Suryaa.co.in

Editorial

డీజీపీ.. కిస్సా కుర్సీ కా

(అన్వేష్)

ఏపీ పూర్తి స్థాయి డీజీపీ ఎవరు? ఇప్పటి ఇన్చార్జి డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తానే ఎంపిక చేస్తారా? లేక సీనియారిటీని గౌరవించి మాదిరెడ్డి ప్రతాప్‌ను ఎంపిక చేస్తారా? ఆరుగురు సీనియర్ ఐపిఎస్‌లపై కఠిన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. డీజీపీ ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇదీ ఇప్పుడు పోలీసు-రాజకీయ శాఖలో హాట్‌టాపిక్.

ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల మొదటి 12 మంది సీనియారిటీ జాబితాలో మొదటగా ఉన్నవారు 1991 బ్యాచ్ కి చెందిన మాదిరెడ్డి ప్రతాప్. ఆ తర్వాత వరుసగా హరీష్ కుమార్ గుప్తా(1992) పీఎస్ఆర్ ఆంజనేయులు(1992). కె.వి.ఆర్.ఎన్. రాజేంద్రనాథ్ రెడ్డి(1992) నలిన్ ప్రభాత్(1992) మహేష్ దీక్షిత్(1993) అమిత్ గర్గ్(1993). పివి సునీల్ కుమార్(1994) కుమార్ విశ్వజిత్(1994) రవిశంకర్ అయ్యన్నార్(1994) బాలసుబ్రమణ్యం1994) కృపానంద్ త్రిపాఠి(1994).. ఉన్నారు.

హరీష్ కుమార్ గుప్తా రిటైర్మెంట్ డేట్ 2 ఆగస్టు. 2025. కానీ డిజిపి నియమకాల్లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్…గత ప్రభుత్వం పాటించలేదు. ఇదే తొలిసారిగా రూల్స్ పాటిస్తూ లిస్ట్ పంపించారు. ఒకవేళ మన రాష్ట్ర ప్రభుత్వం మార్చి మూడో తారీకు తర్వాత, కేంద్ర ప్రభుత్వానికి లిస్ట్ పంపించినట్లయితే..హరీష్ కుమార్ గుప్తా 2025 ఆగస్టు 2 న రిటైర్ అవుతున్నారు కనుక..డిజిపి పదవి పొడుగింపు సాధ్యమా?

సుప్రీంకోర్టు 2006లో ప్రకాష్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం, రాష్ట్రాల డీజీపీల నియామకంలో రాజకీయ జోక్యం లేకుండా మెరిట్, సీనియారిటీ మరియు అనుభవం ఆధారంగా నియామకాలు జరగాలని స్పష్టం చేసి.. డీజీపీల నియామకాలు జరగాలని ఆదేశాలు జారీ చేసింది..! ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయమే ఫైనల్..

నియారిటీ జాబితాలో ఉన్న ఐపిఎస్ లు అందరి సంగతులు ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు.

మాదిరెడ్డి ప్రతాప్ 1 జూలై 2026 న రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియారిటీ జాబిబాలో తొలి వరసలో ఉన్న మాదిరెడ్డికి డీజీపీ అవకాశం ఇస్తారా? లేదా అన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఇప్పటివరకూ కమ్మ, ఉత్తరాది అధికారికి డీజీపీ పదవులు లభించాయి తప్ప, రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారులకు డీజీపీ పోస్టింగ్ దక్కలేదు. అయితే, ఆరుగురు ఐపిఎస్‌ల విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. డీజీపీ ఎంపిక విషయంలోనూ అంతే కఠినంగా వ్యవహరిస్తే మాదిరెడ్డి ప్రతాప్ ఎంపిక సులభమేనంటున్నారు.

కాగా మాదిరెడ్డి కూడా జగన్ బాధితుడే. జగన్ హయాంలో ఆయన కొద్దికాలం మాత్రమే ఏపిఐఐసి, ఆర్టీసీ ఎండీగా పనిచేసి, తర్వాత వెయిటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఫైర్ డీజీగా నియమితులయినా మళ్లీ తర్వాత వెయింటింగ్‌లో ఉంచారు. పివి సునీల్‌ను ఆయన స్థానంలో నియమించారు.

ముక్కుసూటి అధికారి, ఏ శాఖలో పనిచేసినా తనదైన మార్కు, సంస్కరణలు చూపించే మాదిరెడ్డి ప్రతాప్.. పైవారి మాటలు వినకపోవడం, ఎవరితో సంబంధాలు లేకపోవడం వల్లే ఇప్పటివరకూ లూప్‌లైన్లలో ఉన్నారన్న ప్రచారం అధికారవర్గాల్లో లేకపోలేదు.

LEAVE A RESPONSE