అందించాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. ప్రజలందరికీ చక్కటి నీరు అందించాలంటే… నీటిని కలుషితం చేసే వారి తీరు మారాలని రఘురామ కృష్ణంరాజు అన్నారు. నీటిని కలుషితం చేయకుండా ఉండడానికి కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని, వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కాలువలలో చేపల చెరువుల వ్యర్ధాలను కలపడమే కాకుండా, కొన్ని చోట్ల మనుషుల వ్యర్ధాలను కూడా కలుపుతున్నారన్నారు.
కాలువ గట్టులలో గుడిసెలు వేసుకున్న వారు మీడియా పబ్లిసిటీ కోసం రాజుగారు చాలా క్రూరంగా పేదల ఇళ్లను తీసేస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. కాలువలు, చెరువుల గట్లపై గుడిసెలు వేసుకున్న వారికి ప్రత్యామ్నాయ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, మూడు లక్షల రూపాయల గ్రాంట్ కూడా ఇచ్చిన తర్వాతే వారి గుడిసెలను తొలగించడం జరుగుతోందన్నారు. ఇంటి స్థలం, గ్రాంట్ ఇచ్చిన తర్వాత కూడా గుడిసెలు తీసివేయకపోతే కఠినంగా ఉండక తప్పదన్నారు.
ఊపిరి లేకపోతే కొన్ని నిమిషాల పాటు మనం ఎలాగైతే బ్రతకలేమో, అలాగే స్వచ్ఛమైన నీరు లేకపోతే ఉద్దానంలో కిడ్నీ సమస్యల తలెత్తినట్లుగానే, ఇక్కడ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజల అనారోగ్యానికి కాలుష్యకారకమైన నీళ్లు కూడా ఒక కారణమేనని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను… ఎవరు ఆపినా ఆగను
పదిమంది పది రోజులపాటు ఇబ్బందిపడిన, లక్షమంది జీవితాంతం సుఖంగా ఆరోగ్యంగా ఉండాలన్నదే నా సిద్ధాంతమని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని, ఎవరు ఆపినా ఆగనని తేల్చి చెప్పారు. చాలామంది నన్ను నువ్వేమీ రాజకీయ నాయకుడివని… ఆ 10 ఓట్లు నీకు పడవు అని అంటుంటారని కానీ ప్రజలంతా సంతోషంగా ఉంటే వాటంత అవే ఓట్లు వస్తాయని నా నమ్మకం అని తెలిపారు.
సోషల్ మీడియాలోనూ కొంతమంది నేను చెప్పిన మాటలను వక్రీకరించి తప్పుగా ప్రచారం చేశారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. రాజుగారు మీ ఓట్లు అక్కరలేదని అన్నారని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగిందని… మంచిదే నేనేమీ బాధపడనని, నేను చేసేది ప్రజా సంక్షేమం కోసం అని, ఆ పది ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు. రాజుగారు ఇలా మాట్లాడారని ట్రోల్ చేస్తున్నవారికి నేను చెప్పేది ఒకటేనని … మేము ఓటు వేయమని అన్న వారితో పర్వాలేదు, కొద్దిమంది ఓట్లు వేయకపోయినా లక్షల మంది సంక్షేమం కోసం, కొద్దిమంది కొన్ని రోజులు ఇబ్బంది పడ్డ దానివల్ల సమాజానికి మంచే జరుగుతుందనేది నా ఉద్దేశ్యం అని చెప్పారు.
అయితే నేను చెప్పిన విషయాన్ని కొద్దిమంది అపార్థం చేసుకున్నారని, అందుకే ఈ వివరణ ఇస్తున్నట్లుగా రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఒకరిద్దరు మనుషుల మనసు కష్టపెట్టాల్సి వస్తుందని, ఆ తర్వాత వారు కూడా అర్థం చేసుకుంటారని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన నారా లోకేష్
మూడు నాలుగేళ్లలో ప్రభుత్వ పాఠశాలలో సీట్లు కావాలని ఎమ్మెల్యేల చుట్టూ రికమండేషన్ల కోసం తిరిగే విధంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని అసెంబ్లీలో నారా లోకేష్ చెప్పారని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. అటువంటి మార్పు ప్రభుత్వ పాఠశాలలలో వచ్చేవరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పి4 కార్యక్రమంలో భాగంగా సమాజంలోని ధనవంతులు అట్టడుగున ఉన్న దత్తత కుటుంబాలలోని పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
సమాజంలోని 10 శాతం మంది ధనవంతులు , అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాలను దత్తత తీసుకొని వారి బాగోగులను చూడడమే చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పి4 విధానంలోని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యతో పాటు వైద్యం ఎంతో ముఖ్యమన్న ఆయన, జిల్లాకు ఒక మెడికల్ కాలేజి దానికి అనుసంధానంగా వెయ్యి పడకల ఆసుపత్రి వస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలలో ఎంతో చేయగలదని, అప్పటివరకు సమాజంలో అట్టడుగున ఉన్నవారికి ధనవంతులు చేయూతనివ్వాలన్నారు.
