– కూటమి నేతలతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో భాగంగా స్కూల్ బ్యాగులను జోజి నగర్ లోని శ్రీ దుర్గా మల్లేశ్వర యండూరి రామలింగేశ్వర రావు హై స్కూల్ విద్యార్థులకు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమినేతలతో కలిసి అందజేశారు.
కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య , పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ యండూరి శివకృష్ణ కిషోర్, పాఠశాల అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు, ప్రధానోపాధ్యాయులు మొగుళ్ళూరి కృష్ణ కుమార్ తదితరులతో కలిసి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ముందుగా పాఠశాల ప్రధానదాత యండూరి రామలింగేశ్వర రావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ యండూరి శివకృష్ణ కిషోర్ మాట్లాడుతూ గత 65 ఏళ్లుగాఎస్.డీ.ఎం.వై.ఆర్.ఆర్ పాఠశాల విద్యార్థులకు సేవా దృక్పథంతో నాణ్యమైన విద్యను అందించడంతో పాఠశాల అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు లక్ష్యంతో చదవాలన్నారు.
కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా పథకాన్ని వర్తింపజేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి సుజనా ఫౌండేషన్ ద్వారా పశ్చిమ నియోజకవర్గం లోని పాఠశాలలను అభివృద్ధి చేస్తూ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని విద్యార్థులందరూ కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కార్పొరేటర్ బుల్లా విజయ్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు