వైసీపీ వాదన-అసెంబ్లీకి చట్టాలు చేసే అధికారం లేదు అంటారా?

హైకోర్టు ఏమి చెప్పింది – అసెంబ్లీకి చట్టాలు చేసే అధికారం లేదని ఎక్కాడా చెప్పలేదు. చట్టాలు ఉల్లంఘించే అవకాశం లేదని, మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు గురించి స్పష్టంగా చెప్పింది. హైకోర్ట్ తీర్పులోని పేజీనెం- 291, 292 లోని పేరా గ్రాఫ్ నెంబర్ 492, 493లో గతంలో సుప్రీం కోర్టు మంగళ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాజధానిలో భాగమైన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ ఆర్గాన్స్ ఏర్పాటు నిర్ణయం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 ప్రకారం, పూర్తిగా పార్లమెంటు పరిధిలోకే వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు.

గతంలో మన రాష్ట్ర రాజధాని అమరావతి ఏర్పాటు నిర్ణయం కూడా పార్లమెంటు ద్వారా రూపొందించిన విభజన చట్టం ఆధారంగా ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక సిఫారసు ద్వారా జరిగింది. నేడు ఈ ప్రభుత్వం రాజధాని విషయంగా ఏంచేయాలన్నా తిరిగి పార్లమెంట్ ద్వారానే చేయాలి తప్పితే మరో మార్గం లేదు.
హైకోర్టు చెప్పింది, ఏపి రాజధాని మార్చాలి అంటే, చట్ట ప్రకారం అసెంబ్లీకి అవకాశం లేదు, ఏదైనా పార్లమెంట్ ద్వారా జరగాలని.
బీజేపీతో బాగానే ఉంటావు, అలాగే రాజ్యసభలో నీ బలంతోనే, మోడీ బిల్లులు పాస్ చేపిస్తున్నాడు కదా. వెళ్లి పార్లమెంట్ లో రాజధాని పై చట్టం చేసుకుని రా.

వైసీపీ వాదన – అన్ని ప్రాంతాలకు వైసీపీ అనుకూలం, టిడిపి కేవలం అమరావతి కావాలి అంటుంది.
సరే అయితే… మరి అన్ని ప్రాంతాల అభివృద్ధికి మీరు కట్టుబడి ఉన్నారా? మీరు చెప్పే ఉత్తరాంద్ర,రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ మూడు సంవత్సరాల కాలంలో ఒక్క ప్రాజెక్ట్ తెచ్చారా? ఒక్క ఉద్యోగం అదనంగా కల్పించారా? ఒక్క ఎకరాకైనా అదనంగా నీరిచ్చారా? మీ ముఖాలకు ఈ మూడేళ్లలో ఉత్తరాంధ్రలో ఏంచేశారో..రాయలసీమకు ఏం ఒరగబెట్టారో చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు.
టీడీపీప్రభుత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎన్ని కంపెనీలు వచ్చాయో, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసామో, వంద చెప్పగలం. చర్చకు రెడీనా ?

వైసీపీ వాదన – అమరావతి మొత్తం గ్రాఫిక్స్, భ్రమరావతి
హైకోర్ట్ తీర్పు – పేజీనెంబర్ 178లో చాలా స్పష్టంగా అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటివరకు చేసిన మొత్తం ఖర్చు రూ.15వేల కోట్ల రూపాయలని, దానిలో నిర్మాణ పనులకు సంబంధించి చేసిన ఖర్చు రూ.5674 కోట్లని, చేసిన పనులకు ఇంకా చెల్లించాల్సిన మొత్తం రూ.1850 కోట్లని, వివిధ పనులకు సంబంధించి మొబిలైజ్ అడ్వాన్సులకింద రూ.5,200 కోట్లు ఇచ్చారని హైకోర్ట్ తీర్పులో చాలా స్పష్టంగా ఉంది. అలాగే గతంలో అమరావతిలో అనేక కేంద్ర సంస్థలకు, విద్యా సంస్థలకు, ప్రైవేటు కంపెనీలకు భూములు ఇచ్చారని, ప్రభుత్వం అనేక భవనాలు కట్టిందని, 90% ఆ భవనాలు పనులు కూడా అయ్యాయని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.
అంత ఎందుకు.. ఈ మూడేళ్ళు జగన్ రెడ్ది పరిపాలించింది చంద్రబాబు కట్టిన సచివాలయం, ఆఫీసుల నుంచే. అసెంబ్లీ శాసనాలు చేసింది చంద్రబాబు కట్టిన అమరావతి నుంచే. కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా, ఇవాన్నీ గ్రాఫిక్స్ అంటే, వాళ్ళు పిచ్చోళ్ళు, మెంటల్ వాళ్ళు , మానసిక జబ్బులు ఉన్న వాళ్ళు కింద లెక్క.

వైసీపీ వాదన – అమరావతిలో మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళు, కమ్మ వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్న హంగామా ఇది.
హైకోర్టు తీర్పు – అమరావతిలో 93 శాతం మంది సన్న, చిన్న కారు రైతులు, భూములు ఇచ్చారు. హైకోర్ట్ తీర్పులోని పేజీనెం 178లో ఎకరం కంటే తక్కువ ఉన్న రైతులు రాజధానిలో 20,422 మంది వరకు ఉన్నారని న్యాయ స్థానం చెప్పింది. ఎకరం కంటే తక్కువ ఉన్న రైతుల 10 వేల ఎకరాలకు పైగా భూమిని రాజధానికి ఇచ్చారు. అంటే 30 శాతం భూమి అలాంటి పేద దళిత రైతులు ఇచ్చిందే. అలానే ఎకరం నుంచి 2.50 ఎకరాల భూమి ఉన్న రైతులు 6,278 మంది ఉన్నారని, వారు ఇచ్చిన భూమి 9,780 ఎకరాల వరకు ఉందని కూడా న్యాయస్థానం చెప్పింది. మొత్తం రాజధానికి 29,750 మంది రైతులు భూములు ఇస్తే, వారిలో ఎకరం నుంచి 2.5 ఎకరాల వరకు ఉన్న వారే 27 వేల మంది వరకు ఉన్నారు. వారంతా పేదరైతులే. వారిలో దళితులే అధికంగా ఉన్నారు.

వైసీపీ వాదన – అమరావతికి లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. అంత భరించలేం.
హైకోర్టు తీర్పు – పేజి నెం.188, పేరాగ్రాఫ్ నెం.292లో , గత ప్రభుత్వం అనేక సందర్భాల్లో అమరావతి నిర్మాణానికి సంబంధించి విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ఉన్న అంశాలు కోర్టు చెప్పింది. మార్చి 2016, మార్చి 2017, డిసెంబర్ 2017, ఏప్రియల్ 2018, ఫిబ్రవరి 2019లో టీడీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణంపై 5 సార్లు శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఆయా శ్వేతపత్రాల్లో నిధుల సమీకరణ ఎలాచేయాలో కూడా గత ప్రభుత్వం వివరంగా చెప్పింది. వాటి గురించి ప్రస్తావించిన న్యాయస్థానం ఆ అవకాశాలను ఈ ప్రభుత్వం ఎందుకు వినియోగించుకోలేక పోతోందని కూడా ప్రశ్నించింది.

గత ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో నిధుల సమీకరణకు ఉన్న మార్గాలేమిటో..అందుకోసం ఎలాంటి విధానాలు అవలంభించాలనేది కూడా ఆయా శ్వేతపత్రాల్లో ఉన్నట్లు హైకోర్ట్ చెప్పింది. అందువల్ల నిధుల కొరత అనేమాట చెప్పి తప్పించుకోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అవకాశం లేదని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది.

అమరావతి ద్వారా సృష్టించిన సంపదతోనే రాజధాని నిర్మాణం చేపట్టవచ్చని, తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చని గతంలో చంద్రబాబుగారు చాలాసార్లు చెప్పారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సు సిటీ, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా, అమరావతిని నిర్మించ వచ్చు. లక్ష కోట్లు ఇప్పటికిప్పుడు ఖర్చు పెట్టరు, కాలానుగుణంగా, అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు అది. అమరావతిలో వచ్చే నిధులతోనే, నిర్మాణం జరుగుతుంది.

వైసీపీ వాదన – అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా చంద్రబాబు చేసాడు.
వాస్తవం – అమరావతి 29 గ్రామాల్లో, పేదల కోసం, 45 ఎకరాల్లో ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు. అమరావతిలో 7876 మంది ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి.. రూ.650 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో ఇళ్ళ నిర్మాణం చేపట్టారు. మొదటి విడతగా, అమరావతి రాజధాని నగర పరిధిలో 8 చోట్ల మొత్తం 44 ఎకరాల్లో 157 బ్లాకుల్లో 5,024 ఫ్లాట్లు నిర్మించారు. 345 కోట్ల వ్యయంతో నిర్మాణాలు జరిగాయి.

రాజధాని ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్మించి, అంతా సిద్ధమైన 5వేల పక్కా గృహాలను పేదలకు ఇవ్వకుండా ఈప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందో జగన్ చెప్పాలి? నిజంగా ఆయనకు, ఆయన ప్రభుత్వానికి రాజధానిలోని పేదలపై అంతటి ప్రేమే ఉంటే తక్షణమే టీడీపీ హయాంలో నిర్మించిన 5వేల పక్కా గృహాలను వారికి కేటాయించాలి.
వైసీపీ వాదన – అమరావతిలో అవినీతి జరిగింది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది.

వాస్తవం – అమరావతిలో ఎలాంటి అవినీతి జరగలేదని, హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా చెప్పాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే మాట లేదని, సుప్రీం కోర్టు చారిత్రాత్మిక తీర్పు కూడా ఇచ్చింది.

ఇది పక్కన పెడదాం, గత మూడు సంవత్సరాల కాలంలో టిడిపి అవినీతిని బయటకు లాగుతాం అని ఏర్పాటు చేసిన సిట్ లు ఏం సాధించాయో సమాధానం చెప్పాలి. అమరావతిలో పైసా కూడా అవినీతి జరిగిందని నేటివరకు నిరూపించలేని మీరు ఇంకా ఎన్నిరోజులు ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తారు?

-శ్రీనివాసరెడ్డి, సీనియర్ జర్నలిస్టు