దత్తత కుటుంబాలలోని పిల్లల విద్య, పెద్దల ఉపాధి అవకాశాల కోసం, తమ కుటుంబ సభ్యుల విద్యా ఉపాధి అవకాశాల కోసం పరితపించినట్లుగానే, పరితపించి వారిని వృద్ధిలోకి తీసుకురావాలన్నారు. ఈ విధానం గత దశాబ్దాలు, శతాబ్దాల క్రితం నుంచి ఉన్నదేనని గుర్తు చేశారు . పూర్వం వారాల అబ్బాయి అనే విధానం ఉండేదని, ఎవరైనా చదువుకోవాలనుకున్న వారికి తమ ఇంటి అరుగుపై ఒకరోజు ఒకరు, మరొక రోజు ఇంకొకరు అన్ని సమకూర్చేవారని గుర్తు చేశారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి సామాజిక ధర్మం పాటించే విధంగా చంద్రబాబు నాయుడు తిరిగి పీ 4 అనే విధానాన్ని తీసుకువచ్చారన్నారు.
ఉండి నియోజకవర్గంలో తాను చేస్తున్న దాని కన్నా పీ 4 విధానం నెక్స్ట్ లెవెల్ అని ఆయన చెప్పారు. మన చుట్టూ ఉన్న సమాజంలో మనకు ఏమేమి లేవో, వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కలుషిత జలాల పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇటీవల ఫోటో కొట్టు ప్రైజ్ పట్టు అని పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు. కాలువల వద్ద ఎవరైనా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలను పడేశారేమో వారిపై చర్యలు తీసుకోవాలని వెళ్లి చూడడం జరిగిందన్నారు. ఏ ఒక్కరు కూడా కొత్తగా కాలువల వద్ద చెత్త వేసిన దాఖలాలు లేవన్నారు.
ప్రజల్లోనూ చైతన్యం వస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధంపై కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావలసిన అవసరం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్లాస్టిక్ రహిత బాటిళ్ల వినియోగానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శ్రీకారం చుట్టారని, ఇప్పుడు భీమవరంలోని తన క్యాంపు కార్యాలయాన్ని కూడా ప్లాస్టిక్ రహిత కార్యాలయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లుగా తెలిపారు.
తాను కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగించకుండా, గాజు బాటిల్ ను వినియోగిస్తున్నట్లుగా తాను ఉపయోగిస్తున్న గాజు బాటిల్ ను మీడియా ప్రతినిధుల ముందు రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు.
పగడాల ప్రవీణ్ మరణాన్ని ఒక మతంపై దాడిగా చిత్రీకరించడం దురదృష్టకరం
పాస్టర్ పగడాల ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా నిన్న, ఈరోజు పత్రికలలో చూశామని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఆయన ఒక పాస్టర్ కావచ్చు ఆ వృత్తి వరకు ఆయన న్యాయమే చేసి ఉండవచ్చు. మద్యం పుచ్చుకొని ద్విచక్ర వాహనం నడపడం నేరం. ఒక నేరానికి పాల్పడి రోడ్డు ప్రమాదంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ చనిపోయినట్లుగా పత్రికల్లో చూసాం.
