* చంద్రబాబు నాలుగోసారి సీఎం అయినా పేదరికం ఎందుకుంది?
* ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఒక్కో నియోజక వర్గానికి రూ.10-100 కోట్ల పంచడానికి డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయి?
* బీసీ, ఎస్సీ, ఎస్టీలను కించపరచడం చంద్రబాబు మానుకోవాలి
* అధికారం మీకిస్తే.. వాళ్లు బాగుచేయాలని చెప్పడమేంటి?
* పీ4 పథకంపై బీఎస్పీ ఏపీ సమన్వయకర్త పూర్ణచంద్రరావు ధ్వజం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఇప్పటికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన పాలనాకాలంలో ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలు అయ్యార తప్ప మరేమీ ఒరగలేదని బీఎస్పీ ఏపీ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్ పూర్ణచంద్రరావు మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టినట్లు చెబుతున్న పీ4 పథకంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యి ఏం సాధించినట్లు? ఆయన కుటుంబం ధనవంతులు కావడానికి, ఆయన కుమారుడు మంత్రి కావడానికే ఉపయోగపడినట్లు కనిపిస్తోంది. ప్రజలకు ఏమీ పనికిరాలేదు. ఆయన నాలుగుసార్లు సీఎం అయినా ప్రజలు ఇప్పటికీ ఎందుకు వెనకబడే ఉంటున్నారు? అసలు రాజకీయాలతో డబ్బు సంపాదించాల్సిన పని లేకుండా హెరిటేజ్ పెట్టుకున్నట్లు ఆయన చెబుతున్నారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఏపీలో ఒక్కో నియోజక వర్గానికి రూ.10 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చుపెట్టారు. ఆ డబ్బంతా ఎక్కడినుంచి తెచ్చారు? టీడీపీ ఖజానా నుంచి ఏమైనా ఇచ్చారా? ఆ కిటుకులేవో బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లిం ప్రజలు నేర్చుకోవాలి. చంద్రబాబు రాజకీయాల్లో డబ్బు సంపాదించి, అధికారాన్ని హస్తగతం ఎలా చేసుకుంటున్నారో తెలుసుకోవాలి.
పదేపదే ప్రతిసారీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలను కించపరిచేలా మాట్లాడవద్దు. మీరు చెప్పేవి, చేసేవన్నీ ప్రచారం కోసమేనని అందరికీ తెలుసు. మీరు గతంలో ప్రవేశపెట్టిన జన్మభూమి, శ్రమదానం, క్లీన్ అండ్ గ్రీన్, నీరు-చెట్టు లాంటి కార్యక్రమాలతో ఏం లాభం వచ్చింది? మన దగ్గర బీసీ, ఎస్సీ, ఎస్టీల తలసరి ఆదాయం రూ.70 వేలకు మించి లేదు. అంటే ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి. కానీ రోజుకో మాట పూటకో ప్రచారంతో మీరు కాలం గడిపేస్తున్నారు.
మేఘా కృష్ణారెడ్డికి ఎక్కడి నుంచి అన్ని డబ్బులొచ్చాయి? ఏపీ, తెలంగాణ నుంచి ఆయనకు ఎన్ని వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు? వాటి నుంచి పర్సంటేజిలు ఏయే ముఖ్యమంత్రికి ఎన్ని వెళ్లాయో శ్వేతపత్రం విడుదల చేయగలరా? పర్సంటేజి ఎంత 6 శాతమా? 10 శాతమా? అసలు ఈ దత్తత తీసుకోవడం ఏంటి? ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు.
దాన్ని వదిలేసి వాళ్లకు, వీళ్లకు దత్తత ఇవ్వడమేంటి? జగన్ వైఫల్యం వల్ల మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పటికైనా మీరు ప్రచారార్భాటం, పిచ్చిమాటలు మానుకోండి. బడుగు, బలహీనవర్గాలను కించపరచడం మానుకోండి. ఏమైనా అంటే బరోడా మహారాజు గురించి చెబుతారు. ఆయన వల్ల ఎంతమంది అంబేడ్కర్‌లు అయ్యారో చెప్పమనండి? బ్రాహ్మణ గురువు వల్లే అబ్దుల్ కలాం గొప్పవారయ్యారని అంటున్నారు. మరి ఆ గురువు చదువు చెప్పినవారిలో ఎంతమంది కలాంలు అయ్యారు?
ఎవరైనా మేధస్సు, అకుంఠిదీక్ష ఉండి కూడా.. అంటరానితనం వల్ల బాధలు అనుభవించి, మనసులో అగ్ని రగిలి, గుండె పగిలితే ఒక అంబేడ్కర్ పుడతాడు. కానీ మీరు చెప్పేదంతా చాలా విచిత్రంగా ఉంటోంది. గ్రామాల్లో ఎవరైనా అమ్మాయి మీద అత్యాచారం చేస్తే.. అలా చేసినవాడికే ఇచ్చి పిల్లను కట్టబెడతారు. అలాంటి సంస్కృతి ఈ దేశంలో ఉంది.
ఈ మనువాద సంస్కృతి దేశాన్ని ఎంత దగా చేసిందంటే.. ఈ పేదలు, బలహీన వర్గాల వాళ్లను ధనికులు బాగు చేయడం ఏంటి? ఇది ప్రజల దేశం తప్ప ధనికుల దేశం కాదు. అదానీలు, అంబానీలు, జిందాల్ లాంటివాళ్లను మీరు పెంచి పోషిస్తున్నారు. ఈ తరహా రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకండి” అని డాక్టర్ పూర్ణచంద్రరావు సూచించారు.