ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికి ప్రత్యక్ష నిదర్శనం

– దూళిపాళ్ళ నరేంద్ర కుమార్
పొన్నూరు: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయాలను వినిపించేందుకు వేదికలైన రాజకీయ పార్టీ కార్యాలయాలపై, పోలీసు సహకారంతో ప్రభుత్వ వర్గాలు దాడులు చేయటం హేయమైన చర్య అని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదమని టి‌డి‌పి సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎం‌ఎల్‌ఏ దూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. బుధవారం టి‌డి‌పి రాష్ట్రవ్యాప్త బంద్ నేపధ్యంలో పొన్నూరు పోలీసు అరెస్ట్ అనంతరం నరేంద్రకుమార్ మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ సహకారంతో ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం, పలువురు పార్టీ నేతల ఇల్లు, కార్యాలయాలపై దాడులు జరిగాయని తెలియజేశారు.
రాజకీయాలలో సిద్దాంతపరమైన వైరుద్యాలు ఉండటం సహజమని, పోలీసులే మార్గం చూపెట్టి దాడికి పురికొల్పారనేందుకు నిన్న టి‌డి‌పి కార్యాలయంలోని రెండవ అంతస్తులో అనుమానాస్పదంగా దొరికిన సత్యం నాయక్ అనే పోలీసు అధికారే నిదర్శనమని అన్నారు. డి‌జి‌పి పి ఆర్ వో ఆసిస్టెంట్ గా ఉన్న ఇనస్పెక్టర్ కు టి‌డి‌పి ఆఫీసులో ఏమిపని అని నరేంద్రకుమార్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం మీద జరిగే దాడిపై నిరసన తెలిపేందుకు బంద్ కు పిలుపునిస్తే, అధికార పక్షం నిరసనలకు పిలుపునివ్వటం వారికి పోలీసులు మద్దతునిచ్చి ర్యాలీలు జరపటం, ప్రెస్ మీట్లు పెట్టించటం రాష్ట్ర డి‌జి‌పి అలసత్వానికి, చేతగాని తనానికి నిదర్శనమని తెలిపారు.
ప్రతిపక్ష పార్టీకి ఎదురోచ్చి దాడులకు పాల్పడుతుంటే తరిమికొట్టే సత్తా టి‌డి‌పి నాయకులు, కార్యకర్తలకు ఉందని అన్నారు. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని దాడులకు పాల్పడినప్పుడే మీపతనం ప్రారంభమైంది. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎన్‌టి‌ఆర్ స్పూర్తితో నడిచే పార్టీ తెలుగుదేశంఅని వైకాపా పార్టీ లెక్క అప్పజెప్పే రోజు అతి త్వరలోనే ఉందని నరేంద్రకుమార్ వైకాపాను హెచ్చరించారు.

Leave a Reply