– టిటిడి డిప్యూటేషన్ అధికారికి,ధర్మకర్తల మండలికి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరిక
టీటీడీలో డిప్యూటేషన్ అధికారులు నియంతల్లా వ్యవహరిస్తే భక్తులు తిరగబడి తరిమికొట్టే ప్రమాదం ఉందన్నారు. తిరుమల శ్రీవారి భక్తుల,స్థానికుల,టిటిడి ఉద్యోగస్తుల,అర్చకుల సహనాన్ని చేతకానితనంగా చూడకండి. శ్రీవాణి ట్రస్టున”ఆదాయ వనరుగా” “ATM కార్డ్” లా మార్చేస్తారా! అని నవీన్ నిలదీశారు
శ్రీవాణి ట్రస్ట్ పెట్టమని ఎవరు అడిగారు? దేశమంతా గుళ్ళు కట్టమని ఏ భక్తుడు కోరాడు, వ్యక్తిగత ప్రతిష్ట,ఆదాయం కోసం శ్రీవాణి ట్రస్ట్(శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్) పెట్టి 10,500 లు ఒక్క టిక్కెట్టుకు భక్తుని దగ్గర తీసుకొని పరిమితికి మించి శ్రీవాణి ట్రస్టు టికెట్లు ప్రతిరోజు ఇస్తూ మొదట ప్రారంభంలో ప్రకటించిన శ్రీవాణి ట్రస్ట్ గైడ్ లైన్స్ “గాలికి వదిలేస్తారా” అని నిలదీశారు.
తిరుమలలో మొన్న అన్నదానం కాంప్లెక్స్ లో భక్తుల ఆందోళన నిన్న శ్రీవాణి ట్రస్ట్ భక్తుల ఆవేదన రాష్ట్ర ప్రభుత్వానికి,ధర్మకర్తల మండలికి, దేవాదాయశాఖ మంత్రికి కనపడలేదా వినపడలేదా?అని ప్రశ్నించారు. శ్రీవారి భక్తుల ఆవేదనను, ఆందోళనలను పరిగణలోకి తీసుకోకుండా కించపరిచేలా,ఎదురు దాడి చేసేలా ప్రవర్తిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని భక్తులకు సేవకులుగా పనిచేయండని హెచ్చరిస్తున్నాను.
శ్రీవాణి ట్రస్టు టికెట్లను ఆన్ లైన్ లో కొంత ఇచ్చి తిరుమలలో “కరెంటు బుకింగ్” లో పరిమితికి మించి టిక్కట్లు ఇవ్వడం కారణంగా ఒక్కొక్కరికి 10,500 టిక్కెట్లు కొన్న భక్తులు అర నిమిషం కూడా గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకోలేక,ఎవరికి చెప్పుకోవాలో తెలియలేక గోవిందా అనుకుంటూ ఆవేదనతో వెళ్తున్నారన్నారు.
టిటిడి డిప్యూటేషన్ అధికారి శ్రీవాణి టిక్కెట్లను అధికంగా ఇచ్చి త్వర త్వరగా “లైన్ క్లియర్ చేయండి” అని గర్భాలయంలో పనిచేస్తున్న టిటిడి ఉద్యోగస్తులను ఆదేశించడంతో, ఉన్నతాధికారి ఆదేశాల మేరకే లైన్ క్లియర్ చేసేందుకు భక్తులను ఆలయ సిబ్బంది లాగేస్తున్నారన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను,వీఐపీ టికెట్లను “పరిమితికి మించి” ఇవ్వకుండా “లఘు,మహా లఘు” పేరుతో
“జయ విజయుల” దగ్గర నుంచి శ్రీవారిని దర్శించే సంస్కృతికి స్వస్తి పలికి తిరుమలకు వచ్చే ప్రతి భక్తునికి “గర్భాలయం చివరి గడప” వరకు అనుమతించి, శ్రీవారిని దర్శించుకునేలా టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకొని ప్రకటించాలని నవీన్ డిమాండ్ చేశారు.
టీటీడీ కి తాత్కాలికంగా వచ్చే డిప్యూటేషన్ అధికారుల నియంతృత్వ పోకడలకు అటెండర్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగస్తులు,ఉద్యోగ సంఘ నాయకులు నిస్సహాయకులుగా ఆవేదన చెందుతున్నారన్నారు.
టిటిడిలో జరుగుతున్న వరుస సంఘటనల కారణంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని మఠాధిపతులు పీఠాధిపతులు మౌనం వీడి టిటిడి పవిత్రతను కాపాడాలన్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలతో వేలాదిమందికి “జీతభత్యాలు” చెల్లిస్తున్నారని “పదవీ విరమణ” చేసిన వారికి “పెన్షన్లు” ఇస్తున్నారన్న విషయాన్ని డిప్యూటేషన్ అధికారి, ధర్మకర్తల మండలి గుర్తించి భక్తులను అగౌరపరచకుండా శ్రీవారి దర్శనాన్ని సంతృప్తికరంగా కల్పించాలని నవీన్ డిమాండ్ చేశారు.