ఆయన రెండు చోట్ల మద్యాన్ని కొనుగోలు చేసి, మద్యం షాపులకు ఫోన్ పే ద్వారా బిల్లును చెల్లించినట్టు గా వీడియో ఆధారాలు ఉన్నాయి. ఆ వీడియో ఆధారాలు పత్రికల్లో రాకముందే, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే పగడాల ప్రవీణ్ మృతిని ఒక మతంపై జరిగిన దాడిగా చిత్రీకరించాలన్న ప్రయత్నం చేయటం దురదృష్టకరమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలో అధికారిక జనాభా లెక్కల ప్రకారం బీసీసీ కి చెందిన క్రిస్టియన్లు కేవలం రెండు శాతం మంది మాత్రమేనని, ప్రస్తుతం నిర్వహిస్తున్న శాంతి సంతాప సభలలో అంతకుమించి పాల్గొంటున్నారన్నారు.
ఈ లెక్కన అధికారిక జనాభా లెక్కలు తప్పేమోనని ఆయన అన్నారు. ఒక మనిషి చనిపోయినప్పుడు ఎవరైనా బాధపడతారని, ఒక వ్యక్తి వ్యసనం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణిస్తే, అది మరొక మతం వారు చేసిన హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని అన్నారు. రేపో, మాపో పూర్తి వివరాలు తెలుస్తాయని అప్పుడు మరింత వివరంగా మాట్లాడుకుందామని చెప్పారు. మత విద్వేషాలతో ప్రజల్ని రెచ్చగొట్టాలని చూడడం దారుణమన్న ఆయన, కలిసిమెలిసి ఉంటున్న ప్రజల మధ్య మతం చిచ్చు రగిలించే విధంగా శాంతి పేరిట అశాంతి సృష్టించి, మౌన దీక్ష పేరుతో ఇంత తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేయడం అత్యంత బాధాకరమని అన్నారు.
పగడాల ప్రవీణ్ ఆత్మకు శాంతి కలగాలని మా దేవుడిని కూడా ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన ఆత్మ శాంతి కోసం అందరం ప్రార్థిద్దామని, యాక్సిడెంట్ కావాలని ఎవరూ చేసుకోరని, ఆ సంఘటనను ఇతర మతస్తుల పైకి తోసి దాన్ని తమకు అనుకూలంగా వాడుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు .
ఏడు, 8 తేదీలలో విచారణ కు హాజరుకావాలని ప్రభావతికి ఆదేశించిన న్యాయస్థానం
కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో భాగంగా ఈనెల 7 8వ తేదీలలో జరగనున్న విచారణకు హాజరుకావాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరిండెంట్ ప్రభావతిని సుప్రీం కోర్టు ఆదేశించినట్టుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభావతి దొంగ నివేదికలను ఇచ్చింది… చేయలేనన్ని తప్పులను చేసింది. ఆరోజు విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లు 164 స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర తీసుకు వెళ్లారు. ప్రభావతికి వయసు అయిపోయిందట… ఇప్పుడు ఆమె ఏమీ చెప్పడం లేదు . మౌనమే ఆమె సమాధానమయింది.
ఈ కేసును న్యాయస్థానం 15వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఈ కేసులోని మరో కీలక వ్యక్తి సునీల్ నాయక్ బీహార్ లో దాక్కున్నాడు. విచారణకు హాజరు కావడం లేదు. బీహార్ నుంచి సునీల్ నాయక్ వస్తాడా?, లేకపోతే ఈ అధికారులే అక్కడకు వెళ్లి విచారిస్తారా?… సునీల్ నాయక్ విచారణకు హాజరు కాక తప్పదు. నన్ను హత్య చేయడానికి చేసిన కుట్రలో అతడి పాత్ర కీలకం. అలాగే అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన వివేక్ యాదవ్ ను ఎప్పుడు విచారణకు పిలుస్తారో తెలియదు. ఇప్పటికైనా ప్రభావతి తన తప్పును తెలుసుకొని నిజం చెబుతుందా?
లేకపోతే ఆమె నిజం చెప్పలేదని కోర్టు తెలుసుకునే విధంగా చేస్తుందా?? అన్నది చూడాలి. ఈ కేసులో A1 నిందితుడుగా ఉన్న పీవీ సునీల్ కుమార్ ప్రస్తుతం సైలెంట్ అయిపోయాడు. అతడు పై ఏసీబీ కేసు నడుస్తోంది. ప్రస్తుతం నా కస్ట్టోడియల్ టార్చర్ కేసు నిదానంగా కొనసాగుతున్న సజావుగానే సాగుతోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.